దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సుదూర పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సుదీర్ఘ పాలనకు అడ్డుకట్ట వేసి కమ్యూనిస్టులు మూడు దశాబ్దాలు పాలిస్తే, కమ్యూనిస్టుల ప్రాభవానికి గండి కొట్టి మమతా దీదీ సాధించిన హ్యాట్రిక్‌ను పక్కకు నెట్టి బీజేపీ పట్టు బిగించింది. అయితే తమిళనాడులో సినీనటుడు విజయ్ సాధించిన అద్భుత విజయం బెంగాల్ గెలుపు గురించి బీజేపీ మరీ ఎక్కువగా జబ్బలు చరుచుకోకుండా చేసింది. తమిళనాట ఒక ద్రవిడ పార్టీకి పోటీగా మరో ద్రవిడ పార్టీతో చేతులు కలిపి రంగంలోకి దిగిన బీజేపీకి చుక్కెదురైంది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మూడోస్థానం దక్కటమే అందుకు నిదర్శనం. అందులోనూ బీజేపీ సొంతంగా కేవలం నాలుగే సీట్లతో సరిపెట్టుకోవాల్సి రావటం ఆ పార్టీ దయనీయ స్థితిని తెలియజేస్తున్నది.
డీఎంకే-అన్నాడీఎంకే దాగుడు మూతల పరంపరకు తమిళ ఓటర్లు స్వస్తి చెప్పి మూడో ప్రత్యామ్నాయమైన తమిళ వెట్రి కళగం (టీవీకే)కు ఆధిక్యత కట్టబెట్టటం ఇపుడు సంచలనం సృష్టిస్తున్నది. పార్టీ పెట్టిన రెండేండ్లలో విజయ్ సీఎం పదవికి చేరువ కావటం ఎమ్జీఆర్, ఎన్టీయార్ చరిత్రను గుర్తుకు తెస్తున్నది. రెండు ద్రవిడ పార్టీలు ఏకకాలంలో ఓటమిపాలు కావటంతో సుమారు ఆరు దశాబ్దాల ద్వంద్వ ఆధిపత్యానికి గండి పడింది. మరో అంశం ఏమంటే..ఇటు తమిళనాడు, అటు బెంగాల్లో ఓడిపోయినవి ఇండియా కూటమి పార్టీలే. కానీ అవి కలిసి పోటీ చేయలేదు. బెంగాల్లో పాలకపక్షంపై ప్రజల విముఖత బీజేపీకి లాభిస్తే, తమిళనాడులో మూడోపక్షం ఆ లాభాన్ని ఎగరేసుకుపోవటం కమలదళాన్ని కలవరపాటుకు గురిచేసే అంశమే. కాగా కేరళంలో ‘ఒకసారి నువ్వు-ఒకసారి నేను’ అటూ వంతుల వారీగా సాగే పద్ధతిలోనే కమ్యూనిస్టుల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఓటమిపాలై, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచింది. పదేండ్లపాటు పాలించిన ఎల్డీఎఫ్ అధికార పీఠాన్ని నిలబెట్టుకోలే కపోయింది. చివరి రాష్ర్టాన్ని కోల్పోయిన కమ్యూనిస్టులు ఇక కోలుకోవటం కష్టమే! ఇక్కడా బీజేపీకి ఒరిగిందేమీ లేదు.
బీజేపీకి నికరంగా గెలుపు లభించింది బెంగాల్లోనే. అయితే, ఆ విజయం అంత సులభంగా సాధ్యం కాలేదనేది తెలిసిందే. జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీ సొంత గడ్డ అయిన బెంగాల్లో బీజేపీ సర్వశక్తులూ వొడ్డి చేజిక్కించుకోవటం, వరుసగా మూడు విడతల పరిపాలన సాగించిన మమతా బెనర్జీ మట్టికరవటం గురించి ప్రజలు చాన్నాళ్లు చర్చించుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. బెంగాల్ ఎన్నికలు ‘మోదీ వర్సెస్ దీదీ’ అనే తరహాలో హోరాహోరీగా జరిగాయి. ఈడీ నుంచి ఈసీ దాకా బీజేపీ తనకు అందుబాటులో ఉన్న సకల సంస్థలను ఉపయోగించింది. హేమాహేమీలను రంగంలోకి దింపింది. ప్రధాని నరేంద్ర మోదీతో సహా అనేకమంది కేంద్ర మంత్రులు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా పలువురు ఆ పార్టీ సీఎంలు ప్రచారంలో తలమునకలయ్యారు. ఓటర్ల జాబితా ప్రత్యేక తీక్షణ సమీక్ష (క్లుప్తంగా సర్) వివాదాస్పదం కావడం, కనీవినీ ఎరుగని రీతిలో కేంద్ర బలగాలను మోహరించటం తెలిసిందే. ‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్’ అన్నట్టు అగ్గిబరాటా మమత అనేక కారణాల వల్ల ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన భవానీపూర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె ఓడిపోవటం ఈ పరాజయ పరంపరకు పరాకాష్ట.
గెలుపే అంతిమ లక్ష్యమని, నయానో.. భయానో గెలిచి తీరాలని కోరుకునే బీజేపీ ఎత్తులను చిత్తు చేయటంలో మమత విఫలమయ్యారు. బెంగాలీల అమ్మవారి భక్తినీ, చేపలకూర మీద ఉండే అనురక్తినీ బీజేపీ సొమ్ము చేసుకుంటుంటే దీదీ దీటైన రీతిలో ఎదురుదాడి చేయలేకపోయారనేది వాస్తవం. అందుకే బెంగాల్లో బీజేపీ గెలిచింది అనటం కన్నా దీదీ ఓడింది అనటమే సబబుగా ఉంటుంది. కాంగ్రెస్ వ్యూహాత్మక, ఎత్తుగడల వైఫల్యాల ఫలితంగా అసోంలో బీజేపీ మూడోసారి గెలుస్తుందనే విషయం కూడా చాలా ముందుగానే ఖరారైంది. ఇక పుదుచ్చేరిలో ఎన్డీయే విజయం కూడా ఆ కోవలోకే వస్తుంది. కేరళం, తమిళనాడులో ఎదురైన ప్రతికూల ఫలితాలను బట్టి చూస్తే ఉత్తరాది పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ దక్షిణాదిలో నెగ్గుకురావటం అంత సులువు కాదని మరోసారి తేలిపోయింది.