తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దూరదృష్టి ఫలితం..కాళేశ్వరం, మిషన్ కాకతీయ అందించిన జలాల కారణంగా రాష్ట్రం కోటిన్నర ఎకరాల మాగాణిగా మారింది. వరి సమృద్ధిగా పండుతున్నది. భారత ఆహార సంస్థ గోదాముల్లో నిల్వ ఉండేది అత్యధికంగా తెలంగాణ ధాన్యం, బియ్యమే. మరి రైతుల ముఖాల్లో సంతోషం కనిపించడం లేదేం? కారణం..వారు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించకపోవటం, ఆ దిశగా కనీస ఆలోచన చేయకపోవటం.
రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య మార్కెటింగ్. దానిని ఎలా ఎదుర్కోవాలి? వారి చేతిలో నాలుగు పైసలు ఉండేలా ఏమి చేయాలి అనేదానిపై ప్రభుత్వం వద్ద ఇప్పటికీ సరైన ప్రణాళిక లేదు. వరి ఉత్పత్తికి సంబంధించి తెలంగాణకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. సగటు దిగుబడి అధికంగా ఉండటం ఒక ప్రత్యేకత అయితే, మేలు రకమైన సన్నధాన్యాన్ని పండించటం మరో ప్రత్యేకత. ఈ అవకాశాలను ఉపయోగించుకోవటానికి ప్రస్తుత పాలకుల వద్ద నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవటమే రైతుల పాలిట శాపంలా మారింది. రాష్ట్రంలో చాలాచోట్ల ఈ వేసంగిలో వరితో పాటు, మక్కలు కూడా గణనీయంగా పండాయి. ఎక్కడ ఎండబెట్టాలో, ఎక్కడ నిల్వ చేయాలో రైతులకు తెలియటం లేదు. వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు. మే నెల అంటేనే తెలంగాణకు గుండె దడ. వడగండ్ల వానలు ఎప్పుడు కురుస్తాయో తెలియదు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకెళ్లి అమ్ముకోవటం పెద్ద యాతన. వడదెబ్బకు గురై యార్డుల్లోనే రైతులు మరణించిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తగినన్ని గోనె సంచులు, లారీలు లేకపోవటం, హమాలీల కొరత, మద్దతు ధర లభించకపోవటం, సకాలంలో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కాకపోవటం వంటి సమస్యలు ఈ ఏడాదీ తప్పలేదు. హమాలీల కొరత ఏర్పడితే కేసీఆర్ హయాంలో బిహార్ నుంచి కూలీలను తెప్పించారు. పశ్చిమబెంగాల్ జూట్‌మిల్లుల నుంచి గోనె సంచులు వచ్చాయి. ఇప్పడు అ లాంటి పరిస్థితి ఏదీ? మేలు రకానికి చెందిన సన్నబియ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించటం, విదేశాలకు ఎగుమతి చేయటం వంటి ప్రయత్నాలు కేసీఆర్ హయాంలో ప్రారంభం కాగా, అవన్నీ ఇపుడు నిలిచిపోయాయి. తెలంగాణ బ్రాండ్‌తో నాణ్యమైన బియ్యం విదేశాలకు ఎగుమతి అయితే రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ప్రస్తుత పాలకులు ఆ మార్గాన్ని ఎంచుకోవటం లేదు. ఎంతోమంది రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, అక్రమంగా విదేశాలకు తరలిస్తుండగా, నాణ్యమైన సన్నబియ్యా న్ని దర్జాగా ఎగుమతి చేయటానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావు. రేషన్‌షాపుల్లో తెల్లకార్డులు లేని వారికి కూడా తెలంగాణ బ్రాండ్ పేరుతో సన్నబియ్యం విక్రయిస్తామని గొప్పలు చెప్పినా కార్యరూపం దాల్చలేదు.
ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన కొన్ని అధ్యయనాలు, గణాంకాలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది. 2023-24లో తెలంగాణలో 168.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. దేశ ఉత్పత్తిలో ఇది 12.50 శాతం కావటం విశేషం. వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్‌వన్ స్థానానికి చేరింది. 2019-20 ఆర్థిక సంవత్సరం, 2020-21 ఆర్థిక సంవత్సరాలను పోల్చినప్పుడు వరి సాగు విస్తీర్ణం ఏకంగా 29.9’% మేర పెరిగింది. రబీలో వరి సాగు అధికం కావటమే ఇందుకు కారణం. ఈ పుణ్యం కాళేశ్వరం ప్రాజెక్టుదేనని అధ్యయనాల్లో తేలింది. రైతుల శ్రమ కూడా తక్కువేమీ కాదు. రైతుల సగటు సాంకేతిక సామర్థ్యం (మీన్ టెక్నికల్ ఎఫీషియన్సీ) 0.860 అని లెక్కించారు. దేశంలోనే ఇది అత్యధికం. ప్రణాళిక, ప్రోత్సాహం ఉండాలే గానీ మయన్మార్ నుంచి మినుములు, గాంబియా నుంచి కందులు దిగుమతి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. వాటన్నింటినీ తెలంగాణలో పుష్కలంగా పండించవచ్చు.
వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదల, రెవెన్యూ, బ్యాంకింగ్, పౌరసరఫరా శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలి. ఈ గొలుసుకట్టులో ఎక్కడ లోపం ఉన్నా రైతులకు కష్టమే. కొనుగోలు కేంద్రాల వద్ద కన్నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి రైతులది. కొన్నిచోట్ల మహిళలు కూడా సాహసించి పంటలు పండిస్తున్నారు. ధాన్యం లోడింగ్ దగ్గర నుంచి ప్రతీది వారికి సమస్యే. దేనినీ సొంతంగా చేసుకోలేరు. అలాంటప్పుడు లోడింగ్, అన్లోడింగ్లకే రోజుల సమయం పడుతున్నది. అందుకే వ్యవసాయం అంటేనే విరక్తి చెందుతున్నారు.
పంట చేతికి అందటానికి నాలుగైదు నెలల సమయం ఎలా పడుతుందో, రవాణా, గోనెసంచులు, గోదాముల వంటి ఏర్పాట్లు చేసుకోవటానికి కూడా అంతే సమయం పడుతుంది. వ్యవసాయ శాఖ అటువైపు ఏర్పాట్లు చేసుకుంటే, పౌరసరఫరాల శాఖ ఇటువైపు ప్రయత్నాలు ప్రారంభించాలి. అలా చేయకపోవడం వల్లనే…‘పంట విపరీతంగా పండింది, అందువల్లే గోనెసంచులు ఏర్పాటు చేయలేకపోయాం’, ‘లారీలు దొరకకపోతే ట్రాక్టర్లు ఉపయోగించాలని ఆదేశాలు ఇచ్చాం’, ‘వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లు ఇస్తాం’, ‘తాలు పేరుతో క్వింటాకు 6 కిలోలు కట్ చేస్తే మిల్లర్లపై కేసులు పెడతాం’ అనే ప్రకటనలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు తర్వాత వస్తున్నాయి. రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలతో దేశానికే దిశానిర్దేశం చేసిన రాష్ట్రం మార్కెటింగ్‌లోనూ మార్గదర్శకంగా నిలవాలి. ఇన్ని సమస్యలు చుట్టుముట్టినప్పడు వాటిని పట్టించుకోకుండా రైతు వారోత్సవాల పేరుతో ప్రభుత్వం హడావుడి చేయడం ఎవరికోసమన్నదే జవాబు లేని ప్రశ్న.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు)
– గోసుల శ్రీనివాస్ యాదవ్
98498 16817