రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు డిపోల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు నిత్యకృత్యమైపోతున్నాయి. ముఖ్యంగా యూరియా కొరత సంక్షోభంగా పరిణమిస్తున్నది. ఎరువుల డిపోల వద్ద పెద్ద సంఖ్యలో రైతులు గుమిగూడుతుండటంతో పోలీసు భద్రత ఏర్పాటుచేయాల్సి వస్తుండటం గమనార్హం. అర్ధరాత్రి నుంచే రైతులు బారులు తీరడం, కొన్నిచోట్ల చెప్పులు, సంచులు క్యూలైన్లలో ఉంచడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. పలుచోట్ల ఓపిక నశించిన రైతులు నిరసనలకూ దిగుతున్నారు. తగినంత ఎరువు సరఫరా చేయడంలో కేంద్రం విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, పంపిణీ వ్యవస్థ సవ్యంగా పనిచేయడం లేదని, మరోవైపు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని కేంద్రం ఆరోపిస్తున్నది. ఇస్తినమ్మ వాయినం తరహాలో ఇరుపక్షాలూ ఒకరి మీద మరొకరు నెపం మోపాలని చూస్తున్నాయి. మధ్యలో రైతాంగం నలిగిపోతున్నది.
ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే 3 లక్షల టన్నులు మాత్రమే అందింది. ఈ లోటును ఆసరాగా చేసుకొని వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో ఒక్కో యూరియా బస్తా సబ్సిడీ ధర రూ.268 అయితే రూ.325 వరకు ధర పెంచి అమ్మేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత జూలై మాసంలో యూరియా కొరత తీవ్రరూపం దాల్చింది. ఎరువుల అవసరాలు ఎక్కువయ్యేది ఇప్పుడే కావడంతో సాగు అగమ్యగోచరంగా తయారైంది. సమస్య ఏప్రిల్ మాసంలో మొదలైతే జూలై మూడోవారం వరకూ దిద్దుబాటు జరుగకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి, అసమర్థతకు నిదర్శనం. వానకాలం సాగుపై ఈ కొరత తీ వ్ర ప్రభావం చూపవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ హయాం లో పండుగలా సాగిన సాగు ఇప్పుడు సర్వత్రా సమస్యలను ఎదుర్కొంటున్నది. రైతన్న కడగండ్లకు యూరియా కొరత పరాకాష్ఠగా నిలుస్తుంది. యూరియా కొరత పంటల ఎదుగుదల, తద్వారా రైతుల జీవనాధారం మీద దెబ్బకొట్టే ప్రమాదం పొడసూపుతున్నది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి పరిస్థితి గణనీయంగా మెరుగుపడటం, రైతుబం ధు పేరిట పంట పెట్టుబడి, సకాలంలో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కావాల్సినం త సరఫరా చేయడం వంటి రైతు అనుకూల విధానాల ఫలితంగా సాగు విస్తీర్ణం పెరిగింది. యూరియా ఎక్కువగా అవసరమయ్యే వరి, పత్తి పంటల సాగు గరిష్ఠ స్థాయికి చేరుకున్న ది. దేశంలో ఎరువుల వినియోగంలో తెలంగాణ 5వ స్థానంలో ఉన్నది. గత యాసంగిలో యూరియా వినియోగం అంతకు ముందరి ఏడాదితో పోలిస్తే 21 శాతం పెరిగింది.
సాగు అవసరాల దృష్ట్యా సీజన్‌కు ముందే అప్పటి సీఎం కేసీఆర్ తగిన అంచనాలు వేసి కేంద్రం నుంచి కోటా రాబట్టడమే కాకుండా రవాణా కు సంబంధించిన అంశాలూ కచ్చితంగా చూసుకునేవారు. రైల్వే ర్యాకులు కేటాయించుకోవడంలో ఆయన చూపిన శ్రద్ధ గురించి ఇప్పటికీ చెప్పుకొంటారు. కానీ ప్రస్తుత పాలకుల్లో రైతాంగం పట్ల ఆ తరహా అంకితభావం కొరవడింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కొరత ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీరిగ్గా ఆలోచిస్తున్నది. మొక్కుబడి ప్రకటనలతో సరిపెడుతున్నది. అటు కేంద్రం కూడా సందట్లో సడేమియా అన్నట్టుగా రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేం ద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని నీతిబోధలకు దిగుతుండటం విడ్డూరం.