ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. ఎండనకా, వాననకా ఆరుగాలం పొలంలో కష్టపడే తెలంగాణ రైతన్న ఇవాళ ఎక్కడున్నాడు? యూరియా కోసం రోడ్లపై ఆధార్ కార్డు పట్టుకొని ఆగమాగమవుతున్నాడు. యూరియా కొరత వ్యవసాయరంగ సంక్షోభానికి కారణమవుతున్నది. యూరియా లేని పంట ఏమొస్తుంది? పంటలేని రైతు ఏమవుతాడు? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వ యంత్రాంగం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం గడుపుతున్నది. రైతుల జీవితాల్లో మార్పు తెస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలకులు తెచ్చిన మార్పు అందరినీ ఏమార్చడమే.
ఈ ఖరీఫ్ సీజన్‌కు అనుకూలంగా విత్తనాలు వేయడమే కాదు, పంట ఎదుగుదల కీలక దశలో ఉంది. పత్తి పూత దశలోకి, వరి పొట్ట దశలోకి వచ్చింది. ఈ సమయంలో యూరియా అందకపోవడం రైతులను తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నది. యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో నిలబడి చేతిలో ఆధార్, పాస్‌బుక్కులు పట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఎక్కడా యూరియా బస్తా దొరకడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. ఇదెక్కడి ప్రజా పాలన?
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్, ఇతర విపక్షాలు యూరియా కొరత, వరద ప్రభావం వంటి పలు ప్రజా సమస్యలపై చర్చకు ప్రయత్నించగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ఈ చర్య రాష్ట్రంలోని రైతులందరినీ ఆవేదనలోకి నెట్టింది. బురద జల్లే రాజకీయాలు మినహా రైతుల సమస్యలను తీర్చాలన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీకి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ లేదు. అసెంబ్లీలో చర్చకు అవకాశం ఇవ్వకపోవడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనివ్వకుండా సభను అర్ధాంతరంగా ముగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. అటు యూరియా కోటాను విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైతే, రాష్ట్ర ప్రభుత్వం సరఫరా, పంపిణీ, మానిటరింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఫలితంగా రైతుకు యూరియా బస్తా దొరకడం గగనమైపోయింది. డీలర్లు, దళారుల బేరసారాలకు హద్దుల్లేకుండా పోయాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య కాంగ్రెస్ పాలనలో రైతులు క్యూలో చెప్పులు, పాస్‌బుక్కులు పెట్టి యూరియా కోసం రోజుల కొద్దీ వేచి చూసిన దుస్థితి మళ్లీ వచ్చింది.
తెలంగాణలోని 17 మంది లోక్‌సభ సభ్యుల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి, 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైతులు ఇబ్బంది పడుతున్నా యూరియా సమస్యపై ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో గళం విప్పలేదు. పామాయిల్‌పై కేంద్రం దిగుమతి సుంకం తగ్గించడం, పత్తిపై సుంకం ఎత్తివేయడం దేశీయ రైతులకు నష్టాలు కలిగిస్తున్నా, ఒక్క ఎంపీ కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. రైతు డిక్లరేషన్, రుణమాఫీ, భరోసా, బోనస్ అన్న మాటలన్నీ ఇప్పుడు బోగస్‌గానే మిగిలిపోయాయి.
రైతన్నకు ఇపుడు కావాల్సింది యూరియా, పండించిన పంటకు కనీస మద్దతు ధర, పంట నష్టపోతే పరిహారం. కానీ ఇవన్నీ మాటలకే పరిమితమవుతున్నాయి. రైతన్నకు ప్రభుత్వమే అండగా ఉండాలి. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ మౌనం రెండూ కలిసి రైతన్నను కష్టాల కడలిలోకి నెట్టివేస్తున్నాయి. యూరియా కొరతను తీర్చే విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతన్న ఆగ్రహం ఉద్యమంలా మారక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలి. రైతు సమస్యలు, యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చ నిర్వహించాలి. అంతేకాదు, రేవంత్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు ముగింపు పలికి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర శాసనమండలి సభ్యులు)
– తక్కెళ్లపల్లి రవీందర్రావు
950 580 6666