ఇప్పుడు రాష్ట్రంల ‘నాకు రుణమాఫీ గాలె’ కాలం నడుస్తున్నది. ‘నీ క్రాప్ లోన్ మాఫైందా?’ అన్న ప్రశ్నలకు ‘నాదింకా మాఫీ గాలె’ అన్న జవాబులే ఎక్కువగా ఇనవడ్తున్నయి. ‘రైతులందరికీ రుణమాఫీ జేసినమని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పుకుంటుంటే.. నువ్విట్లా రాస్తున్నవేంద’ని మీకు డౌట్ గొట్టొచ్చు, తప్పు లేదు. కానీ, ఓ పవోజనంల పది మంది బంతి మీద గూసున్నప్పుడు ఒక్కతనికి గంటెడు తున్కలేసి, తతిమా తొమ్మిది మందికి ఉత్త శోర్వా వోసి సాలిచ్చుకుంటే.. అక్కడున్నోళ్లందరికీ కడుపు నిండా తిండి వెట్టినట్టు కాదు.
ఆ తున్కలు వడ్డాయన తిట్టకపోవచ్చు కానీ, తతిమా తొమ్మిది మంది మాత్రం.. ‘వీనికి ఎల్లకుంటె యాటలు కోసి పవోజనం ఎవ్వడు చెయ్యిమన్నడు. కూరగాయలతోని పవోజనం జేసి అందరికీ కడుపు నిండా తిండివెడ్తే ఎవ్వడన్న కొడ్తుండెనా?’ అని బండు బండు కడ్గుతరు. ఆ తిట్లకు గంటెడు తున్కలు తిన్న మనిషికి గూడ మనసున వట్టది. అచ్చం రుణమాఫీ ముచ్చట గూడ అసొంటిదే. పదిమందిల ఎవ్వలికో ఒగలికి రుణమాఫీ అయితే.. రైతులందరికీ రుణమాఫీ అయినట్టు ఎట్లయితది? అస్సల్కే గాదు.
మస్తు రోజుల తర్వాత నా దోస్తు ఒకతను మస్కట్ నుంచి తెలంగాణకొచ్చిండు. నలభై రోజుల చుట్టీ మీదొచ్చిన అతను మళ్లా మస్కట్ వోతడనంగా ముఖ్యమంత్రి నోట్లెకెళ్లి ‘రుణమాఫీ’ ముచ్చట బైటికెళ్లింది. ఆ ముచ్చటిన్న నా దోస్తు.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చే భూమి ని తన పేరు మీన జేస్కుందామని మస్కట్ పోవు డు వాయిదా ఏస్కున్నడు. నా దోస్తు వాళ్ల బాపు పేరు రాములు. ఆయనగూడ వలస జీవే. ఓ పదిహేనేండ్ల పాటు మస్కట్ల ఉండి ఐదారేండ్ల కిందనే సొంతూరికొచ్చిండు. పుష్కలంగా ఉన్న సాగునీటిని జూసిన రాములు ‘నేనిగ మళ్లా మస్కట్ వోను, ఇక్కన్నే ఎవుసం జేస్కుంట’నని ఒక్కశిత్తం జేస్కున్నడు.
లాగోడి కోసం తన భూమి కాయిదాలను బేంకుల కుదవెట్టి మరీ లక్షా నలభై వేల రూపాల క్రాప్‌లోన్ దీస్కున్నడు. పుట్టినూళ్లనే మళ్లా ఎవుసం షురూ జేసిండు. రెండు పసళ్ల పంటదీసిండో, లేదో పాపం పానం మంచిగలేక రాములు కాలంజేసిండు. ఆయ్ననే కాలం జేసిండంటే ఇగ క్రాప్‌లోన్ ఎవరు గడ్తరు, యాడికెళ్లి గడ్తరు?, అదట్లనే పడావున్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి రుణమాఫీ జేస్తే.. రాములు కుదవెట్టిన పాస్‌బుక్కులను బేంకుల కెళ్లి ఇడిపిచ్చుకుందామని అనుకుంటున్నడు రాములు కొడుకు. ఆ భూమిని తన పేరుమీన జేస్కున్నంక మళ్లా మస్కట్ వోదామనుకుంటున్నడు. అందుకే మస్కట్ పోవుడు వాయిదా గూడ ఏస్కున్నడు. మొన్న కాంగ్రెస్ సర్కారోళ్లు విడుదల జేసిన మూడు రుణమాఫీ లిస్టుల్లో రాములు పేరు లేదు. క్రాప్‌లోన్ ఇగ మాఫైతదా, అగ మాఫైతదా అని జూసిన నా దోస్తు ఆశలు ఆవిరైనయి. మొన్న ఫోన్జేసి ‘అరేయ్.. ఆ క్రాప్‌లోన్ మాఫ్ గాదు, మన్ను గాదు. ముఖ్యమంత్రి ముచ్చటను నమ్ముకుంటే నా నోట్లె మన్ను వడుతది. ఇగ నేను వోతరా మస్కట్’ అని తెగ బాధవడవట్టిండు.
పంబ శివశంకర్ అని మా ఆఫీసుల పన్జేస్తడు. సీఎం రేవంత్‌రెడ్డి నోట్లెకెళ్లి రుణమాఫీ ముచ్చట ఎల్లినకాన్నుంచి ఆ పిల్లగాని సంబురానికి పట్టపగ్గాల్లెవ్వు. శివ వాళ్ల కుటుంబానికి పదెకరాల భూమున్నది. ముగ్గురి పేర్లమీన ఉన్న ఆ భూమి కాయిదాలను తుమ్మన్పేట్ బేంకుల కుదవెట్టి మూణ్నాలుగేండ్ల కింద లక్షా తొంభై వేల రూపాల క్రాప్‌లోన్ దీస్కున్నరు. మిత్తితోని గల్పి అవిప్పుడు మూడు లచ్చల నలభై వేలైనయి. ‘ఆ క్రాప్‌లోన్ మాఫైతే మా అంత అదృష్టమంతులెవరూ ఉండరన్నా’ అని పాపం శివ రోజూ శెప్తనే ఉంటడు. రుణమాఫీ లిస్టు విడుదలైనప్పుడల్లా శివ కాలు గాలిన పిల్లి లెక్క ఆఫీసుల అటూ ఇటూ తిర్గుతనే ఉంటడు. ఏం ఫాయిదా? మూడు లిస్టులల్ల ముగ్గురి పేర్లేమోగని, కనీసం ఒక్కరి పేరుగూడ లేదు. అసలు ము చ్చటేందంటే.. ముగ్గురికి గల్పి రెండు లచ్చల రూ పాలు మాఫైనా.. తతిమా పైసలు బేంకుల గడ్తమని ఇంకో లచ్చా నలభై వేల రూపాలు అప్పు దీస్కొచ్చి మరీ ఇంట్ల వెట్టుకున్నరట. ఆ రెండు లచ్చలు మాఫైంది లేదు గనీ, ఈ లచ్చా నలభై వేలకు మాత్రం రోజురోజుకు మిత్తి వెర్గుతనే ఉన్నది.
మార్కొండ రమణ అని నాకు అల్లుడైతడు. తన భూమి కాయిదాలు బేంకుల కుదవెట్టి నాలుగైదేండ్ల కింద రెండు లచ్చల రూపాల క్రాప్‌లోన్ తీస్కున్నడు. తీస్కున్నప్పుడల్లా నాగ వోకుండా ఏటా మిత్తి కట్టేటోడె గని, ‘క్రాప్ లోన్లు మీరు కట్టకుర్రి.. మేమొచ్చినంక మాఫీ చేస్త’మని రేవంత్‌రెడ్డి చెప్పిన ముచ్చట్లను వట్టుకొని ఈసారి ఆ మిత్తి గూడ కట్టలె. ‘నేడే.. రుణమాఫీ పండుగ’ అని కాంగ్రెస్ నాయకులు చెప్పినప్పుడల్లా మాఫీ లిస్టుల ‘నా పేరున్నదా, లేదా..’ అని ఆత్రంగ వోయి జూసిండు. రుణమాఫీ కాలేదు, మన్ను కాలేదు. రమణకు ఇగ మాఫైతదనే నమ్మిక గూడ వోయింది. ‘ముఖ్యమంత్రి మాట వట్టుకుంటే ఉత్తగ మిత్తీ మీద మిత్తీ వడ వట్టె గద మామా..’ అని తల్లడిల్లుతున్నడు.
ఇట్లా ఏ రైతుతోని మాట్లాడినా.. ‘నాకు రుణమాఫీ గాలె’ అనే ముచ్చటనే ఎల్తున్నది తప్ప, ‘ఛల్.. నాకు రుణమాఫీ అయింద’ని మాత్రం ఒక్క రైతు గూడ గట్టిగ చెప్తలేడు. కల్లబొల్లి మాటలు చెప్పిన కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ అమలులో కొర్రీల పేరిట కోతలు వెడ్తున్నదని రైతులు తమ గోడును ఎల్లవోసుకుంటున్నరు. అయినా నన్నడిగితే… తీరొక్క పన్జేసి గూడ చెప్పుకోని నాటి సర్కార్ కన్నా ఈ సర్కారే నయ్యం తీయిర్రి. చెయ్యని, చెయ్యలేని పనులను గూడ చేసినమని చెప్పుకొంటున్న చెయ్యి గుర్తు సర్కారోళ్లకు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువే!