రైతు సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ఏ మాత్రం మారడం లేదు. రోజురోజుకు వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి. ఫలితంగా అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతూ సతమతమవుతున్నారు. దిక్కులేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్నారు.
దేశాన్ని 60 ఏండ్లకు పైగా కాంగ్రెస్ పాలిస్తే, పదిహేను సంవత్సరాలకు పైగా బీజేపీ పాలించిది. కానీ, మన దేశంలో భూ సమస్య సమస్యగానే మిగిలి ఉన్నది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. సరళీకరణ ఆర్థిక విధానాలతో దేశ రైతాంగం బతుకు మాత్రం మారడం లేదు. 1990 నుంచి 2014 వరకు అధికారిక లెకల ప్రకారం… 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు జాతీయ నేర పరిశోధక సంస్థ తెలిపింది. ఎంఎస్ స్వామినాథన్ సిఫారసులను అమలుచేస్తామని చెప్పి రైతులను బీజేపీ మోసం చేసింది.
రైతుల ఆదాయాన్ని పెంచుతామని చెప్పి 2019 ఎన్నికల్లో అన్నదాతలను మరోసారి వంచించింది. హామీలను అమలు చేయడం పక్కనపెడితే మోదీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నది. వ్యవసాయం మొత్తాన్ని కార్పొరేట్లకు అప్పగించాలనే కుట్రతో ముందుకుసాగుతున్నది. అందులో భాగంగానే రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చింది. దేశ రైతాంగం 13 నెలల పాటు ఉద్యమిస్తే కానీ ఆ చట్టాలను రద్దు చేయలేదు. ఈ ఉద్యమంలో 800 మంది రైతులు అమరులయ్యారు. అందుకే, 2024 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. చిన్నాచితకా పార్టీలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయినప్పటికీ ఆ పార్టీ తీరు మారడం లేదు.
ఇప్పుడు కొత్తగా దేశంలోని మొత్తం మారెట్లను కార్పొరేట్లకు అప్పజెప్పాలనే ఉద్దేశంతో నూతన వ్యవసాయ మారెట్ ముసాయిదాను తయారు చేసింది. ఇదే జరిగితే పంటలకు కనీస మద్దతు ధర దక్కే అవకాశం లేకుండా పోతుంది. రైతులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. విద్యుత్తు సవరణ బిల్లు, అటవీ సంరక్షణ నియమాల పేరిట అనేక కుట్రలకు తెర లేపుతున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎరువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పంటల బీమాను అమలుచేయడం లేదు. రైతులకు అవసరమైన సీసీఐ, నాఫెడ్ తదితర ప్రభుత్వ సంస్థలను ఎత్తివేస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులను తకువ ధరకు కొనుగోలు చేసి ఎకువ ధరకు అమ్మే కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాలను కేంద్రం అమలుచేస్తున్నది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించలేక ఏటా 10 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బడ్జెట్లో వ్యవసాయరంగానికి నిధులను ఏటేటా తగ్గిస్తూ వస్తున్నాయి. రాష్ట్రం శాసనసభా సమావేశాలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వానికి విన్నపం ఏమంటే… రైతు సమస్యలపై శాసన సభలో కేంద్ర ప్రభుత్వానికి తీర్మానంచేసి పంపించాలి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.