మన దేశంలో ఎక్కువమంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే, రైతులు బాగుంటే అందరూ బాగున్నట్టేనని పరిగణిస్తాం. పారిశ్రామిక అభివృద్ధి కూడా సాగు పురోగతిపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల జయాపజయాలు గ్రామీణ ఓటర్ల చుట్టే తిరుగుతాయి. రైతు సంక్షేమం, పంట దిగుబడి, మద్దతు ధర మొదలైన అంశాలపై చిత్తశుద్ధి గల నాయకులు దృష్టిపెట్టి దిగుబడి ఎక్కువగా రావాలని కోరుకుంటారు. అందుకోసం నేతలకు వ్యవసాయంలోని లోటుపాట్లు తెలిసి ఉండాలి. స్వయంగా రైతు అయిన కేసీఆర్‌కు రైతు కష్టాలు, సమస్యలు క్షుణ్ణంగా తెలుసు. అందుకే తన హయాంలో రైతు సమస్యలు పరిష్కరించగలిగారు. పదేండ్ల పాలనలో రైతాంగానికి కేసీఆర్ ఎన్నో ప్రత్యేక సదుపాయాలు కల్పించి తెలంగాణ సస్యతను వృద్ధి చేశారు.
ఏవో కథలు చెప్పి గ్రామీణ ఓట్లను కొల్లగొట్టే వారితోనే వ్యవసాయ రంగానికి తీరని నష్టం వస్తున్నది. రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని నేనూ రైతునే అని చెప్పి, కొత్త ఆశలను రేకెత్తించి రేవంత్‌రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏడాది పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై మొదట మోసపోయినవారు రైతులే. రైతు శ్రేయోభిలాషి కేసీఆర్‌కు, రేవంత్‌కు ఎలాంటి పోలిక లేదు. ప్రస్తుతం అన్ని పార్టీల లీడర్లలో సాగు జ్ఞానం ఉన్నవారు కేసీఆర్ తర్వాత ఒక్కరు కూడా కానరారు. అందుకే, ఈ ఇద్దరి పాలనలను పోల్చిచూస్తే సాగు రంగానికి కలిగిన మేలు రీత్యా చెప్పరాని అంతరం ఉన్నది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు పథకాలనే పేరు మార్చి, సొమ్ము పెంచి హైజాక్ చేశారు కాంగ్రెస్ పెద్దలు. చివరికి ‘ఉండబట్టలేక ఓటేస్తే ఉన్న బట్ట ఊడిపోయింది’ అన్నట్టు కేసీఆర్ హయాంలో అందిన సాయం కూడా రైతులకు దక్కకుండా పోయింది.
2018, కేసీఆర్ పాలనలో మొదలైన రైతుబంధు 11వ విడతగా 2023, 26 జూన్ నాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,790 కోట్లు జమయ్యాయి. డిసెంబర్లో కాంగ్రెస్ పాలన మొదలైంది. ఇప్పటివరకు మూడు పంటలకు అందవలసిన బంధు సాయం ఆగిపోయింది. రైతుభరోసా ఒక్క సీజన్ ఎగ్గొడితే సుమారు రూ.8 వేల కోట్ల రైతుల సొమ్మును కొట్టేసినట్టే. అర్హులైన రైతుల లెక్క నెలరోజుల్లో తీస్తామని రేవంత్‌రెడ్డి చెప్పి పదకొండు నెలలవుతున్నది.
జనవరిలో నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో రైతుభరోసాపై సీఎం రేవంత్‌రెడ్డి కొత్త విధి విధానాలు ఉంటాయన్నారు. కొత్త మార్గదర్శకాలతో వానకాలపు పంట నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందుతుందన్నారు. జూలై, 2న రైతుభరోసా విధివిధానాల కోసం సబ్ కమిటీ నియమించబడింది. జూలై 15 నాటికి నివేదిక అందజేయాలని, కౌలు రైతులను కూడా అందులో చేర్చేలా చూడాలని ప్రభుత్వం సబ్ కమిటీని కోరినట్టు వార్తల్లో వచ్చింది. ఆ తేదీని, విషయాన్నీ పట్టించుకోని కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క జూలై 30 నాడు హన్మకొండలో రైతుభరోసాపై వర్క్‌షాప్ నిర్వహిస్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నామన్నారు. మరో మూడు నెలల తర్వాత అక్టోబర్ 20న వ్యవసాయ మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘రాష్ట్ర మంత్రివర్గ సబ్ కమిటీ నివేదిక వచ్చాకే, రైతుభరోసాపై విధి విధానాలు ఫైనల్ కాగానే, రాబోయే పంట సీజన్ నుంచి రైతుల ఖాతాల్లో పంట సాయం వేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందించడమే రాష్ట్ర సర్కార్ లక్ష్యం. దీనికనుగుణంగా క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక రూపొందిస్తుంది’ అని అన్నారు.
సాగులో ఉన్న భూములకే తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా సొమ్ము ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. ఈ మాటలను చెప్తూ ఇప్పటికి రెండు పంట కాలాలు దాటేశారు. యాసంగి పంటలకు కూడా రంగం సిద్ధమౌతున్నా కమిటీ రిపోర్టు వచ్చేలా లేదు. కమిటీ కోతలతో ఆఖరికి మిగిలే వారెందరో, వారికి అందే సొమ్మెంతో అనే నైరాశ్యం ఇప్పటికే రైతుల్లో ఆవరించింది.
రేవంత్‌రెడ్డిని రైతులు నమ్మకపోవడానికి పంట రుణమాఫీయే పెద్ద కారణం. ఇచ్చేశామని సీఎం అంటే, ఇస్తాం.. ఇస్తాం.. అని సాగు మంత్రి అంటున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్నింటి కన్నా పెద్ద దగాగా పంట రుణాల మాఫీ నిలుస్తుంది. వంద రోజుల్లో ఒకే దెబ్బకు రూ.2 లక్షల రుణమాఫీ అని చెప్పి, అడ్డగోలు నిబంధనలతో, అరకొర చెల్లింపులతో రైతుల ఆశలను ఖూనీ చేశారు. ఇప్పటికీ అదే డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారు. ఆగస్టు 15 నాటికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశాం, ఇంకా 20 లక్షల మందికి అమలుచేస్తాం. రూ.2 లక్షల లోపు రుణాలుండి, నిర్ధారణ కాని రైతు కుటుంబాలను గుర్తించి, డిసెంబర్‌లోగా వారికి రుణమాఫీ చేస్తామన్నారు. తెల్ల రేషన్‌కార్డు లేని మూడు లక్షల మందికి కుటుంబ గణన లెక్కలు వచ్చాక రుణమాఫీ చేస్తామని చెప్పారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు అదనపు డబ్బులు కడితేనే మాఫీ చేస్తామని, దీనికి షెడ్యూల్ ఖరారు చేస్తామని సాగు మంత్రి నెల కిందట అన్నారు. ఏడాది సంబురాల నాటికి కూడా రుణమాఫీ పూర్తికాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ఠగా భావించాలి.
రైతులకిచ్చిన మరో కాంగ్రెస్ హామీ పంటల బీమా. పీఎం ఫసల్ బీమా యోజన సీఈవోతో మార్చి 1న సీఎం సమావేశమై వచ్చే సీజన్ పంటలతో బీమాను చేపడతామన్నారు. ఖరీఫ్ పంటలకు వర్తింపజేస్తామన్న మాట డొల్లగా తేలిపోయింది. రాష్ట్రంలో పంటల బీమాను వచ్చే యాసంగి నుంచి అమలు చేస్తామని, రైతుల తరఫున సర్కారే ప్రీమియం చెల్లిస్తుందని మంత్రి తుమ్మలతో పాటు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కూడా ఈ మధ్య అన్నారు. పంటకాలం మొదలైనా ఇప్పటికీ దీనిపై ఎలాంటి విధి విధానాల రూపకల్పన జరగలేదు.
రైతులకిచ్చిన మూడు ప్రధాన హామీల్లో ఒక్కటి కూడా సవ్యంగా అమలుకాలేదు. అన్నింటినీ ఏదోగా సాకు చూపి మాటల గారడీతో సాగదీస్తున్నారు. వంద రోజులన్న హామీలు నాలుగు వందల రోజులకైనా తీరుతాయా! రైతుల అసంతృప్తి జ్వాలలకు లగచర్ల, దిలావర్పూర్ సంఘటనలే సాక్ష్యం. ఇన్ని లొసుగులు దాచి భారీ ప్రకటనలతో, జన సమీకరణతో డాంబికంగా జరిపే ‘రైతు పండుగ’ ఎవరి కోసం? ‘కాంగ్రెస్ ఫాలింగ్’ అనే నిజాన్ని ‘తెలంగాణ రైజింగ్’ అనే మాటతో కప్పేయడమే కదా! హామీలన్నీ సంక్రాంతికి వాయిదా వేస్తే ‘అయ్యవారు వచ్చేదాక అమాస ఆగదు’ అన్నట్టు రైతు వేచి చూస్తూ కూచోలేడు, విత్తనం మొలకెత్తక మానదు.