రైతు కంటనీరు ప్రభుత్వానికి మంచిది కాదు. అబద్ధాలతో, ఆచరణసాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఏడాదిన్నరలో అన్ని వర్గాల ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేసింది. అనవసరపు ఆడంబరాలు, అక్కరకురాని డాంబికాలు ప్రదర్శించడం తప్ప కాంగ్రెస్ సర్కారు పనితనం ఎక్కడా కానరాలేదు. ముఖ్యంగా రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఎన్నికల ముందు వరంగల్ రైతుడిక్లరేషన్ పేరిట అన్నదాతలకు అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నేడు వాటన్నింటికి తిలోదకాలిచ్చింది.
బీఆర్ఎస్ సర్కారు సాగునీరు, రైతుబంధు, నిరంతర ఉచిత విద్యుత్తు వంటి పథకాలు అమలు చేయడంతోపాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది. తద్వారా వ్యవసాయరంగం వృద్ధి చెంది రైతుల ఆదాయం పెరిగింది. రాష్ట్ర రైతాంగం పదేండ్లపాటు సుభిక్షంగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. రైతులకు గడ్డుకాలం వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎటుచూసినా అన్నదాతల ఆక్రందనలే వినిపిస్తున్నాయి.
వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్‌గాంధీ సమక్షంలో అన్నదాతలపై వరాల జల్లును కాంగ్రెస్ కురిపించింది. వాటిలో ముఖ్యమైనది వడ్లకు బోనస్. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ రైతులను నమ్మించి ఓట్లు వేయించుకున్నది. తీరా అధికారంలోకి వచ్చాక సన్నరకం ధాన్యానికే ఇస్తామని కాంగ్రెస్ పాలకులు మాట మార్చేసి దగా చేశారు. ఈ యాసంగి సీజన్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి నెల రోజులు గడుస్తున్నా, రైతులకు ఇంకా ఒక్క రూపాయి కూడా బోనస్ అందకపోవడం శోచనీయం. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 18 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్నధాన్యం కొనుగోలు చేయగా, సుమారు రూ.1000 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉన్నది.
గత సీజన్లో రైతులు అధిక మొత్తంలో సన్నాలు సాగు చేశారు. కానీ, గత సీజన్లో బోనస్ చెల్లింపులో ఆలస్యం జరగడం, చాలామంది రైతులకు బోనస్ రాకపోవడంతో ఈ సీజన్లో దొడ్డు వడ్ల సాగు వైపు అన్నదాతలు మొగ్గుచూపారు. బోనస్ వస్తుందనే ఆశతో సన్నాలు సాగు చేసిన అన్నదాతలకు ఇప్పుడు కూడా భంగపాటు తప్పడం లేదు.
మరోవైపు రుణమాఫీ విషయంలోనూ రైతులను కాంగ్రెస్ దగా చేసింది. రుణమాఫీ కాలేదని ఎంతోమంది రైతులు ఇప్పటికీ అధికారులు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చడంలో చూపిన ఉత్సాహాన్ని దాని అమలులో మాత్రం కాంగ్రెస్ సర్కారు చూపడం లేదు. ఎకరానికి రూ.7,500కు బదులు మాట తప్పి ఇస్తామన్న రూ.6 వేలు కూడా ఇప్పుడు అందడం లేదు. పెట్టుబడిసాయం ఎగవేయడంతో అన్నదాతలు అప్పులపాలవుతున్నారు. మరోవైపు అకాల వర్షం, వడగండ్ల వాన కారణంగా నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారం అందడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన సుమారు 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలి. ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వాలి. లేకపోతే రాబోయే రోజుల్లో లక్షలాది మంది రైతులు పోరుబాట పట్టడం ఖాయం.