మూడొద్దులు, సద్ది కట్టుకుని,
దోమలను తోలుకుంటూ, కటిక నేలపై,
పడుకుని పొర్లి లెగిస్తే, ఒక్క కట్ట యూరియా.
కౌలుకు తీస్కున్న, ఐదెకరాల పత్తి,
ప్రతి మొక్కా నా బిడ్డే. ఏ మొక్క కందించాలో,
బుర్రన సుడిగుండం తగ్గాక, రెండ్రెండు గింజలేశా.
మరో మూడొద్దులు, సద్ది దెచ్చుకొని పడ్కున్నా,
పత్తి చేలొ చెత్తమీదే ధ్యాసాయె, సద్ది ఇప్పలె.
యూరియా దొరక్క, ఏడ్వడానికి, కన్నీళ్లు రాలె,
చెత్త కూలోళ్లకు డబ్బుల్లేక, పీనుగై పీక్కున్నా.
ఇంటావిడ తోడొచ్చింది, ఇద్దరం ఉపాసాలె.
ఎవరి బాధ వారమె, కడ్పుల మింగుకుంటూ.
మచ్చ రోగం, పచ్చ పుర్గు, మొక్కల్ని ఎద్గనీయలె.
ఇంకొంచం యూర్యా వేసి, పుర్గు మందు కొట్టాలన్న,
ఆవిడ మాటిని, మళ్లా మూడొద్దులు, కాపు కాసిన.
లారొచ్చిందని, ఒకరి మీదొకరు గుంపుగా ఎగబడ్డం.
పోలీసోళ్లు, గుంజుకుంటూ, అరుస్తూ, కొట్టిన్రు.
యస్సై గారి కాళ్లు పట్టుకుని, ప్రాధేయ పడ్డా.
ఒక్క బస్తా కొక్కిరిస్తే, దుఖం ఆగనంటుంది.
మూపునేసి, అక్కడక్కడ కూకుంటు, చేలొ చల్లా.
చల్లిన యూరియా, సరిపోక, పత్తి ఎదగలె.
గుబులు పుట్టిన మొగులు నెత్తికెక్కుతుంది.
పొలంలోనే కూలబడ్డా, ఇంటికి పోవాలనిపిస్తలె.
యూరియానా, ఉరియా అని తేల్చుకోలేక,
అప్పులు, కౌలు డబ్బులు, పెళ్లాం, పిల్లలు,
యాదిల కొచ్చి, ఏంటీ బత్కు బత్కితెంత,
బత్కపోతే ఎంత? గట్టు మీది యాప మాను,
పగ్గం తెచ్చుకుని, నా వోళ్లొ పడుకో మంది.
యూరియా ఉరికి, నేనెన్నోవాడ్నో లెక్కెట్టండి.
– కమ్మ రంగారావు 94401 79410