తెలంగాణ రైతు గోస పడుతున్నాడు. ఎండిన పంటలను చూసి కన్నీరు పెడ్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పొట్ట మీదికొచ్చిన పంటకు నీళ్లందక ఎండిపోవటంతో మేకలు, గొర్లు, బర్లు, జీవాలు మేస్తున్నాయి. దేశాని ధాన్యాగారంగా నిలిచిన తెలంగాణ పంటలెండి తల్లడిల్లిపోతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వరి పంటలో ముందుంటే ఇందులో సూర్యాపేట జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. రెండో పంటకు నీళ్లిస్తామంటేనే వరి వేశారు. కానీ, చివరి రెండు తడులకు నీళ్లివ్వమని రైతులు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని క్షేత్రస్థాయిలోకి వెళ్లిన అధ్యయన బృందానికి కండ్లకు కట్టినట్టు కనిపించింది. రైతుల గోస చూసి తట్టుకోలేక మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కన్నీరు మున్నీరైన తీరును క్షేత్రస్థాయిలో ఎండిన భూములు దృశ్యరూపకంగా ధృవపరుస్తున్నాయి.
చివ్వెంల మండలం మొగ్గాయి గూడెం గ్రామానికి చెందిన రైతు కొనకంచి వీరభద్రయ్య పదెకరాలు వరి పంట వేస్తే ఎండిపోయింది. ఎకరానికి 30 వేల చొప్పున పెట్టిన పెట్టుబడి పోయింది. నీళ్లు లేకపోవటంతో 35 వేలు పెట్టి రెండు బోర్లు వేస్తే నీళ్లు పడలేదు. మరో రైతు మర్రు వినయ్ ఏడెకరాలు మర్రు గోపాలరావు దగ్గర కౌలుకు తీసుకున్నాడు. రణబోతు వీరారెడ్డి అనే రైతు నారాయణరెడ్డి, సురేష్ రెడ్డిల దగ్గర భూమి కౌలుకు తీసుకొని పంటలేస్తే అందరి పొలాలు పొట్టదశకు వచ్చాక నీళ్లందక ఎండిపోయాయి. 300 ఫీట్లు లోతుకు పోయినా ఒక్క బోరులో కూడా చుక్క నీళ్లు పడలేదు. పచ్చగా పొట్ట మీది పంటతో నిండుగా కనిపించాల్సిన పొలాలు, వరి కంకుల మొదళ్లు వంగిపోయి వాలిపోయి నేలకూలాయి. గతేడాది ఏసంగి కళకళలాడిన పంటలు ఈ ఏడాది నీళ్లులేక వరి కంకులు ప్రాణాలొదిలినట్టు కనిపిస్తున్నాయి. వారబందీ పద్ధతుల్లో నీళ్లిస్తామని నీటి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారని రైతులు అధ్యయన కమిటీ సభ్యులు జూలూరు గౌరీశంకర్, సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, వీరయ్య, ఐవీ రమణారావు, ఉపేంద్రలకు చెప్పారు. ‘వ్యవసాయాధికారులు, ఎంఆర్ఓలు, ఆర్డిఓలు ఎవరూ మా పంట నష్టాన్ని చూడటానికి రాలేదు, ఏ నాయకుడు రాలేదని గ్రామ రైతులు చెప్తున్నారు. ఎంత మొత్తుకున్నా మా గోస ఎవరూ వినలేదు. ఒక్క రెండు తడులు వస్తే బయట పడేవాళ్లమంటున్నారు. అప్పులు తెచ్చి మెడలోని బంగారం తాకట్టు పెట్టి బోర్లు వేస్తే ఒక్క చుక్క రాకపాయే’ అని రైతులు బావురుమంటున్నారు. మొత్తం మొగ్గాయి గూడెంలో 50 మంది రైతులున్నారు. అందరూ దెబ్బతిన్నారు. ఆ ఊర్లో ఎండని పొలం లేదు. ఏడ్వని ఇల్లు లేదు.
పెన్‌పహాడ్ మండలం రేక్యాతండ గ్రామానికి వెళ్తే ఎటుచూసిన ఎండిన పొలాలు కనిపిస్తున్నాయి. రేక్యాతండ గిరిజన గ్రామంలో 30 మంది రైతులుంటే 250 ఎకరాల భూమి ఉన్నది. 200 ఎకరాలు ఎండిపోయాయి. గత సంవత్సరం పరిస్థితి చూస్తే నీళ్లు ఎక్కువై కోత మిషన్లు తిరగటం కష్టమైందని రైతులు చెప్తున్నారు. పంటలు ఎండి మరోదారి లేక 50 కుటుంబాలు ఊరి నుంచి వలసపోయి ఇతర ప్రాంతాలలో దినకూలీలుగా పనిచేస్తున్నారు. నార్కట్‌పల్లిలో సీసీ రోడ్డు పనుల్లో, చౌటుప్పల్, చిట్యాలలో దిన కూలీలుగా వలసపోయారని ఊర్లో మిగిలిన ఆ కుటుంబీకులు చెప్తున్నారు. 250 ఎకరాలు భూమికి 200 బోర్లు వేసినా అవన్నీ ఫెయిలయ్యాయి. ఒక్కొక్క బోరుకు రూ.35 వేలు ఖర్చు చేశారు. ఆ ఒక్క గ్రామంలోనే రూ.2 లక్షలు బోర్లకు వెచ్చించారు. రెండెకరాలు, మూడెకరాలు పంటలు వేసిన భూక్యా చినదూబ్లా, భూక్యా శంకరు, భూక్యా కైకా, ఆంగోతు శ్రీరాములు దీనస్థితికి నెట్టబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికొస్తే బిడ్డకు వరకట్నం ఇద్దామనుకున్నానని భూక్యా కైకా విలపిస్తున్నది. తమ ఊరికి కలెక్టర్ తేజశ్రీ నం దలాల్ పవార్ వచ్చి చూశాక ఒక తడికి మాత్రం నీళ్లు వచ్చాయని ఆ తర్వాత నీళ్లు రాలేదని చెప్తున్నారు. ‘గత ఐదేండ్ల నుంచి మాకు నీళ్ల బాధలేదు. ఇప్పుడు నీళ్లు లేక గోస పడుతున్నాం. నీళ్లు లేక మా ఊరు వలసపోయే స్థితి వచ్చింద’ని చెప్తున్నారు. రైతుబంధు ఇవ్వటమే కాదు, కేసీఆర్ మాకు నీళ్లు కూడా ఇచ్చారంటున్నారు. మాకు ఇప్పుడు నీళ్లు కావాలని కన్నీళ్లతో మొర పెట్టుకుంటున్నారు.
ఇది రేఖామాత్రంగా రెండు గ్రామాల్లో పంట పొలాల్లో క్షేత్రస్థాయిల్లో అధ్యయన కమిటీ దృష్టికివచ్చిన విషయాలు మాత్రమే కానీ, ఏ ఊరుకు ఫోన్ చేసి తెలిసినవారితో మాట్లాడినా పరిస్థితి మరింత దారుణంగా మారిందని చెప్తున్నారు. కోదాడ నియోజక వర్గంలోని మోతె మండలంలో సుమారు 40 వేల ఎకరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్న సమాచారం ఉంది.
నడిగూడెం మండలంలో కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. లారీల్లో, ట్రక్కుల్లో, ధాన్యాన్ని మార్కెట్లకు పంపించాల్సిన ఈ సమయంలో పంట పొలాల్లోకి అదే ట్రక్కుల్లో మేత కోసం గొర్రెలను తోలుకరావటం గ్రామాల గుండెలను పిండేసేదిగా ఉన్నది. గత ఐదేండ్లుగా సమృద్ధిగా నీళ్లను పొందిన నేలలు ఈ ఏడాది ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లందించలేకపోవటంతో వరి పంట నేలపాలైంది. నీటి నిర్వహణలో వైఫల్యమే నీళ్లందక నోటికాడికొచ్చిన పంట ప్రాణాలు తీసినట్లయ్యింది. ఇది రాజకీయ అంశం కాదు. ఇది రైతుల సామూహిక గోస. గుక్కపెట్టి ఏడుస్తున్న రైతుల కన్నీటి గాథ. తెలంగాణ పల్లె మళ్లీ కన్నీరు పెడుతున్న యదార్థ కథ. పంటల మరణమంటే అది రై తుల జీవన్మరణమే. గ్రామం తిరిగి విధ్వంసం వైపు వెళ్లటమే. రాజకీయ భేషజాలను వీడి రైతు కంటిపాపగా ప్రభుత్వం నిలవాలి. పాలకుడు ప్రజలను బిడ్డలుగా భావించి వాళ్లను బతికించాలి. గుండె ధై ర్యాన్నివ్వాలి. వారికి అండగా ఉండాలి. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన పంటల నష్టాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి సహా మొ త్తం ప్రభుత్వం కదిలి ఆ పంట క్షేత్రాలను చూడాలని రైతులు కోరుతున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించమంటున్నారు. ఈ పని తక్షణం చేయకపోతే రైతులకు తీరని నష్టం చేసినవాళ్లవుతారు. అన్నం పెట్టే రైతును అత్యవసరంగా ఆదుకోవటం కంటే ముఖ్యమైన పని మరొకటుండదు. కాబట్టి, రైతులకు అండగా నిలుస్తామని నిరూపించుకోండి.