అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తి పోతుంటే ఆతని మానసిక అలజడి ఎట్టుంటుంది? అచ్చం ఇప్పటి తెలంగాణ పాలకుడ్ని చూసినట్టే ఉంటుంది. ఆయన మానసిక ప్రవర్తన ఇంచుమించు ఉన్మాద స్థితినే తలపిస్తున్నది. బాధాకరం. తెలంగాణ జన స్వభావంలో మరణ ప్రీతి ఉన్నది కానీ అసూయ, ద్వేషభావం లేదు. చంద్రబాబు పంచన ఉన్నప్పుడు సంబోధించిన బలి దేవతకు 600 ఆత్మ బలిదానాలు సమర్పిస్తే గానీ తెలంగాణ రాలేదు. ‘నా వాళ్ల బలి ఎందుకు కోరుతున్నావు నన్నే మింగు’ అని కేసీఆర్ సావు నోట్లే తల పెడితే గానీ ఆ తల్లికి మన గోస సుతి ముట్టలేదు.
ఇవాళ తీతువ పిట్టలు నీతులు చెప్తున్నయి. తోడేళ్లు తొడలు చరుస్తున్నయి. కొండ్రాసిగాళ్లు ఏకంగా చావు కోసం తారాడుతున్నయి. ఉద్యమ నేతకు తెలంగాణ సమాజంలో జీవించే హక్కు లేదట. ‘తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో’ అని ఢిల్లీ వెళ్లిన సారు మేళతాళాలు, డప్పుల దరువులు, మంగళ హారతుల నడుమ మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెట్టినందుకా! 60 ఏండ్ల ఆకాంక్ష, నాలుగు కోట్లమంది ఆపేక్షను హారతి పళ్లెంలో పెట్టుకొని తెచ్చినందుకా! పిట్టల గాయాలకు పసుపు రాసి నింగిలోకి ఎగరేసినట్టు లగచర్ల గిరిజన బిడ్డల కోసం తన్లాడినందుకా? రాలిన పువ్వులను ఏరి పూమాలలుగా గుదిగుచ్చి దేవుని మెడలో వేసినట్టు, హైడ్రా చిదిమిన బడుగు బతుకుల భుజం తట్టి భరోసా నింపినందుకా? పసిగుడ్డును పురిట్లోనే వడ్ల గింజలు వేసి ఉసురు తీయబోయినట్టు ఓటుకు నోటుతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయాలన్న దుష్ట పన్నాగాల నుంచి కాపాడుకొని తెలంగాణను ప్రపంచ పటంలో నిలబెట్టినందుకా? కాళేశ్వరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, మల్లన్నసాగర్, కొండపోచమ్మ ఎత్తిపోతలతో కోటి ఎకరాల మాగాణాన్ని తడిపినందుకా? 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి అన్నదాత వెన్ను నిమిరినందుకా?
2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 51 శాతం ఉన్న బీసీల సంఖ్య , కాంగ్రెస్ చేసిన కులగణన సర్వేలో 46 శాతానికి ఎలా తగ్గిందని ఆ పార్టీ బీసీ నాయకులే నిగ్గదీసి కడుగుతున్నరు. సీఎంగా రేవంత్‌రెడ్డికి దిద్దుబాటు చర్యలు వారికి సమాధానం చెప్పేటట్టు ఉండాలి గానీ, కేసీఆర్, కేటీఆర్ సర్వేలో పాల్గొనలేదు, హరీశ్‌రావు కులగణన లెక్కలకు రాలేదని సీఎం ఆరోపణలు చేయ డం బాధ్యతా రాహిత్యం. కేసీఆర్, కేటీఆర్ కులగణన సర్వేలో పాల్గొంటే బీసీలకు ఒరిగేదేముంది? వారు దూరంగా ఉంటే పోయేదేముంది?
సీఎం ప్రస్తావించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, డీకే అరుణ, పోచంపల్లి.. వారెవరూ బీసీలు కాదు. వారు కులగణనలో పాల్గొంటే బీసీ జనాభా పెరుగుతుందా? అనే ఆలోచన చేయకుండా, వెనుకటి కెవరో బుద్ధిమంతుడు ‘దూడ గడ్డికోసం తాటిచెట్టు ఎక్కినట్టు’ అటుపోయి ఇటుపోయి కేసీఆర్ మీద పడటం తెలంగాణ సమాజం గమనిస్తున్నది.
వయసుకు తగని మాటలు, పదవికి తగని తిట్ల దండకాన్ని నిత్య పారాయణం చేస్తున్నా కేసీఆర్ భరించారు. క్షమించారు. ఆయన మహాభారతం, రామాయణం వంటి పురాణేతిహాసాలను ఔపోసన పట్టిన నిర్వికారుడు. విలువల వైరుధ్యాలను, నైతిక సంఘర్షణను రాజకీయ ప్రయోజనాలకు ఆపాదించడాన్ని నిర్ద్వంద్వంగా తృణీకరించిన నిరాకారి. తెలంగాణ సమాజానికి అందివచ్చిన కర్మయోగి. అల్ప అభియోగాలకు, తుచ్ఛ కూతలకు రేషపడి, గమ్యాన్ని ముద్దాడే యుద్ధాన్ని వదిలి పెట్టి మచ్చర్ పహిల్వాన్లతో కొట్లాటకు ఆరాట పడి ఉంటే తెలంగాణ వచ్చేదే కాదు. ఎన్ని అవమానాలను దిగమింగి ఉంటడు. ఎన్ని ఆరోపణలను గంభీరంగా మోసి ఉంటడు. సొంత కూతురును నిర్దాక్షిణ్యంగా బంధించిన దుష్ట దినాలను, అదే అలుసుగా గోటికాడి నక్కలు ఊళ పెట్టినప్పుడు గుండె గాయాన్ని మౌన మునిలా మునిపంటి కింద అదిమి పెట్టుకున్నారే గానీ, కన్నెత్తి చూడని కర్మయోగి.
ఫామ్‌హౌస్ పాలన అని కాంగ్రెస్ నేతలు ఎన్ని రాళ్లు వేసినా జనం ఫామ్‌హౌస్‌కే జై కొట్టారు. ఫామ్‌హౌస్ అంటే పాడికి, పంట చేనుకు నీడ. అందులో కేసీఆర్ ఫామ్‌హౌస్ ప్రత్యేకం. అది నిత్య పరిశోధనాలయం. 60 ఏండ్ల తెలంగాణల వరిపంట మీద ఎవరికైనా సోయి ఉందా? ఆంధ్ర వాళ్ల కోసం రూపొందించిన వంగడాలను మనకు బలవంతంగా అంటగట్టారు కానీ, కేసీఆర్ ఆలోచన చేసేంత వరకు మనకంటూ ఒక విత్తనం ఉన్నదా? ఉద్యమ నాయకుడే పాలకుడై రోత పాలనకు పాతరేసి, సరికొత్త తెలంగాణ నిర్మాణం చేశారు. పాలకుడిగా పంట భూముల మీద ఆకుపచ్చని సంతకం చేశారు. చెరువుల పునరుద్ధరణ జరిగి తెలంగాణ జరంత నిమ్మలపడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ మన గాలికి తగ్గట్టుగా వరి వంగడాల సృష్టిపై దృష్టి పెట్టిండు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలను పురమాయిస్తే బతుకమ్మ బీజాలు మొలకెత్తి, భూమికి బరువయ్యేంత ధాన్యం పండింది.
తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్-15048) బీజాలు జీవం పోసుకొని దేశ ధాన్యం మార్కెట్‌నే కుదిపేశాయి. క్వింటా ధర రూ. 3545 పలికింది. బతుకమ్మ వడ్లు, తెలంగాణ సోనా వరిసాగులో విప్లవం తెచ్చింది. అటు జల విప్లవం ఇటు హరిత విప్లవంతో తెలంగాణ వ్యవసాయ రూపు రేఖలే మారిపోయినయి. ఈ విత్తనాలు కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచే వచ్చినయి. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతన్న పెట్టుబడికి చేయూతనిచ్చిన రైతు భరోసా, బీడు బడిన తెలంగాణకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో నీళ్లు తాపింది ఫామ్‌హౌస్ పాలనే. అందుకే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ సొంత వేదికగా పెట్టిన ఆన్లైన్ సర్వేలో ఆ పాలన మళ్లీ రావాలని కోరుకున్నరు.
ఉద్యమకారునిగా కేసీఆర్ వేసిన ప్రతి అడుగు చరిత్రాత్మకమే. అది ప్రపంచ ఉద్యమాల్లో వేరే కాలంలో, మరో స్థలంలో ప్రజా చైతన్యానికి ప్రేరణ ఇస్తుంది. ఒక్కొక్కసారి కేసీఆర్ పోకడ దూకుడుగా అనిపిస్తుంది. మరు ఘడియలో మందకొడి గమనం అన్నట్టుగా తోస్తుంది. కానీ, ఆయన ప్రతి అడుగులో శాస్త్రీయత ఉంటుంది.
ప్రతి ఆలోచనలో అంచనా గట్టిన వెయ్యి మెదళ్ల సంఘర్షణ ఫలితం ఉంటుంది. ఇక్కడో సంఘటన గుర్తు చేయాలి. 2000వ సంవత్సరంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచింది. అదే ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆంధ్ర వ్యవసాయం, తెలంగాణ కాపురం రెండూ ఒకటి కాదని తెగేసి చెప్పిండు. ఆంధ్ర తీరు మాకు పారే నీళ్లు లేవు. మాది బావుల మీది కాపురం. కరెంట్ బిల్లుల పెంపు వరి రైతుకు ఉరితాడు అయితదని నిలదీసిండు. అయినా చంద్రబాబు వినలేదు. వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ దూకుడు ప్రదర్శించారు.
రైతు హంతక ప్రభుత్వంలో తాను ఉండలేనని బహిరంగ లేఖ రాశారు. బరి గీసి ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమానికి ముగ్గు పోసిండు. 2001 ఏప్రిల్ 7న తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించారు. అప్పట్లో అందరు కేసీఆర్‌ది దూకుడు తనం అన్నరు. ఒంటరి ప్రయాణం అన్నరు. ఆంధ్ర మేధావులైతే చంద్రబాబు ముందు తేలిపోతారని అన్నారు. కానీ, ఎవరు తేలిపోయారో చరిత్రకు తెలుసు. నిజానికి టీఆర్ఎస్ ఏర్పాటుకు రెండు మూడేండ్ల ముందు నుంచే తెలంగాణ రైతాంగం కన్నీటిని కేసీఆర్ చూశారు. రైతు కష్టాన్ని పరిశీలించారు. జనబంధాలతో ముడిపడిన సాహిత్యాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రజలు ఏం కోరుకున్నారో ఒక అంచనాకు వచ్చినాకే గులాబీ జెండాకు రూపం ఇచ్చి రైతు పక్కన నిలబడ్డ సారు నిండు నూరేళ్లు పాలించాలని కోరుకుంటూ..
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు