సనాతన ధర్మం అంటే ఏమిటో దానిని నిర్మూలిస్తానన్న ఉదయనిధికీ తెలియదు; రోజుకు పదిసార్లు దానిని ఉచ్చరించే నరేంద్ర మోదీకి తెలియదు. ఇద్దరూ దాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ధర్మాన్ని ఎవరూ కూకటివేళ్లతో పెకలించలేరనీ, అది మనుష్యుల ఆత్మ లోపల ఉంటుందని తెలియని కుర్ర నాయకుడు, ఆ ధర్మాన్ని మేమే రక్షిస్తున్నామని ప్రజలకు అబద్ధపు ప్రమాణాలు చేస్తూ అధర్మాలు చేస్తున్న వృద్ధ నాయకుడూ-ఇద్దరూ ఇదేమిటో తెలుసుకోవాలంటే వేదాలు చదవాలి.
వేదాలు ప్రవచించిన ధర్మమే సనాతన ధర్మం! అసలు ‘సనాతన’ అన్న పదానికి అర్థం తెలిసిన వాడెవడూ అంత తెలివి తక్కువగా మాట్లాడడు. ‘పురాతన’ అంటే జరిగిపోయింది, భూతకాలం. ఆ పదంలోంచే పురాణం అన్న పదం వచ్చింది. ‘అధునాతన’ అంటే ఇప్పుడు జరుగుతున్నది. కానీ ఇది కూడా కొంత కాలానికి పురాతనం అయిపోతుంది. మరి సనాతన ఈ రెండూ కాదు. ఇదివరకూ ఉంది; ఇప్పుడూ ఉంది; ఎప్పుడూ ఉంటుంది.
పురాణ ప్రతన ప్రత్న పురాతన చిరంతనాః
పూర్వమందున్నది.
ఏతర్హి సంప్రతీ దానీ మధునా సాంప్రతంతథా
ఇప్పుడున్నది.
శాశ్వతస్తు ద్రువో నిత్య సదాతన సనాతనాః
ఎప్పుడూ ఉండునది, స్థిరమై ఉండునది, నియతమై ఉండునది, నాశనము లేనిది. ఇవీ సనాతన అన్న పదానికి ఉన్న అర్థాలు. అందుకే శివుడిని సనాతనుడు అంటారు.
అయితే, ప్రజలంతా ఉదయనిధి అన్న మాటతో ఆందోళన చెందుతున్నారు, భయపడిపోతున్నారు. ఇక సంప్రదాయాన్ని నెత్తినేసుకొని మత మౌఢ్యాన్ని ప్రదర్శించే భారతీయ జనతా పార్టీ సరేసరి! ప్రధానమంత్రి సహా ఆ మాటను తిప్పికొట్టండని పిలుపునిస్తున్నారు. నిజానికి అంత కకావికలమైపోవలసిన పనేమీ లేదు. 700 ఏండ్లు విదేశీ రాజులు, 400 ఏండ్లు యూరోపియన్ వలస రాజులు చేయలేనిది ఉదయనిధి ఒక్కడే చేస్తాడా? తండ్రి ముఖ్యమంత్రి అవగా తాను మంత్రినైనంత తేలికైన పనా సనాతన ధర్మాన్ని నిర్మూలించటం? చాలా హాస్యాస్పదం! ఇప్పుడు మొత్తానికి బీజేపీ వారికి తమిళనాట ఓట్ల పోలరైజేషన్‌కు మంచి సాకు దొరికింది. ఇక ఎన్నికల ప్రసంగాల్లో మోదీ ఈ మాట తప్పక సాగదీస్తారు. అయితే వారినడిగే ప్రశ్నలు కూడా చాలా ఉన్నాయి.
సనాతన ధర్మం అంటే నాగరికత. నాగరికత అంటే ఇద్దరి మధ్య ఏ తేడాలు, అంతరాలు, భావ జీవ వైవిధ్యాలున్నా వాటిని గౌరవించి తోటి మనిషిని ప్రేమించటం, రక్షించటం, సహాయం చేయటం. సనాతన ధర్మం అంటే జీవకారుణ్యం, సహజీవన సంతోషం, మనకున్న ధనం, అధికారం, స్థాయిని బట్టి మన కుటుంబాన్నే కాకుండా సమాజంలోని అందరికీ సహాయపడటం, మంచి మనుషులుగా మసలటం. ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించటం. ఇతరులకు మన తాహతును బట్టి సహాయం చేయటం. మరి మోదీ అత్యంత శకిమంతమైన స్థాయిలో ఉన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో ఏ చెడును ఖండించారు? ఎంతమందికి సహాయం చేశారు? 40 లక్షల మరుగుదొడ్లు కట్టామని, 50 లక్షల ఇండ్లు కట్టామని చెప్పుకొంటున్నారు. పోనీ నమ్ముదాం! అంతేనా 9 ఏండ్ల పాలనలో చేసేవి? విపక్ష పాలిత రాష్ర్టాలలో ఎంత చిచ్చుపెట్టారు? ఛత్తీస్‌గఢ్ గిరిజనుల నష్టాలేమిటి? ఎన్నికల్లో గెలిచిన ఎన్ని ప్రభుత్వాలు కూల్చారు? ఎందరిని ప్రశాంతంగా వారి పాలనను చేయనిచ్చారు? ధర్మాన్నే అనుసరిస్తే ఆరు నెలలైనా మణిపూర్ రాష్ట్రం ఎందుకు మంటల్లోనే ఉంది? అసలు దేశంలోని ఇతర మతాల వారు ప్రశాంతంగా ఉన్నారా? దేశం సుభిక్షంగా ప్రగతిమార్గంలో ప్రయాణిస్తోందా? ఇవీ మోదీ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అడగాల్సిన ప్రశ్నలు! మరి సామాన్యుల జీవితాలకు దిశానిర్దేశం చేసి, సహాయ సహకారాలు అందించవలసిన రాజకీయ నాయకుల్లో అసలు సనాతన ధర్మం విలువలు పాటించేవారున్నారా అంటే ఉన్నారు. మనముందే ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సనాతన ధర్మం సరిగ్గా చూడవచ్చంటే నేడు తెలంగాణ రాష్ట్రం ఒక్కటే ఉదాహరణ.
సనాతన ధర్మంలో ఏ ఇద్దరి మధ్య వివాదాలు ఉండకూడదు. తెలంగాణ ముఖ్యమంత్రి తన పాలనలో ఈ వివాదాలు సమసిపోవాలనే చూసి ఆంధ్ర రాష్ర్టానికి అవసరమైనప్పుడు ఎక్కువ సాగునీరిచ్చారు. ధర్మం అన్న దాంట్లో వివక్షకు తావు లేదు. తన పాలన కింద ఉన్న వాళ్లందరూ, మిగతా వారు కూడా తనవాళ్లే అన్న భావన ఉండాలి. అలాగే మన ముఖ్యమంత్రి అన్ని మతాలనూ, కులాలనూ, గిరిజనులను, ఆఖరికి కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం సహాయం నిరాకరించినా వలస కూలీలను ఆదుకున్నారు. అటువంటి వివక్ష లేని మనిషే సనాతన ధర్మి.
విద్యార్థుల చదువుకు సహాయమే కాదు; చేపలమ్ముకునే వారికి, కల్లు దుకాణాలకు, కూరగాయల వారికి- అన్ని కులాలకు, అన్ని వృత్తులవారికి సహాయం అందించటమే సనాతన ధర్మం, పాలకుడు చేయవలసిన పని. ఇక అందరికీ కడుపు నింపే కృషీవలుడికి, బట్టలిచ్చే నేతన్నకు ముందుగా సహాయం చేయమని వేదాలే చెప్పాయి. స్త్రీలకు, ముఖ్యంగా పేద స్థితిలో ఉన్నవారికి గర్భం దాల్చినప్పుడు, ప్రసవానికి, ఆ తర్వాత సహాయం చేయటమే సనాతన ధర్మం. స్త్రీలకు సమాజంలో రక్షణ కల్పించటం, వారికి హాని చేయచూసిన వారికి శిక్షించటం ధర్మం.
పోలీసు శాఖను బలోపేతం చేయటంతో పాటు ‘షీ’ టీమ్స్‌ను పెట్టిన ఘనత మన సనాతన ధర్మి ముఖ్యమంత్రిదే! ప్రజాహితం కోసం గుడుల సంరక్షణ, పోషణ, ముఖ్యంగా యజ్ఞ యాగాదులు చేయటం సనాతన ధర్మంలోని భాగమే! అందుకే తెలంగాణ ప్రజలు కష్టాలు లేకుండా, ప్రశాంతంగా ఉన్నారు. పంటలు పండి తెలంగాణ సుభిక్షంగా వర్ధిల్లుతున్నది. ఆఖరికి మరణించినవారికీ ధర్మకార్యాలకు చక్కటి వైకుంఠధామాలు నిర్మించటం ఎంత పుణ్యకార్యం. సనాతన ధర్మంలో ప్రజలంతా కలసిమెలిసి ఉండాలి. ఎవరి భావాలు, ఎవరి మతం, కులం వారికి ఉంటాయి. వైవిధ్యాలు వైరుధ్యాలు కాకుండా, పరస్పర గౌరవంతో మెలగాలి. రెండేరకాల మనుషులను గుర్తించాలి. ప్రశాంతంగా బతుకుతూ ఇతరులను తూలనాడకుండా, వారికి హాని చేయని వారు. ప్రతి చిన్న విషయాన్ని (ఉదయనిధి మాటలలాగా) పెద్దగా చేస్తూ మనుషుల మధ్య చిచ్చుపెట్టేవారు. ఈ రకం వారిని శిక్షించాలి.
అందుకే మన పురాతన చరిత్రలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మనుషుల లాగా పుట్టినా, ధర్మాన్ని రక్షించి, మంచివారిని కాపాడి దేవుళ్లలాగా పూజలందుకుంటున్నారు. తనతో రాజ్యం పంచుకోవటానికి సోదర సమానులు పాండవులను నాశనం చేయాలనుకున్న కౌరవులు, తనకు సంబంధం లేని లోకాలకు వెళ్లి ఇంద్రుడిని జయించి, నవగ్రహాలను తన సింహాసనానికి కట్టేసుకున్న రావణుడు నశించారు. ఎందుకంటే ఎప్పటికైనా ధర్మం జయిస్తుంది, అధర్మం నశిస్తుంది. ధర్మానికున్న బలం తెలిసిన వారెవరూ ఆందోళన పడరు.
– కనకదుర్గ దంటు 89772 43484