రాజకీయం అంటేనే అటాక్, డిఫెన్స్ గేమింగ్. రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుల పేర లెక్కలేని సాకులు జెప్పి, కొంతకాలం నానబెట్టే ఎత్తులు వేసింది. ఆ ఎత్తులను చిత్తు చేయాలనుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రుణమాఫీ అసాధ్యమన్నడు. అది విన్న రేవంత్ ‘ఠాట్.. నేన్ జేస్తా.. అదియునూ ఆగస్టు15 నాటికే’ అని డెడ్‌లైన్ పెట్టి మరీ తొడ గొట్టిండు. ‘చేస్తవా.. చెయ్. నువు ఆ డేట్ నాటికి రుణమాఫీ చేస్తే, నేను నా ఎమ్మెల్యే గిరిని వదిలేస్తా’ అని ప్రతి సవాల్ జేసిండు హరీశ్‌రావు. అనుకున్న డేట్ రానే వచ్చింది. ముఖ్యమంత్రి అటు తన్లాడి.. ఇటు తన్లాడి జరన్ని రుణమాఫీలు మమ అనిపించి ‘హరీశ్‌రావు ఇగ రాజీనామా జెయ్’మని గొంతు పెంచిండు. హరీశ్‌రావు లెక్క పక్కేనాయే. డెస్క్ నుంచి ఓ కవర్ తీసి రేవంత్‌కు పంపి పొలిటికల్ ఎటాక్ జేసిండు. ఆ కవర్ చూసిన సీఎం సారుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందట. అందులో రుణమాఫీ కానీ 22 లక్షల మంది రైతుల పేర్లున్నయి. అప్పటినుంచి ‘ఎన్ని ప్రెస్మీట్లు పెట్టి రుణమాఫీ చేసినమని చెప్పుకుంటున్నా… అది డిఫెండ్ చేసుకున్నట్టే అనిపిస్తుంద’ని ఆ మధ్య క్యాబినెట్ మీటింగుల చెప్పుకొని సీఎం సారు తెగ బాధపడ్డడట..
‘దేవ దేవతలారా ఉయ్యాలో.. ఆది శక్తులారా ఉయ్యా లో..’ అని వలపోస్తూ బతుకమ్మకు గోడెళ్లబోసుకున్నరు ఇండ్లు కూలిన జనం. మట్టి మనుషులు కదా, బాధొస్తే పాటందుకుంటరు. పాటతోనే బాధలు పంచుకుంటరు. కడుపు మండినా పాటే.. కొంప కూలినా పాటే. పూట పూటకో పాట పాడి బాధెళ్లదీస్తరు. ఆ పాటల్లో కన్నీళ్లుంటయి, కష్టాలుంటయి, నెత్తురు గాయాలుంటయి. పాటే వాళ్ల బతుకు పొదరింటి ఎనగర్ర. పండుగ వేళ రేవంత్ పంపిన బుల్డోజర్లు పొదరింటిని చిదిమేస్తుంటే… ‘కాంగిరేసు రేవంత్ ఉయ్యాలో… కాలయముడైపాయే ఉయ్యాలో… ప్రజాపాలన కాదు ఉయ్యాలో.. రాక్షస పాలన ఉయ్యాలో.. దేవ దేవతలారా ఉయ్యాలో.. ఆదిశక్తులారా ఉయ్యాలో.. మా పేదలను రక్షించ ఉయ్యాలో.. దేవుడే రావాలే ఉయ్యాలో..’ అని మహిళలు బతుకమ్మ ఆడిన్రు. ఈయేడు దేవీ నవరాత్రుల సందర్భంగా ఏడజూసినా ఈ పాటలే మార్మోగుతున్నయి.
‘రొట్టెన్న లేదాయే.. గడ్డ పెరుగుంటే అద్దుకొని కడుపు నిండా తిందును’ అని ఎనుకటికొక పెద్ద మనిషి ఆశ పడ్డట్టే ఉన్నది రైతున్నల పరిస్థితి. రుణమాఫీ చేసి, అదను మీద రైతు భరోసా ఇస్తే.. సాగు ఇక పండగే పండుగ అని ఆశపడ్డరు అన్నదాతలు. కానీ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దసరా కానుక కింద మరో బాంబు పేల్చిండు. ‘రుణమాఫీ కాదు, రైతు భరోసా కూడా లేదు’ అని చావుకబురు సల్లగా చెప్పిండు. రుణమాఫీ పూర్తయ్యేవరకు రైతు భరోసా లేదని తేల్చిచెప్పిండు. ఆ ఒక్క మాటతో రైతన్న ఏం జెయ్యాలో సమజ్గాక బీరిపోయిండు.
ముందు మురిసినమ్మ పండగెరుగదన్నట్టే ఉందట హర్యానా కాంగ్రెసోళ్ల సంగతి. కాంగ్రెస్‌దే ఘన విజయమని సర్వే సంస్థలన్ని చెప్పినయి కదా? తీరా గెలిచినంక జిలేబీలు, బాణసంచాలు, పూలదండలు ఆర్డర్ చేస్తే లేటవుతుందని ముందుగాళ్లనే కొనుక్కొని పెట్టుకున్నరట, బాజా భజంత్రీలను కూడా పిలిపించి రెడీ ఉంచారట. ఫలితాలు రివర్స్ కావడంతో బొక్కబోరాల పడి బిక్కపోయారు. ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఈవీఎంల మీద పడ్డారు. ఎలక్షన్ కమిషన్ గోల్మాల్ వల్లే ఓడిపోయామని కొత్తపాట ఎత్తుకున్నారు. తాము అధికారంలో ఉన్న మూడు రాష్ర్టాలల్ల పాలన సక్కగుంటే హర్యానా ప్రజలు ఎందుకు ఎగరగొడతారు? గ్యారెంటీలు త్యాపకొకటి పెంచుకుంటూ పోతే పవర్ గ్యారెంటీ అనుకున్నారేమో పాపం!.