గెలుచుడు సంగతి తర్వాత, ముందు అర్జెంట్‌గా మీ స్క్రిప్ట్ మార్చుకోండి ప్లీజ్ అని బీజేపీ జాతీయ నాయకులను రాష్ట్ర నేతలు ప్రాధేయపడుతున్నారు. ఎప్పటివో తాతల కాలం నాటి స్క్రిప్ట్ ప్రసంగాలు జనాలకు మరీ బోర్ కొట్టిస్తున్నాయని వాపోతున్నారట. ఎన్నికల సీజన్, జన సమీకరణ కాస్ట్లీ వ్యవహారం. అయినా అష్టకష్టాలు పడి జనాన్ని సమీకరిస్తే, వారేమో మీ జాతీయ నాయకుల ప్రసంగాలు అసలు బాగుండటం లేదని సర్టిఫికెట్ ఇచ్చి వెళ్తున్నారట.
‘బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది.. కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారింది.. పరివార్వాది పార్టీ, డబుల్ ఇంజిన్ సర్కార్’ ఈ నాలుగు మాటలు తప్ప ఇంకేమి సబ్జెక్టు లేదా అని ప్రశ్నిస్తున్నారట. ఇంకో విషయం ఈ మధ్య ప్రధాని మోదీ తన స్పీచ్‌లో మాటకు మాటకు మధ్య ‘నా కుటుంబ సభ్యులారా’ అని అనడం కూడా ఎబ్బెట్టుగా ఉంటుందని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. కొసమెరుపు ఏమంటే, తెలంగాణ ప్రజలు, పార్టీలు మార్పు కాదు, బీజేపీ నాయకుల స్పీచ్‌ల స్క్రిప్ట్ మారాలని కోరుకుంటున్నదని అర్థమవుతున్నది.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు పెద్ద నోట్ల రద్దు అభ్యర్థులకు శాపంగా మారింది. ఎన్నికల ప్రచారం ముగింపునకు చేరుకోవడంతో ఇక డబ్బుల పంపిణీపై పార్టీలు, అభ్యర్థులు దృష్టిసారించారు. ఈసారి డబ్బులు తరలించడం పెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారు. ఈ సమయంలో 2 వేల నోట్లుంటే ఎంత బాగుండేదని తెగ బాధపడి పోతున్నారట. పెద్ద నోట్లు రద్దుచేయడం వల్ల కోట్లకు కోట్లు తరలించడం పెద్ద సమస్యగా మారిందని నెత్తి పట్టుకుంటున్నారు. ప్రస్తుతం రూ.5 వందల నోటే పెద్దనోటు. లక్ష రూపాయలకే రెండు కట్టలు. అదే 2 వేల నోటు ఉండి ఉంటే ఒక్క కట్ట విలువ 2 లక్షలు. రూ.5 వందల నోట్లతో కోటి రూపాయలు 2 వందల కట్టలవుతాయి. ఓ రెండు కోట్లు తరలించాలంటే 4 వందల కట్టలు. ఇన్నేసి కట్టలను వాహనాల్లో తరలించడం వల్ల తనిఖీలలో పోలీసులు సులువుగా గుర్తిస్తున్నారని వాపోతున్నారు.
– వెల్జాల