కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ పెద్ద చెరువు. అది ఎప్పుడో 60-65 ఏండ్ల క్రితం ఒకసారి నిండింది. ఆ తర్వాత అది కళకళలాడినట్టు ఎవరికీ కలలోసైతం గుర్తు లేదు. చెరువు నిండా నీళ్లు చూడకుండానే అనేక తరాలు నిండుకున్నాయి. అది సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి సొంత ఊరు. గోదావరి జలాలతో తమ చెరువును నింపాలని వైఎస్ హయాంలో ఆయన పాదయాత్ర చేసిండు. అయినా ఏమీ జరగలేదు. మూడేళ్ల క్రితం కాలువా పూర్తయ్యింది. చెరువూ నిండింది. నా జన్మ ధన్యమైంది కేసీఆర్‌గారూ అంటూ వామపక్ష నాయకుడు చెరువు కట్ట మీద కొబ్బరికాయ కొట్టిండు.
ఒక్క రేకొండ చెరువే కాదు. ఇప్పుడు తెలంగాణ అంతటా వాగులెందుకు పొంగుతున్నయి. నడి ఎండల్లో చెరువులు మత్తళ్లెలా దుంకుతున్నయి. చెక్డ్యాములెలా చిందులేస్తున్నయి? చేపలెలా చెంగున ఎగిరి దుంకుతున్నయి? కరీంనగర్లో ఇంటికి పునాదులు తీస్తే నీళ్లు. చేర్యాలలో హోమగుండం కోసం మూడడుగులు తవ్వితే నీళ్లు. ధూళిమిట్టలో ఒకప్పుడు ఏడు గంటలు పొయ్యని బోరు ఇప్పుడు 24 గంటలు ఆగకుండా పోస్తున్నది. తక్కెడు బంగారమిచ్చినా తక్కెళ్లపల్లికి పిల్లనివ్వవద్దనే ఊరిలో ఇప్పుడెందుకు అమ్మాయి కోడలై కోరి వస్తున్నది.
అయినా మనం అసత్యాలే రాస్తం. ‘పగ’లే కళ్లుమూసుకుని చీకటి కలలు కంటం. ప్రతి రోజూ ప్రయాణించే రాజీవ్ రహదారికి అటూ ఇటూ వెలిసిన పెద్ద కాల్వలో పారుతున్న నీళ్లను చూసి కూడా, నీటి మీది రాతలు రాస్తం… నిలబడవని తెలిసి కూడా! కోట్లాది జనం కళ్ల ముందు కనిపించే నిజాన్ని కూడా అబద్ధంగా చెప్పేందుకు అష్టకష్టాలు పడి కథలూ, కథనాలూ వండి వారుస్తం. తెలంగాణ పత్రిక అని చెప్పుకుంటూ ఆత్మ ద్రోహం చేసుకుంటం. పర వంచనకు ప్రయత్నిస్తం.
నడి గోదావరిలో కాళేశ్వరం అవతరించలేదా? నిండు జలాశయాలు నిదర్శనం కాలేదా? మిట్టమీద గుట్టమీద సాగర్లు వెలువలేదా? అయినా సరే కాళేశ్వరం కాలేదని, కొత్తగా ఒక్క ఎకరాకూ నీళ్లు రాలేదని పచ్చని పంట పొలాల మధ్య ప్రెస్‌కాన్ఫరెన్సు పెట్టి మరీ బండగా అరుస్తం. కాదంటే కరుస్తం. ఎందుకంటే వందసార్లు చెబితే అబద్ధం నిజమవుతుందని మన గుడ్డి నమ్మకం.
కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ఎవడో అంటే మనం చాక్లెట్ చప్పరిస్తూ చప్పట్లు కొడతం. కానీ కాళేశ్వరాన్ని కట్టుకోకుంటే, మన వాటా నీళ్లపై మనం ముందే ప్రాజెక్టు కట్టి పట్టు పట్టకుంటే, మరెవడో వచ్చి మరే రాష్ర్టానికో మర్లించుకుపోతాడు, మన జల సంపదను తరలించుకుపోతాడన్నది తెల్వదు. ఘనంగా ప్రవచించే నదుల అనుసంధానం కూడా, మనం తప్పుబడుతున్న కాళేశ్వరం వంటి ఎత్తిపోతల పథకమేనన్నది జ్ఞానం ఉండదు. మొన్నమొన్నటిదాకా మన కృష్ణా నీళ్లు మద్రాసుకు పోయినయే తప్ప మన హైదరాబాదుకు రాలేదన్న జ్ఞాపకం మనకుండదు. మన రైతుల పొలాలను ఎండపెట్టి మన మంజీరా నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన నిర్వాకం తెల్వదు.
చుట్టాలకు దూరం ఉండైనా సరే, మంచి నీళ్లకు దగ్గరగా ఉండమన్నది కదా సామెత. అన్నింటినీ లాభనష్టాల లెక్కల్లో, జమా ఖర్చుల హద్దుల్లోనే ఆలోచించే వ్యాపార యుగానికి వాటర్ విలువ ఏం తెలుస్తుంది? ఎకరాలు- పారకాల పద్దులే ప్రాతిపదిక అయితే, చైనా కట్టిన త్రీగార్జెస్పై ఏనాటికైనా వర్కవుట్ అవుతుందా? కాళేశ్వరమంటే కేవలం ఎకరాలకు నీళ్లివ్వడమేనా? అది భవిష్యత్తుకు భరోసా. రుతువులు గతి తప్పిన పతన కాలంలో, లానినా, ఎల్‌నినా చక్రభ్రమణంలో, ఏనాడు వాన పడుతుందో, ఎన్నేండ్లు పడదో గ్రహాలూ ఉపగ్రహాలు కూడా చెప్పలేని కలియుగంలో, కాళేశ్వరం మన జాతి ఎత్తుకున్న జల బోనం. అది ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పథకమే కాదు; అతి తక్కువ ముంపు- భూసేకరణతో అతి ఎక్కువ ఎకరాలకు సాగునీరు అందించే అద్భుత జల ప్రణాళిక. కాళేశ్వరం తెలంగాణ వాటర్ ట్యాంక్. తెలంగాణ వాటర్ బ్యాంక్. ప్రతి రైతుకూ పంచగల అస్యూర్డ్ వాటర్. మన నీటి వాటాను ముందే ఒడిసి పట్టుకున్న ఎత్తుగడ. మన కరువు కష్టాలను ఇడిసి పెట్టుకునే ముందుచూపు. పాపం శమించుగాక, దేవుడు నన్ను క్షమించుగాక.. కానీ ఒక కరువొస్తేగానీ కాళేశ్వరం విలువ మన అజ్ఞానులకు తెల్వదేమో!
కాళేశ్వరం కష్టం, కరెంటుకే బోలడంత ఖర్చవుతదన్నరు. కాకతీయతో చెర్వులు బాగుచేస్తే కమీషన్ కాకతీయ అని పేరు పెట్టింరు. 24 గంటల కరెంటిస్తే భూగర్భం ఖాళీ అని శాపనార్థాలు. చిన్న జిల్లాలతో చింతలే తప్ప చిన్న మేలూ జరగదన్నరు. యాదాద్రిలో గుడి కడితే గొడవ చేస్తరు. బతుకమ్మ చీరలిస్తే బజార్ల పెడ్తరు. సమగ్ర సర్వే సర్వ వ్యర్థ్థమంటరు. పామాయిల్ పంటతో నేల వట్టిపోతుందని వ్యాసాలు రాస్తరు. కాకతీయ సప్తాహంతో చరిత్రను స్మరించుకుంటే రాజుల రాజ్యం మళ్లీ తెస్తున్నరంటరు. ఉమ్మడి రాష్ట్రంలోలాగా కడుపు కొలిచి కాకుండా, ఆకలి తీరేంత అన్నం పెడితే ఆరోపణల పురుగులు చల్లుతరు. అత్యాచార దోషుల ఎన్కౌంటర్ అయితే ఎందుకయ్యిందంటరు? కాకుంటే ఎందుకు కాలేదంటరు? ఉస్మానియా ఆస్ప్రతి పెచ్చులూడితే దారుణ ప్రమాదమంటరు. కూల్చి కొత్తది కడ్తమంటే పురావస్తంటూ కొరకొర చూస్తరు. ఇంగ్లిషు మీడియం పెట్టకుంటే బడుగులకు అన్యాయమంటరు. పెడితే తెలుగుకు ప్రమాదమంటరు. తెలంగాణకు హరితహారం చుడతామంటే జాగా ఎక్కడున్నదంటరు.. తెలంగాణ పచ్చబడ్డదని ఉపగ్రహం చిత్రం పంపిస్తే నోరెళ్ల బెడతరు!
కాశీలో ఏ పండితుడినీ అడగకుండా, పూజారుల అభిప్రాయాలను పట్టించుకోకుండా, నమో ఘాట్ కోసమని నానా దేవాలయాలను ధ్వంసం చేసి, లింగాలను పీకి పారేస్తే అదేమో పరమ పవిత్ర పుణ్యకార్యం. జైలును కూల్చి దవాఖానా కడితేనేమో అది పురావస్తు పాపం, శాపం! చివరికి, చిట్ట చివరికి, చివరాఖరికి పరిసరాల పరిశుభ్రత లేక ఒకరిద్దరు చనిపోతే, దాన్ని “మిషన్ భగీరథ కలుషిత నీళ్లకు మరొకరు బలి” అని ఫ్రంట్ పేజీలో వండి వారుస్తరు. అది పట్టుకుని ఆమాంబాపతు నేతలు బాటిళ్లు ధరించి బయల్దేరుతరు. ప్రపంచం మెచ్చుకున్నా మనకు తెలివి రాదు. తెరువు తెల్వదు.
తెలంగాణను సర్వధ్వంసం చేయడానికి కంకణం కట్టుకుని ప్రయత్నించిన ఒకరికి హైదరాబాద్‌లో స్మృతివనం ఎందుకు లేదని ప్రశ్నిస్తాడొకడు. ఇదొక కుల రాజకీయం. అతడి వెనకే నిలబడిన మాయా మశ్చీంద్ర దీన్ని చిలిపి కళ్లతో చిత్రంగా చూస్తడు. తెలంగాణ సంస్కృతికి విరుద్ధమైన సిద్ధాంతాన్ని ఉత్తరాది నుంచి తెచ్చి మరీ రుద్దుతరొకరు. ఇది మత రాజకీయం. మైకులు పగిలిపోయేట్టు అరుస్తూ జబ్బలు చరుస్తుంటాడొకడు. ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి నీళ్లు తాగుతూ పరాయి పాటలు ప్రముఖంగా ప్రచురిస్తాయి పత్రికలు. ఇది ఆర్థిక రాజకీయం. ఎటుపోతున్నం మనం? ఎంతసేపూ రాజకీయమేనా? ప్రపంచంలో ఎవడైనా తన బ్రాండ్‌ను తాను ప్రమోట్ చేసుకుంటడా? పరువు తీసుకుంటడా? ఎవడైనా తాను ప్రయాణించే పడవకు తానే చిల్లు కొట్టుకుంటాడా? తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటాడా? అదే చేస్తున్నం. మన కంట్లో మనమే పొడుచుకుంటున్నం. తెలంగాణ బ్రాండ్‌ను తెగనాడుతున్నం. ఎందుకంటే మనమిప్పుడు తెలంగాణ వాసులుగా లేం. తెలంగాణ వాదులుగానూ లేం. మనమిప్పుడు అధికారానికి, రాజకీయానికి, పదవులకు, పందేరాలకు అమ్ముడుపోతున్నం. తవుడు బుక్కే తాసీల్దార్లకు మీసాలు దువ్వే మాసుల్దార్లుగా మారిపోయినం. గతం గుర్తుండని మతిమరుపు వ్యాధిని కావాలని కోరి కొనితెచ్చుకుంటున్నం. మన మనసిప్పుడు ‘ఢిల్లీ బావ’ జాలాలకు, లొల్లి భావజాలాలకు బందీ అయిపోతున్నది. స్వార్థ రాజకీయాల సం‘కుల’ సమరంలో చిక్కుకుంటున్నం. బాగున్నదాన్ని బాగున్నదని చెప్పలేని దుర్మార్గ, దౌర్భాగ్య మనో వైకల్య వ్యాధి మనల్ని కమ్ముకున్నది. టీఆర్ఎస్ను ఢీకొట్టే చేవలేక, వ్యూహరచన రాక, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతున్నం. ఏది పార్టీ ప్రయోజనం, ఏది ప్రాంత ప్రయోజనం అని గీత గీసి ఆడలేనివాడు లీడరే కాడు. టీఆర్ఎస్పై కోపాన్ని తెలంగాణ పథకాలపై చూపించేవాడు నాయకుడే కాడు. కేసీఆర్‌ను ఎదుర్కొనలేని అశక్తతతో తెలంగాణ ప్రజలను సాధిస్తే అది రాజకీయం కాదు, అరాజకీయం.
“తెలంగాణ ఏర్పడితే, సమస్య బయటి వాళ్లతో రాదు. లోపలివాళ్లతోనే వస్తుంది. శృతిమించిన రాజకీయ చైతన్యం, గతి తప్పిన పదవీ ఆరాటం, నిర్హేతుక అసహనం, నిరాధార అనుమానం అందుకు కారణం. గతమే ఇందుకు సాక్ష్యం” అని తెలంగాణ రావడానికి ముందే ఒక మిత్రుడు చెప్పిండు. పిచ్చి రాతల సోషల్ – మీడియా, పచ్చి అబద్ధాల యాంటీ సోషల్ పొలిటికల్ దాండియా చూస్తుంటే ఇంతకంటే ఏమని వర్ణించగలం!
kruthi1972@gmail.com