రాష్ట్రంలోని ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకోవడానికి తంటాలు పడుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి సలహా, సూచనలివ్వటం మానుకొని భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు అధికార దాహంతో కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం గర్హనీయం. ఇదిలా ఉంటే అధికార టీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే మీడియాలో కనిపిస్తామనే కుత్సిత బుద్ధి ప్రదర్శించటం సిగ్గుచేటు. రాష్ట్రంలో ఎవరి పాత్ర ఎలాంటిదో తెలుసుకోలేని స్థితిలో తెలంగాణ ప్రజలు లేరనేది వాస్తవం. ఈ విషయాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే ప్రతిపక్షాలకు అంతమంచిది. అంతేకానీ అరిచి గగ్గోలు పెట్టినంత మాత్రాన అధికారం వస్తుందని కలగనడం సిగ్గుచేటు. ‘అధికారం’ ఏమైనా అంగడి సరుకా?
టీఆర్ఎస్ వరుస విజయాలను చూసి ఓర్వలేని బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నేడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రాష్ర్టాలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నది. దీంతో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై వివక్ష చూపుతూ మతి తప్పిన రాజకీయాలు చేస్తున్నది. మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్ల రాజకీయం చేస్తున్నది. ఓటు బ్యాంకు కోసం మత విద్వేషాలు రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధిచెప్తారు. ఇక మరో జాతీయపార్టీ కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నది. దేశవ్యాప్తంగా అధికారం కోల్పోయి కాంగ్రెస్ నాయకత్వ లేమిని ఎదుర్కొంటున్నది. ఈ స్థితిలో ఉన్న పార్టీని బలోపేతం చేద్దామనే ప్రయత్నాలు అన్ని రాష్ర్టాల్లో విఫలమవుతుండటం ఆ పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు. దీంతో మతిభ్రమించిన కాంగ్రెస్ నేతలు అసహనంతో కువిమర్శలకు దిగుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వెంటిలేటర్‌పై ఉన్నది. వీటన్నిటికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు తన నోటి దురుసుతో అతిగా వ్యవహరించటం సొంత పార్టీ నేతలకే వెగటు పుట్టిస్తున్నది. నాయకుడికి వినయం విధేయత తప్పనిసరి. అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. ప్రజలకు కావాల్సింది అధికార పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు కాదు.
ప్రధాని మోదీ ఎప్పుడూ ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ అంటూ తెగ గొప్పలకు పోతారు. మరి బీసీ కులగణన ఎందుకు చేయట్లేదు? బీసీలు ఓటు బ్యాంకు కోసమే ఉపయోగపడుతారా? బీజేపీ బీసీల పక్షపాతి అంటున్నారు కదా? మరి బీసీల అభ్యున్నతికి కేంద్రం ఏం చేసిందో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం భిన్న సంస్కృతుల వారిని కలుపుకొని అన్ని కులాల వారికి చేయూతనందిస్తున్నది. జాతీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా ఉండాలి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రవర్తిస్తుండటం బాధాకరం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్నది. కాబట్టే టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ తగ్గడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలి. రాష్ట్ర బీజేపీ నాయకులకు ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి రాష్ర్టానికి నిధులు తీసుకురావాలి. అలా కాకుండా రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం నోటికి వచ్చిందల్లా మాట్లాడితే చెల్లుబాటవుతుందా? ప్రజల తరపున వాస్తవాలు మాట్లాడండి, ప్రజల్లో కొంతైనా విశ్వాసం ఉంటుంది. లేదంటే వచ్చే ఎన్నికల్లో కూడా గతంలో వలె డిపాజిట్ దక్కడం కూడా కష్టమే.
(వ్యాసకర్త: టీఆర్ఎస్వీ నాయకులు)
–మిద్దె సురేష్,9701209355