e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home ఎడిట్‌ పేజీ కుట్రలను ఓడిద్దాం

కుట్రలను ఓడిద్దాం

కుట్రలను ఓడిద్దాం

టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకుందాం!
తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుందాం!!
తెలంగాణ విద్యార్థి జేఏసీ చైతన్యయాత్ర

హుజూరాబాదుకు ఉపఎన్నిక ఎందుకు వచ్చింది?
ఈటల రాజేందర్‌ ఎందుకు రాజీనామా చేసిండు?
ప్రజల ప్రయోజనాల కోసమా? లేక తన స్వార్థ ప్రయోజనాల కోసమా?
నిన్నటిదాకా సిద్ధాంతపరంగా బద్ధ వ్యతిరేకులమని చెప్పుకొన్న ఈటల, బీజేపీలో చేరి ఆ నేతలతో చెట్టాపట్టాలు వేసుకొని ఒకటి కావటం వెనుక అసలు మత్లబు ఏంది? అసైన్డ్‌ భూములను ఖబ్జా చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటలను, బీజేపీ ఏమాశించి చేర్చుకున్నది. ఈటలను పావుగా వాడుకొని, బీజేపీ పన్నుతున్న పన్నాగమేమిటి? నిజానిజాలు నిగ్గుతేల్చడానికి, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైతన్య యాత్రను తలపెట్టింది తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని ఖతం చేసేందుకు, ఢిల్లీ పార్టీ బీజేపీ చేస్తున్న కుట్రలను బట్టబయలు
చేయడానికి విద్యార్థి జేఏసీ బయలుదేరుతున్నది.

- Advertisement -

ఫూలే, అంబేద్కర్‌, ఆశయాల వారసునిగా చెప్పుకొనే ఈటల రాజేందర్‌ తన పిల్లలను బీసీలుగా చెప్పుకోవడానికి ఇష్టపడడు. ఈటల ఆత్మగౌరవ నినాదం ఉత్త అబద్ధమని తేల్చడానికి ఈఒక్క ఉదంతం సరిపోదా? ఇది భయంకరమైన భావదాస్యం కాదా. తను పీడీఎస్‌యూ ప్రొడక్టుననీ, తన రక్తంలో ఉన్నది లెఫ్ట్‌ డీఎన్‌ఏ అనీ బీరాలు పలికిన ఈటల లెఫ్ట్‌ వదిలి రైట్‌లో చేరడం వెనుక ఉన్న అగత్యమేమిటి? అంబేద్కర్‌ ఆశయాలను నమ్మిన వాడే అయితే, దళితుల అసైన్డ్‌ భూములు ఆక్రమించే ప్రయత్నం చేస్తాడా? భూ కబ్జాలు వెలుగులోకి రాగానే అర్జెంటుగా నాగపూర్‌ శిబిరంలో చేరి నామం పెట్టుకుంటాడా? ఇది మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ల ఆశయాలను తాకట్టు పెట్టటం కాదా? ఎన్నోసార్లు బీజేపీని మతతత్వ, మనువాద పార్టీ అనీ దూషించిన ఈటల, తన అక్రమ ఆస్తుల రక్షణ కోసం బీజేపీ శరణుజొచ్చిండు. బీజేపీ కూడా అంతే అవకాశవాదంతో ఈటలను చేర్చుకున్నది. ఈ అపవిత్ర కలయికలో ఉన్నవి పరస్పర స్వార్థ ప్రయోజనాలే తప్ప ప్రజాప్రయోజనాలు ఎంత మాత్రం లేవన్నది నగ్నసత్యం.

అవినీతి ఆరోపణలున్న ప్రత్యర్థి పార్టీల నాయకులను చేర్చుకోవటం ద్వారా రాజకీయంగా బలపడాలన్నది బీజేపీ ఎత్తుగడ. ఈ రకమైన దుర్మార్గాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ అవలంబిస్తున్నది. శారదా స్కాంలో నిందితుడైన హేమంత్‌ బిస్వాస్‌కు రక్షణ కల్పించి, అస్సాంకు ముఖ్యమంత్రిని చేసింది. శారదా, నారదా స్కాంలలో ఇరుక్కున్న సువేందు అధికారిని చేర్చుకొని బెంగాల్‌కు సీఎంను చేయాలకున్నది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టిన టీడీపీ నాయకులు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లను చేర్చుకొని, అవినీతికి రక్షణకల్పించింది. అదే రకంగా భూముల ఆక్రమణ అభియోగాన్ని ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌నూ చేర్చుకున్నది. ఇద్దరూ తమ స్వార్థం కోసం ఒక్కటై టీఆర్‌ఎస్‌ను, తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు.

నిజానికి దశాబ్దాలుగా తీరని ఎన్నో సమస్యలను, ఏడేండ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం తీర్చగలిగింది. కరెంటు సమస్య తీరింది. తాగునీటి కష్టాలు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు సమృద్ధిగా లభిస్తున్నది. వరిధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ఆంధ్రను మించిపోయిం ది. దేశంలో పంజాబ్‌ తర్వాత రెండవ స్థానంలో తెలంగాణ సగర్వంగా నిలుచున్నది.

పథకాల అమలు సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తలపిస్తున్నది. ప్రతిఇంటికీ, ప్రతివ్యక్తికీ లబ్ధి చేకూరుతున్నది. పల్లెల్లో పచ్చదనం పెరిగి పరిశుభ్రత నెలకొన్నది. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో లేని ఆదర్శవంతమైన పథకాలు అమలవుతున్నాయి. అద్భుతమైన పరివర్తన రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నది

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే తపస్సులో కేసీఆర్‌ తలమునకలై ఉంటే, ఈటల మాత్రం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బలహీనపరిచే కుట్రలకు తెరలేపిండు. తనకు ఎనలేని గౌరవాన్ని, పదవులను కట్టబెట్టిన కన్నతల్లి వంటి టీఆర్‌ఎస్‌కు ద్రోహం తలపెట్టిండు. ప్రజలు మెచ్చిన సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా, విషం కక్కటం ప్రారంభించిండు. కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లను పరిగె ఏరుకోవటంతో పోలుస్తూ సంకుచిత వ్యాఖ్యలు చేసిండు. కాంగ్రెస్‌, బీజేపీ నేతలతో చీకటి ఒప్పందం చేసుకొని ఈటల సీఎం పదవికి అర్హుడు అని వాళ్ళ చేత వ్యాఖ్యలు చేయించిండు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఈటల నక్కజిత్తులకు ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి?

టీఆర్‌ఎస్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈటల వ్యవహరిస్తున్నా అధిష్ఠానం చాలాకాలం భరించింది. కానీ అసైన్డ్‌ భూముల ఆక్రమణ అభియోగాలపై మాత్రం ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. అభివృద్ధి సంక్షేమాలతో ముందుకు పోతున్న ప్రభుత్వంలో అవినీతి అక్రమాల ఆరోపణలు ఉన్నవారు ఉండటం భావ్యం కాదని, వెంటనే న్యాయవిచారణకు ఆదేశించి తన ధర్మాన్ని నిర్వర్తించింది. అది తట్టుకోలేక ఈటల ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా, బహిరంగంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే మంత్రివర్గం నుంచి తొలగించవలసి వచ్చింది. పత్రికా ముఖంగా, బహిరంగంగా తనకు తానుగానే ఈటల, భూములు కొనుక్కున్నానని ఒప్పుకొన్నడు. టీఆర్‌ఎస్‌ నుంచి తప్పుకొన్నడు. తన అక్రమ ఆస్తుల రక్షణ కోసం కాషాయ కండువా కప్పుకొన్నడు.

టీఆర్‌ఎస్‌ పార్టీయే కదా ఈటలకు రాజకీయ ఉనికిని ఇచ్చింది. హుజూరాబాద్‌ టికెటిచ్చి ఎమ్మెల్యేను చేసింది. సమర్థులైన నాయకులు పార్టీలో ఉన్నా ఈటలను శాసన సభాపక్ష నాయకుణ్ణి చేసింది. 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడగానే కీలకమైన ఆర్థిక, పౌరసరఫరాల శాఖలకు మంత్రిని చేసింది. 2018లో తిరిగి ఆరోగ్యశాఖ మంత్రిగా సముచిత స్థానాన్ని కల్పించింది. ఇంతగా ప్రాధాన్యమిచ్చి అక్కున చేర్చుకున్నా కన్నతల్లి వంటి పార్టీని చీల్చాలని చూసిండు ఈటల. కేసీఆర్‌కు ద్రోహం తలపెట్టి దారుణమైన ఆత్మవంచనకు పాల్పడ్డడు. అసైన్డ్‌ భూములను పోగుచేసుకొని పరవంచనకు చేరిండు. తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తూ బీజేపీతో కలిసి ప్రజావంచనకు పాల్పడుతున్నడు. ఈటల-బీజేపీ ఇద్దరి నయవంచనకు చరమగీతం పాడాలని హుజూరాబాద్‌ ప్రజలను తెలంగాణ బిడ్డలుగా విద్యార్థులుగా సవినయంగా కోరుతున్నాం.

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ తెలంగాణకు బీజేపీ తీరని అన్యాయం చేస్తున్నది. రాష్ట్ర ఆవిర్భావాన్ని అవమానిస్తూ ప్రధాని మోదీ ‘తల్లిని చంపి బిడ్డను బతికించార’ని కువ్యాఖ్యలు చేసిండు. ప్రజల మనోభావాలను గాయపరిచిండు. అమరుల త్యాగాలను కించపరిచిండు. రాష్ట్రంలోని ఏడు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రలో కలిపిన బీజేపీ తీరని ద్రోహం చేసింది. అసలే కరెంటు కష్టాల్లో ఉన్న తరుణంలో సీలేరు విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణకు లేకుండా చేసింది. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ హామీని బుట్టదాఖలు చేసింది. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కింది. గిరిజన వర్సిటీకి అతీగతీ లేదు. తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాల మధ్య నీటి వివాదాలను పరిష్కరించక పోగా ఇంకా ఆజ్యం పోస్తున్నది. ప్రాజెక్టుల నిర్వహణను సైతం తన చేతుల్లోకి తీసుకొని రాష్ర్టాల హక్కులను హరిస్తూ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నది.

రాష్ర్టానికి రాజ్యాంగబద్ధంగా కేంద్రం ద్వారా వచ్చే నిధులే తప్ప, అదనంగా ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. మిషన్‌ భగీరథకు, మిషన్‌ కాకతీయకు ప్రత్యేక నిధులు కేటాయించాలని నీతీఆయోగ్‌ సిఫారసు చేసినా కూడా చిల్లిగవ్వ విదల్చలేదు.

యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఆర్‌ ప్రాజెక్టును బీజేపీ అన్యాయంగా బెంగళూరుకు తరలించింది. నోటికాడి బుక్కను ఎత్తగొట్టింది. మన యువతకు దక్కాల్సిన వేలాది ఉద్యోగావకాశాలను దక్కకుండా చేసింది. మరోవైపు నిరుద్యోగుల మీద కపటప్రేమను ఒలకబోస్తూ కల్లబొల్లి మాటలు చెప్తున్నది. ఉల్టా చోర్‌ కోత్వాల్‌ కో డాంటే అన్న చందంగా టీఆర్‌ఎస్‌ మీద నెపం పెట్టి రాద్ధాంతం చేస్తున్నది.

2014లో స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ప్రజలు టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చుకున్నరు. 2018లో చంద్రబాబు, కాంగ్రెస్‌తో కలిసి దండయాత్రకు వస్తే కర్రుగాల్చి వాతపెట్టిన్రు. తెలంగాణ పొలిమేరల ఆవలిదాకా పారదోలిన్రు. టీఆర్‌ఎస్‌నే తిరిగి అధికారంలోకి తెచ్చుకున్నరు. ఇప్పుడు బీజేపీ, ఈటల భుజం మీద తుపాకీ పెట్టి టీఆర్‌ఎస్‌ను కాల్చడానికీ, తెలంగాణ అస్తిత్వాన్ని కూల్చడానికీ కుట్ర పన్నుతున్నది. నిన్న చంద్రబాబు కుట్రను తిప్పికొట్టినట్టే, నేడు బీజేపీ కుట్రను కూడాతిప్పికొట్టాలె!

తమిళ ప్రజలు ద్రవిడ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఎట్లయితే 50ఏండ్లుగా జాతీయ పార్టీలను ఓడిస్తున్నారో, తెలంగాణ ప్రజలు కూడా అదే విధంగా సోకాల్డ్‌ జాతీయ పార్టీలను నిరంతరం ఓడించాలె. సిసలైన తెలంగాణ అస్తిత్వ పార్టీ టీఆర్‌ఎస్‌నే గెలిపించుకోవాలె.

బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రాంతీయ ఆకాంక్షలను పట్టించుకోవు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకే దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉద్భవించాయి. ప్రాంతీయ పార్టీల ఉనికిని అస్సలు సహించని పార్టీ బీజేపీ. బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ర్టాలు అనేది బీజేపీ నినాదం. ఈ నినాదం రాజ్యాంగ విలువలకూ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దేశంలో తానుతప్ప ఇంకేపార్టీ ఉండకూడదని అనుకునే నియంతృత్వ భావజాలమిది. బీజేపీ అధికారం కోసం ఎంతటి అరాచకానికైనా దిగుతుంది. అబద్ధాలను ప్రచారం చేస్తుంది. వాట్సాప్‌ యూనివర్సిటీ ద్వారా అడ్డగోలుగా పుకార్లను రేపుతుంది.

సకల జనులను సబ్బండ వర్ణాలను ఏకతాటి మీద సీఎం కేసీఆర్‌ నడిపిస్తూ వుంటే, ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు విద్వేష రాజకీయాలకు బీజేపీ పూనుకుంటున్నది. పచ్చ ని రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి విఫల ప్రయత్నం చేస్తున్నది.

బీజేపీ అసమర్థ పాలనలో దేశ ఆర్థిక ప్రగతి రేటు పాతాళానికి దిగజారింది. కొత్తగా ఉద్యోగ ఉపాధి కల్పన జరగక పోగా, ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి. బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలు, వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేస్తున్నాయి. రైతులకిచ్చే ఎరువుల రాయితీలను బీజే పీ తొలగిస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువకు కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. గ్యాస్‌, పెట్రోల్‌ ధరలను పెంచుతూ జనం నడ్డి విరుస్తున్నది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఘోరంగా విఫలమై ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్టను మూటగట్టుకున్నది.

బెంగాల్‌లో ఘోరంగా ఓడిన బీజేపీ, ప్రస్తుతం ఉత్తరాది రాష్ర్టాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. దక్షిణ భారతంలోనైనా సీట్ల సంఖ్య పెంచుకోవాలని ఎత్తులు వేస్తున్నది. తమిళనాడు, కేరళలో బీజేపీ పప్పులు ఉడకవు. ఆంధ్ర, తెలంగాణలోనూ సీట్లు రాబట్టాలని ఆయాసపడుతున్నది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు బీజీపీకి ఈటల దొరికిండు. దొంగ, చీకటి ఒక్కటైనట్లు ఇద్దరూ ఒక్కటైన్రు. స్వార్థ ప్రయోజనాల కోసం సౌకర్యంగా తమ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిన్రు. బెంగాల్‌ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పినట్లు తెలంగాణ ప్రజలు కూడా అట్లే బుద్ధి చెప్పాలె. అనేక పోరాటాలకు ఊపిరులూదిన హుజూరాబాద్‌ ప్రజలు బీజేపీల నయా కుట్రలను ఛేదించాలె. ఉపఎన్నికలో ఈటల డిపాజిట్‌ గల్లంతు చేసి, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని నిరూపించాలె.

కాంగ్రెస్‌, బీజేపీలకు తెలంగాణ మీద ఎప్పుడూ వివక్ష! ఆంధ్రా పార్టీలకు తెలంగాణ ప్రజల మీద ఎన్నడూ తీరని కక్ష!! అస్తిత్వ పార్టీ టీఆర్‌ఎస్‌ ఒకటే నిజమైన రక్ష!!!. భారీ మెజారిటీతో టీఆర్‌ఎస్‌ను గెలిపిద్దాం. తెలంగాణ అస్తిత్వాన్ని, హక్కులను, అభివృద్ధిని కాపాడుకుందాం.

జై తెలంగాణ! జై హింద్‌!!
తెలంగాణ విద్యార్థి జేఏసీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కుట్రలను ఓడిద్దాం
కుట్రలను ఓడిద్దాం
కుట్రలను ఓడిద్దాం

ట్రెండింగ్‌

Advertisement