సప్త సముద్రాలున్నా
సాగువాటుకు నీరులేక
నెర్రెలు బారి
పల్లేర్లు మొలచిన నా నేల
అనునిత్యం
వలసగీతాన్ని
జాతీయ గీతంలా ఆలకిస్తూ
సావు గీతాలను
నిత్య పారాయణం జేసేటోళ్లం!
అలసిన దేహాలతో
ఆలువిల్లలను వొదిలి
మంద నుంచి విడదీసిన ఆవులా
పుట్టింటిని ఒదిలిన ఆడబిడ్డలా
సాగునీళ్లు లేక
కన్నీళ్లుగార్చుతూ
దారి ఖర్చులకే
మంగళ సూత్రాలను అమ్మి
ముంబాయి బస్సులెక్కిన
బక్కచిక్కిన పాలమూరు రైతన్నలు!
నేడు..
పల్లేర్లు మొలచిన నేలలో
పసిడి సిరులు వొలకవోస్తూ
కోన సీమను తలపించేలా
పల్లె.. నీళ్లతో నిత్యం తానం బోసుకుంటున్నది!
సాగువాటులో ప్రభంజనాన్ని
దిగుబడిలో ఉత్తర దేశానికి
వొణుకు పుట్టిస్తున్న
పసిడి సిరుల పుణ్యభూమి
నా నేల.. ఇప్పుడు!
ఒకనాడు ఆకలికేకలతో
అలమటించిన నేల
ఆకుపచ్చని అన్నపూర్ణగా
నేడు దర్శనమిస్తున్నది!
నాడు బీడువడి
నీటి బిందువుల స్పర్శకు
దూరమై గోడెల్లవోసిన నేల
నా పల్లె తల్లుల
చేతి స్పర్శ తగిలినంతనే
నిండు ముతైదువై నేడు
భారత భూమిలో
వెలుగొందుతున్నది!
నాడు వలసజీవుల ఖిల్లా
నేడు పంట సిరుల
పాలమూరు జిల్లా!
–ఉప్పరి తిరుమలేశ్
96189 61384