తే: రైతు లేడ్సిన రాజ్యంబు రాణకెక్క
దెద్దులేడ్సిన వ్యవసాయమెదుగదనుచు
సూక్తులుద్భవించిన నేల శోక వార్ధి
ముంప జూతురే రైతుల బుద్ధి మాలి!
ఆ: మట్టి బిసికి పంట పుట్టించు విధమును
నేర్చు కొనిన నుంచి నేటి వరకు
ప్రకృతి చేత దప్ప పగవారి చేతిలో
ఓడలేదు హాలికోత్తముండు!
మ: చెమటం జింది సమస్త మానవుల
కుక్షిన్ పట్టెడన్నమ్ముతో
సముదాయించు పవిత్రకార్యమున
దీక్షామగ్నులై యున్న రై
తుమహాత్ముల్ నడిరోడ్డుమీద
అరచేతుల్లేపికొట్లాడి కేం
ద్రముపై గెల్చిరి-వీరి మార్గము
శిరోధార్యమ్ము నెల్లప్పుడున్!
క: వెన్నెముక దేశమునకని
ఎన్నో వచియించి గద్దెనెక్కినపిదపన్
తన్నగల కుటిల వర్తను
లున్నారని తెలిసె రైతు లుద్యమ మెత్తన్!
సీ: కడుపులో పేగులాకటి చిచ్చునన్ మాడి
నపుడైన నినదమ్ములాగలేదు
పెయిమీద లాఠీలు విరిగినప్పుడు కకా
వికలులై వెనుకంజ వేయలేదు
వైద్యమందక పక్కవారి ప్రాణంబులు
పోయినప్పుడు గూడ పొగల లేదు
ఇనుపమేకులు దోవలను మూసి నపుడైన
పోరుబాటలు నిల్చిపోవ లేదు!
ఆ: దేశమునకు బువ్వ దినిపించు తలిదండ్రు
లలుగు వేళ ప్రభుతకణచ గలుగు
శక్తి గలదె? సర్వ శక్తులు హాలికుల
యుక్తినెదుర లేక ఓడిపోయె!
తే: మట్టినోడింప గలవాడు పుట్ట గలడె?
పంట పండింపకనువాడు బతుక గలడె?
రైతు చేతుల కరదండలను బిగించి
ఈ విశాల భారత భూమినేల గలడె?
క. శ్రమనెరుగని నాయకులకు
చెమట సముద్రముననీదు క్షితి పుత్రులకున్
సమరమ్ము పుట్టి ధర ధ
ర్మము గెలిచిన రీతి-జనములన్ నడిపించున్
తోకల రాజేశం, 96767 61415