‘నాయకుడు’ అంటే ప్రజలకు ఒక భరోసా. అలాంటి ఆశ్వాసం కలిగిస్తున్న నేతల్లో కేసీఆర్ మొదటిస్థానంలో ఉంటారు. తెలంగాణ కోసం యావత్ జాతిని ఏకం చేసిన స్ఫూర్తి, పాలనా అనుభవంతో దేశాన్ని ఒక్కటి చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్ప బలాన్ని తెలంగాణ సమాజం స్వాగతించాలి. ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశవ్యాప్తంగా రైతు సమస్యలపై పోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించటం ఆహ్వానించదగిన పరిణామం.
ఇక్కడే కేసీఆర్‌లోని జాతీయభావాన్ని చూడాలి. కరోనా కాలంలో ప్రధాని కంటే మిక్కిలి కేసీఆర్ యావత్ సమాజానికి భరోసాగా నిలిచారు. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ సమయస్ఫూర్తిని కొనియాడారు. వలస కార్మికులు ‘అన్నార్తులు, అనాథలు కాదు-దేశ సమైక్యతకు వారధు’లంటూ వారిని తెలంగాణ ప్రభుత్వం అక్కున చేర్చుకున్నది. దీన్ని జాతీయ మీడియా కూడా ప్రశంసించింది. ఇలా చెప్పుకొంటే.. దేశం గర్వించేలా జాతీయవాదాన్ని చాటిచెప్పిన ఉదంతాలు కోకొల్లలు.
2014 అక్టోబర్‌లో ఏపీలో హుదుద్ తుఫాన్‌తో విశాఖపట్నం అతలాకుతలమైంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి అండగా నిలిచింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం రూ.18 కోట్ల విలువైన 530 ట్రాన్స్ఫార్మర్లు, 28,500 కరెంటు స్తంభాలు, 900 కిలోమీటర్ల వైరు పంపింది. వాటిని అమర్చడానికి విద్యుత్ అధికారులు, సిబ్బందిని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పంపింది. 2018 ఆగస్టులో కేరళలో భారీ వర్షాలతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేల ఇండ్లు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేరళకు రూ.25 కోట్ల నగదు సాయం అందించింది. నీటిని శుద్ధి చేయడానికి రూ.2.5 కోట్ల విలువైన ఆర్వో మిషన్లు, వంద టన్నుల బియ్యాన్ని పంపింది.
కర్ణాటకలోని తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో 2018 జనవరిలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. పంటలు ఎండిపోయే పరిస్థితి రావడంతో ఆయకట్టు కాపాడుకోవడానికి, తాగునీటి అవసరాల కోసం కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ సహకారాన్ని కోరింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఆర్డీఎస్ ద్వారా కర్ణాటకకు 1.3 టీఎంసీల నీటిని అందించి అక్కడి రైతుల పంటలను కాపాడింది. తెలంగాణకు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లు సరిహద్దు రాష్ర్టాలు. వాటితో సాగునీరు, విద్యుత్, రవాణా తదితర రంగాల్లో పరస్పర సహకార సంబంధాలు నెరిపింది. దేశంలో ఏ రాష్ర్టానికి ఎప్పుడు ఏ విపత్తు సంభవించినా తెలంగాణ రాష్ట్రం తమవంతుగా సాయం చేసింది.
గోదావరి నదీజలాల వినియోగానికి సంబంధించి ఉమ్మడి ఏపీ, మహారాష్ట్రల మధ్య విభేధాలుండేవి. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఈ దీర్ఘకాలిక వివాదానికి తెరదించింది. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. దీంతో గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులపై రెండు రాష్ర్టాల మధ్య ఐదు బ్యారేజీలు నిర్మించడానికి మార్గం సుగమమైంది. తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. వెయ్యి మెగావాట్లను ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసింది. అలా గే.. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో వార్ధా నుంచి హైదరాబాద్‌కు 765 కేవీ డీసీ లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ మార్గం వల్ల ఉత్తర, దక్షిణ గ్రిడ్ల మధ్య విద్యుత్‌ను ఇచ్చిపుచ్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ ఫలితంగా చాలా తక్కువ సమయంలో పీజీసీఐఎల్ ఈ లైన్లను ఏర్పాటుచేసింది.
‘రాష్ర్టాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసుందాం’ అని ఉద్యమకాలంలో అన్న కేసీఆర్ తర్వాత కాలంలో దాన్ని ఆచరించి చూపారు. ఏపీకి అవసరమైన ప్రతి సందర్భంలోనూ స్నేహహస్తం అందిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ఏపీ కొత్త రాజధాని ‘అమరావతి’ శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి అనూహ్యమైన విజ్ఞప్తులు వస్తున్నయి. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని అక్కడి ప్రజలు ఉద్యమం ప్రారంభించారంటే కేసీఆర్ పాలనా తీరును అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తానని ప్రకటించారు.
కేంద్రం రూపొందించిన విద్యుత్ సవరణ చట్టం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని, దాన్ని వెనుకకు తీసుకోవాలని కేంద్రాన్ని హెచ్చరించారు. రైతాంగాన్ని ఆగం చేసి మోటార్లకు మీటర్లు ససేమిరా పెట్టనీయమని తేల్చిచెప్పారు. ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ర్టాలపై ఒత్తిడి తేవద్దన్నారు. రాష్ర్టాల హక్కులను హరించేవిధంగా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించి తీరుతామన్నారు. అవసరమైతే దేశవ్యాప్తంగా ప్రజలను, నేతలను ఏకతాటిపైకి తెచ్చి కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలను ఎదిరించి తీరుతామని ప్రకటించటం ఆహ్వనించదగినది. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ దేశం కూడా అభివృద్ది చెందాలని ఆలోచించటం చారిత్రక అవసరం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్, సామాజిక ఉద్యమకర్త)
వెంకట్ గుంటిపల్లి
94949 41001