e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News యూపీలో కమండల్‌ X మండల్‌

యూపీలో కమండల్‌ X మండల్‌

ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికలను హిందుత్వ ప్రభంజనంగా నిర్వచిస్తే, 2022 ఎన్నికలను మండల్‌ రాజకీయాల ప్రతిదాడిగా పరిగణించవచ్చా? ఇంత ముందుగా ఊహించకూడదేమో. కానీ.. వెనుకబడినవర్గాల్లో మాత్రం ఈ సరికొత్త ఆరాటం కనిపిస్తున్నది. వీరి పునరాగమన వాంఛ ఎంత బలంగా ఉన్నదనేది యూపీ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుంది. ఓబీసీ ప్రముఖులైన స్వామిప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌ బీజేపీకి రాజీనామా చేయడమే కాకుండా,
ఎస్‌పీలో చేరబోతుండటం.. రాజకీయంగా కీలకమైన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల పోరులో చెప్పుకోదగిన ఘటన.

ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో స్వామిప్రసాద్‌ మౌర్య సాధారణ నాయకుడు కాదు. బీఎస్‌పీలో మాయావతి కోర్‌టీమ్‌లో ఉండటమే కాకుండా, సుదీర్ఘకాలం పార్టీ కోసం ఎంతో కృషి చేశారు. 2012, 2014లో మాయావతి పరాజయాల తర్వాత వీరు 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ వైపు వెళ్ళారు. బీజేపీ విజయ దుందుభి మోగించడంతో స్వామిప్రసాద్‌ మౌర్యకు క్యాబినెట్‌ పదవి బహుమానంగా దక్కింది. ఆయన యోగి ఆదిత్యనాథ్‌తో సన్నిహితంగా లేనప్పటికీ, కొన్ని నెలల కిందటి వరకు బీజేపీకి విధేయంగానే ఉన్నారు. ఓబీసీలలో యాదవులు, కుర్మీల తర్వాత వీరి ‘మౌర్య’ సామాజిక వర్గమే అతి పెద్దది. మొత్తం రాష్ట్ర జనాభాలో ఎనిమిది శాతం ఉంటుంది. స్వామిప్రసాద్‌ మౌర్య తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కుశీనగర్‌ జిల్లాలో గల పద్రౌనా నియోజకర్గం నుంచి ఎన్నికైనప్పటికీ, రాయిబరేలీ, ఉంచాహర్‌, షాజహాన్‌పూర్‌, బదాయున్‌ జిల్లాల్లోని తన సామాజికవర్గంలో ఆయనకు ప్రాబల్యం ఉన్నది. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో వందకు పైగా స్థానాల్లో మౌర్య కులస్థులు గణనీయంగా ఉన్నారు. అందుకనే బేరసారాలకు దిగే శక్తి కోసం ఈ సామాజికవర్గం తమకంటూ ‘మోహన్‌ దళ్‌’ అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నది. తన ప్రచారం ప్రారంభించడానికి ముందే అఖిలేశ్‌ ఈ ‘మోహన్‌ దళ్‌’తో పొత్తు కుదుర్చుకున్నారు.

- Advertisement -

స్వామిప్రసాద్‌ మౌర్య మాదిరిగానే యూపీలో మంత్రిపదవికి రాజీనామా చేసిన దారాసింగ్‌ చౌహాన్‌ కూడా ఓబీసీ వర్గానికి చెందిన వారే. ఓబీసీలలోనే మరింత వెనుకబడిన వర్గమైన వీరి ‘నోనియా’ కులం తూర్పు యూపీ జనాభాలో మూడు శాతం ఉంటుంది. ఈ కులం వారణాశి, చందౌలీ, మీర్జాపూర్‌లలో విస్తరించి ఉన్నది. ‘నోనియా’ వర్గం కేంద్రంగా పనిచేసే పృథ్వీరాజ్‌ ‘జన్‌శక్తి’ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ, ఈ సామాజికవర్గంలో దారాసింగే అతి పెద్ద నాయకుడు.
స్వామిప్రసాద్‌ మౌర్య తనతో చేరడానికి ముందు, అఖిలేశ్‌ యాదవ్‌ రెండు ఇతర బలమైన కులాలతో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లోని జాట్‌ వర్గం 2017లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇచ్చింది. జనాభాలో రెండు శాతమే ఉన్నప్పటికీ, చారిత్రక కారణాల వల్ల, మాజీ ప్రధాని చరణ్‌సింగ్‌ వ్యక్తిత్వ ప్రభావం వల్ల, పశ్చిమ యూపీ, రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌లలో ప్రబలంగా ఉండటం వల్ల రాజకీయాల్లో బలమైన పాత్ర పోషిస్తున్నది. బీజేపీకి వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమం మూలంగా వీరు జయంత్‌ చౌదరి నేతృత్వంలోని ప్రధాన జాట్‌ పార్టీ ‘రాష్ట్రీయ లోక్‌దళ్‌’ వైపు చేరేలా చేసింది. ఈ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి ఉన్నది. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ‘ఆర్‌ఎల్‌డీ’పై తీవ్ర ఒత్తిడి వచ్చింది. అయితే రైతులు ఆగ్రహిస్తారనే కారణంగా బీజేపీకి ఆర్‌ఎల్‌డీ దూరంగా ఉన్నది.

ఉత్తరప్రదేశ్‌లో ‘రాజ్‌భర్‌’ అనేది మరో బలమైన ఓబీసీ వర్గం. తూర్పు యూపీలో 15 నుంచి 20 శాతం వరకు ఉండే ఈ సామాజికవర్గానిది ప్రముఖ పాత్ర. ఎన్నికల లెక్కల్లో కులాలు, ఉపకులాలు ప్రధాన పాత్ర వహించే సమాజంలో ఇంత భారీ సంఖ్య ఉన్న వర్గాన్ని ఏ పార్టీకానీ, నాయకుడు కానీ ఉపేక్షించరు. అందువల్ల ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పాత్రధారిగా అవతరించారు. ఆయన నేతృత్వంలోని ‘సుహెల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ’కి ఈ ప్రాంతంలో అమిత ప్రాధాన్యం ఏర్పడింది. 2017లో బీజేపీతో చేతులు కలిపిన రాజ్‌భర్‌- యోగీ ఆదిత్యనాథ్‌ మంత్రివర్గంలో క్యాబినెట్‌ మంత్రి అయ్యారు. మూడు నెలల కిందట అఖిలేశ్‌ యాదవ్‌ పక్షాన చేరారు. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి బీజేపీ వెంటనే ఇదే సామాజికవర్గానికి చెందిన రెండు పెద్దగా పేరులేని భీమ్‌ రాజ్‌భర్‌ నేతృత్వంలోని ‘భారతీయ సుహెల్దేవ్‌ జనతాపార్టీ’తోనూ, బాబూలాల్‌ రాజభర్‌ నేతృత్వంలోని ‘శోషిత్‌ సమాజ్‌ పార్టీ’తోనూ పొత్తు పెట్టుకున్నది. అయితే ఈ రెండు పార్టీల నాయకులకు ఓం ప్రకాశ్‌ రాజభర్‌కు ఉన్నంత గౌరవం, ప్రాబల్యం లేదు. మరో ఏడు చిన్నపాటి కుల పార్టీలతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకున్నది. స్థానికంగా తమ కులాలు, ఉపకులాల్లో ప్రభావం గల చిన్న పార్టీలు ఏర్పడటం మండల్‌ రాజకీయాలు తెచ్చిన ‘తుక్‌డా రాజకీయాల’ను ప్రతిబింబిస్తున్నది. అయితే రిజర్వేషన్‌ తదితర ప్రయోజనాలను తామే అనుభవిస్తున్న బలమైన ఓబీసీ కులాలకు వ్యతిరేకంగా బలహీన ఓబీసీ కులాల వ్యక్తీకరణకు చిహ్నంగా కూడా ఈ పరిణామాన్ని చెప్పుకోవచ్చు.

ఉన్నత వర్గాలలోని బ్రాహ్మణులు, ఠాకూర్ల మాదిరిగానే, ఓబీసీలలో యాదవులు, దళితులలో ‘జాతవ్‌’లు తమలోని బలహీన వర్గాలను ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అందువల్ల చిన్న సామాజికవర్గాలు ఏ సైద్ధాంతిక ప్రాతిపదిక పెట్టుకోకుండా తమకంటూ చిన్న పార్టీలు ఏర్పాటు చేసుకొని తమ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయి.

తమను ఉపయోగించుకుంటున్నా రంటూ ఈ బలహీనవర్గాలలో నెలకొన్న భావనను బీజేపీ చక్కగా వాడుకొని వారిని హిందుత్వ పరిధిలోకి తెచ్చుకున్నది. నరేంద్ర మోదీ, అమిత్‌ షా నాయక త్వంలో జరిపిన ఈ ‘సామాజిక నిర్మితి’ని చూసి, యూపీలోని 20 శాతానికి వ్యతిరేకమైన విస్తృత హిందు అస్తిత్వాన్ని స్థిరపరచామని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిం చింది. కానీ ఇదంతా తాత్కాలిక పరిణామమని నా అభిప్రాయం. తమకు ప్రధాన వాటా దక్కుతుందని భావించి హిందుత్వ శక్తులకు ఈ బలహీన కులాలు మద్దతు ఇచ్చాయి. కానీ బీజేపీతో మూడు ఎన్నికలు ప్రయాణించిన తర్వాత భ్రమలు తొలగిపోయి నిరాశ చెందాయి.

2017లో అఖిలేశ్‌ యాదవ్‌ ఓటమికి ప్రధాన కారణాలలో ఒకటి- తమ పార్టీ ముస్లిం- యాదవులకు చెందినది మాత్రమే అన్న అభిప్రాయాన్ని తొలగించుకో లేక పోవడం. ఈ అంశంపై యాదవేతర వర్గాలను బీజేపీ నమ్మించగలిగింది. అఖిలేశ్‌ యాదవ్‌ ఇప్పుడు ఈ అభిప్రాయాన్ని మార్చదలుచుకున్నారు. ఓబీసీ బలహీనవర్గాల్లో నెలకొన్న భ్రమలు తొలగిపోవడం ఆయనకు ఉపకరిస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్‌ప్రసాద్‌ మౌర్యకు బదులుగా, యోగి ఆదిత్యనా థ్‌ను ముఖ్యమంత్రి చేయడం వల్ల ఓబీసీలు తమను పట్టించుకోలేదని భావిస్తు న్నారు. ఠాకూర్‌ నాయకుడిగా కఠినంగా ఉంటాడనే అభిప్రాయాన్ని తొలగించు కోవడానికి యోగి ఆదిత్యనాథ్‌ తన పరిపాలనా కాలంలో ప్రయత్నించలేదు. యోగి కొనసాగితే ఓబీసీలను వెనుకకు తెచ్చుకోవడం కష్టమని మోదీకి, అమిత్‌షాకు అర్థమై.. ఆయనను తొలగించడానికి ప్రయత్నించారు. కానీ ఆర్‌ఎస్‌ఎస్‌ గట్టి మద్దతు ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ‘హిందుత్వమే సర్వం’ అనే ప్రాతిపదికను సృష్టిద్దామనుకున్న బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నానికి ఓబీసీలలో వచ్చిన అంతర్మథనం గండికొట్టింది.

అశుతోష్‌
(వ్యాసకర్త: ‘హిందు రాష్ట్ర’ రచయిత, ‘సత్యహింది.కామ్‌’ ఎడిటర్‌)

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement