finland education system | ఫిన్లాండ్ మానవాభివృద్ధి, సుస్థిరాభివృద్ధిలో ముందున్న దేశం ఫిన్లాండ్. అవినీతిని పూర్తిగా నిర్మూలించగలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ‘హ్యాపీనెస్ ఇండెక్స్’లో ముందువరుసలో ఉంది. ఈ దేశం జనాభారీత్యా, వైశాల్యంలో చిన్నదే అయినప్పటికీ ప్రపంచ దేశాలకు పాఠాలు నేర్పుతున్నది. ఫిన్లాండ్ సాధించిన విజయాలు ఎన్నో చెప్పుకోవచ్చు. వీటిలో విద్యావ్యవస్థ ప్రముఖమైనది. ‘ఎడ్యుకేషన్ ఇండెక్స్’లో ఇరువై ఏండ్లుగా ముందుంటూ నాణ్యమైన విద్యకు ఫిన్లాండ్ చిరునామాగా మారింది.
మన దేశంలో ప్రభుత్వాలు మారుతూనే ఉంటున్నాయి. అనేక విద్యా కమిటీలు, కొత్త కొత్త విద్యా ప్రణాళికలు, విద్యా విధానాలు, విద్యా కమిషన్లు వస్తున్నాయి, పోతున్నాయి. గుణాత్మక విద్య గురించి ఎక్కడా లేని మాటలు, ప్రచారాలు, చర్చలు, పేపర్లు, సెమినార్లు సాగుతున్నాయి. కానీ ఆచరణలో మాత్రం ‘ఎక్కడవేసిన గొంగళి’ అక్కడే ఉంటున్నది. రోజురోజుకు చదువుల్లో ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఫిన్లాండ్ విద్యా విధానాన్ని పరిశీలించవలసిన అవసరం ఉన్నది.
ఫిన్లాండ్లో శిశువు జన్మించిన వెంటనే తల్లిదండ్రులకు పిల్లల శిక్షణ గురించిన సాహిత్యం అందజేస్తారు. అది చదివి తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో ని మెలకువలు తెలుసుకుంటారు. ఏడాది నిండిన పిల్లలను డే కేర్ సెంటర్లలో చేరుస్తారు. ఈ సెంటర్లలో పిల్లలకు పాటలు, ఆటలు, కథలు, పెయింటింగ్, డ్రాయింగ్, గార్డెనింగ్, కార్పెంట్రీ తదితర అంశాల్లో ప్రాథమిక శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ భాషా సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై దృష్టి ఉంటుంది. చేతులకు, కాళ్ళకు, నోటికిచ్చే శిక్షణ మేధో వికాసానికి దారితీస్తుంది. పరికరాలను, చిన్న చిన్న యంత్రాలను ఊడదీయటం, బిగించడం. బంకమన్నుతో బొమ్మలు చేయడం, చెట్లకు పాదులు చేయడం, నీరు తోడుకొచ్చి మొక్కలకు పోయడం వంటి అనేక కృత్యాల వల్ల పిల్లల్లో చురుకుదనం పెరిగి శారీరక మానసిక వికాసాలు కలుగుతాయి. ఆరేండ్ల వరకు రాయటం, చదువటం లాంటివి ఫిన్లాండ్లో ఉండనే ఉండవు. ఆడియో విజువల్ పరికరాల ద్వారా అనేక విషయాలను పిల్లలకు పరిచయం చేస్తారు.
మన పాఠశాలల్లో స్కూల్ బ్యాగులు, భారీ సైజులో ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ పుస్తకాల్లోంచి పిల్లల మెదళ్లలోకి చేరేది అతి తక్కువ. ఫిన్లాండ్లోని ‘లెస్ ఈజ్ మోర్’అనే విధానం వల్ల జీవితానికి, కెరీర్‌కు అవసరమైన అతిముఖ్యమైన అంశాలను చాలా లోతుగా పిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ విధానాన్ని మనం స్వీకరిస్తే మన విద్యావ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలను అధిగమించవచ్చు.
ఏడో యేట పిల్లల్ని పాఠశాలల్లో చేర్పిస్తారు. ఈ ప్రాథమిక పాఠశాలల్లో 9 గ్రేడ్లు (తొమ్మిది తరగతులు) ఉంటాయి. ఈ తొమ్మిదేండ్లూ ఒక్కపూట బడే ఉంటుంది. 4 పీరియడ్లే ఉంటాయి. ప్రతి పీరియడ్ తర్వాత 15 నిమిషాల విరామం ఉంటుంది. 180 పనిదినాలుంటాయి. ఏడో గ్రేడ్ వరకు హోంవర్క్ ఉండదు. అక్కడ పెట్టే పరీక్షలు ఉపాధ్యాయులకు మాత్రమే ఉద్దేశించబడుతాయి. పిల్లల అభ్యసనను ఉపాధ్యాయులు అంచనా వేయటానికే పరీక్షలుంటాయి. పరీక్షా ఫలితాలు విద్యార్థులకు తెలియనివ్వరు. ఫైనల్ గ్రేడ్ మాత్రమే వారికి తెలుస్తుంది. ఫిన్లాండ్ విద్యా వ్యవస్థ సరళంగా ఉంటుంది. మనకన్నా అక్కడ సిలబస్ సగం కూడా ఉండదు. పిల్లల వ్యక్తిగత జీవితానికి, సామాజిక అభివృద్ధికి ఉపయోగపడని అంశాలు వారి సిలబస్‌లో ఉండవు. క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధా న్యం ఎక్కువ. ప్రతి విద్యార్థి ఎలా నేర్చుకుంటున్నా డో గమనిస్తూ స్లో లెర్నర్స్ మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. అందు కే విద్యార్థుల సామర్థ్యాలలో తేడా 20 నుంచి 30 శాతంలోపే ఉంటుంది. మన దగ్గర అది 80 నుం చి 100 శాతం వరకూ ఉంటుంది.
‘లెస్ ఈజ్ మోర్’ అనేది ఫిన్లాండ్ విద్యా విధానంలోని కీలకాంశం. మన విద్యా విధానంలో విద్యార్థులకు అనేక విషయాలు నేర్పించాలనే ఉద్దేశంతో సిలబస్‌లలో అనేక అంశాలు చేర్పిస్తున్నాం. వీటిలో జీవితంలో వారికి ఉపయోగపడేవి తక్కువ. ఫిన్లాండ్ కరికులంలో విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడని అంశాలు అస్సలుండవు. ఈ కోణంలో అక్కడ సిలబస్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. మన దేశంలో పిల్లలకు ఎక్కువ నేర్పాలనే ఆత్రుతలో అతితక్కువ మాత్రమే నేర్పగలుగుతున్నాం. మన పిల్లల్లో సామర్థ్యాలు, నైపుణ్యాలు తక్కువగా ఉండటానికి ఇదొక ముఖ్య కారణం.
ఫిన్లాండ్లో ఉపాధ్యాయ వృత్తికి ఎనలేని గౌరవం ఉంటుంది. దేశంలో అధిక వేతనాలు లభించేది ఉపాధ్యాయులకే. అందుకే ఈ వృత్తికి పోటీ ఉంటుంది. ప్రతి 14 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడుంటారు. కేజీ నుంచి పీజీ దాకా ప్రతి విద్యార్థికి ఉచిత, సమానావకాశాలున్న విద్య లభిస్తుంది. ఈ దేశంలో విద్యావ్యవస్థ మొత్తం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. జీడీపీలో 7 శాతం విద్యకే కేటాయిస్తారు. ఈ వ్యవస్థలో ఒత్తిడికి స్థానం లేదు. విద్యార్థులకు పాఠశాలలో అందించే ఆహారం పోషకాలతో కూడి ఉత్తమ స్థాయిలో ఉంటుంది. ఫిన్లాండ్ స్కూళ్లలో పెట్టే ఆహారం తాము ఇంటివద్ద వారంలో ఒక్కసారైనా పెట్టలేకపోతున్నామని అక్కడి తల్లిదండ్రులు భావిస్తారట.
ఫిన్లాండ్లో అమలవుతున్న విద్యా విధానాలను అనేక దేశాలు అనుసరణీయంగా స్వీకరించాయి. యూరప్ దేశాలే కాకుండా న్యూజిలాండ్, జపాన్, సింగపూర్, దక్షిణకొరియా వంటి దేశాలు కూడా ఇదే మార్గంలో నడుస్తున్నాయి. విద్యా విధాన రూపకర్తలు ఈ దేశాల్లోని వ్యవస్థలను అధ్యయనం చేసి మన కు ఉపయోగపడే అంశాలను స్వీకరించాలి. మన పిల్లలకు ఉత్తమ విద్యనందిస్తూ వారిని ఆధునిక ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలి.
(వ్యాసకర్త: ఉపాధ్యాయులు ఎం.నిర్మల్ కుమార్, 89197 23445 )
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
study in UK | విదేశాల్లో చదవాలని అనుకుంటున్నారా? అమెరికా కంటే యూకే బెటర్.. కారణమిదే
Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..
మహిళలకు గూగుల్ స్కాలర్షిప్స్