‘అచ్ఛే దిన్ ఆయేగీ…’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఏడేండ్లుగా సాధించిందేమీ లేదు. బీజేపీ పాలనను చూస్తుంటే పాతరోజులే బాగుండేవనిపిస్తున్నది. మోదీ చర్యలన్నీ ప్రజలను చెరపట్టి పీడించేవిగా, బాధించేవిగా ఉంటున్నాయి. 2018లో చేసిన పెద్దనోట్ల రద్దు దేశంలోని ప్రతి పౌరునికి చుక్కలు చూపించింది. ప్రధాని మోదీ దాని ఉపయోగాలపై ఊదరగొట్టి అరచేతిలో స్వర్గం చూపించారు. వారు చెప్పిన వాటిలో.. ముఖ్యమైనవి- నల్లధనం పూర్తిగా నిర్మూలించబడుతుంది. దొంగ నోట్ల చెలామణికి అడ్డుకట్ట పడుతుందన్నారు. కానీ ఇంతకుముందు లక్షల్లో ఉన్న నల్లధనం ఇప్పుడు వందల వేల కోట్లకు చేరుకున్నది. మొత్తంగా చూస్తే.. పెద్దనోట్ల రద్దు దాని లక్ష్యాలను చేరుకోకపోగా దేశ ఆర్థికవ్యవస్థ దిగజారిపోవడానికే కారణమైంది.
కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని గొప్పలకు పోతున్నది. ఆ పథకాల వల్ల కష్టాల్లో ఉన్న ప్రజలకు ఒనగూడిన ప్రయోజనం ఏంటి? ఆ పథ కాల లబ్ధి పొందిన ప్రజలు ఎంతమంది? వాటి లెక్కలేమై నా కేంద్రం వద్ద ఉన్నాయా?, ఉంటే ఆ విషయాలను బహిర్గత పరచాలంటే కేంద్రం ఎందుకు మొహం చాటేస్తు న్నది. ఇది కేంద్ర ప్రభుత్వ చేతకానితనాన్ని చూపుతున్నది. కష్టాల్లో ఉన్న ప్రజలను, మతోన్మాద చర్యలతో సఖ్యతను దెబ్బతీస్తూ ఎన్నికల్లో గెలుపే పరమావధిగా పనిచేస్తున్న బీజేపీ నాయకత్వ తీరు గర్హనీయం.
ఏడేండ్లుగా అనేక ప్రజోపయోగ సంక్షేమ పథకాలను అమలుచేస్తూ అన్నిరంగాల్లో గణనీయ ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రోత్సహించవలసింది పోయి కాళ్లల్లో కట్టెలు పెట్టే చర్యలకు పాల్పడుతున్నది. ప్రధాని మోదీ నినాదం.. ‘సబ్ కే సాథ్ సబ్ కా వికాస్’ ఎన్నికల నినాదంగా మారిపోయింది. ‘ఎన్నికలప్పుడే రాజకీయాలు, తర్వాత దేశ ప్రగతికే ప్రాముఖ్యం’ ఇస్తామన్న మోదీ మాట నీటిమూటగా మారిపోయింది. ఈ మాటలు బీజేపీని మరోమారు అబద్ధాల పార్టీగా తెలియజేస్తున్నాయి.
దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానన్న మోదీ అన్ని ప్రభుత్వరంగ సంస్థలను బహిరంగ వేలానికి పెట్టి అడ్డికి పావుసేరు చొప్పున అమ్మజూడటం ఎటువంటి అభివృధ్ధి ప్రణాళిక? ఒకవైపు ప్రైవేటురంగ సంస్థలు, కార్పొరేట్ శక్తులు ఇతర సంస్థలను కొంటూ దేశ సంపదను కాజేస్తుంటే భవిష్యత్తు వర్గాలకు ఇది మన దేశ సొత్తు అని చెప్పుకోవడానికి ఏమైనా మిగిలి ఉంటుందా? మోదీ ప్రభుత్వం నష్టాల్లోకి నెట్టివేయబడిన ప్రభుత్వరంగ సంస్థలతోపాటు లాభాలతో నడుస్తున్న సంస్థలను కూడా అమ్మజూడటం జాతి వ్యతిరేకం.
ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటూ పోవడమే పరిష్కారం అనుకుంటే, దేశ ఆర్థికవ్యవస్థను, దేశ ప్రగతికి తోడ్పడే ప్రభుత్వ సంస్థలను సరిగా నడపలేకపోతున్న ప్రభుత్వాన్ని, పార్లమెంట్, అసెంబ్లీలను కూడా ప్రైవేట్ పరం చేస్తారా? దేశ ఆర్థికవ్యవస్థ ఏ ఏటికాయేడు దిగజారిపోతున్నదని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఒక దేశ ఆర్థికవ్యవస్థ బలంగా ఉన్నదన్నదానికి ఆ దేశ ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉండటం, ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే ఆ దేశ కరెన్సీ బలంగా ఉండటం సూచికలు. కానీ బీజేపీ ప్రభు త్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రెండు సూచికలు అధోఃముఖంగా ప్రయాణిస్తున్నాయి. అంటే దేశం ఎంతటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
దేశంలో దాదాపు 60 శాతం నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే రంగం వ్యవసాయరంగమే. పారిశ్రామిక రంగాన్ని ఎంత ప్రోత్సహించి అభివృద్ధి చేసినా అది 5 నుంచి 10 శాతం వరకే నిరుద్యోగ సమస్యను తీర్చుతుం ది. వ్యవసాయరంగానికి తగు ప్రోత్సాహాలనిస్తూ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానిస్తే రైతులకు ఆర్థికంగా వెసులుబాటును కల్పిస్తూ వారి ఆదాయం రెట్టింపు కావడానికి దోహద పడుతుంది. దేశంలో ఆర్థికాభివృద్ధికి కావాల్సిన ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి సాగుభూమి, ఇంధన వనరులు (బొగ్గు, సూర్యరశ్మి, గాలి), నదీజలాలు, ఖనిజాలు మొదలైనవి. వీటి సక్రమ వినియోగానికి ప్రభుత్వమే ప్రణాళికలు రచించాలి. కానీ అతితక్కువ మొత్తాలకు ప్రైవేటువర్గాలకు అప్పగించి, తిరిగి వారినుంచి ఎక్కువ మొత్తాలకు విద్యుత్తు, నీరు, లోహాలను కొనడం తెలివైన పని కాదు. ఐదేండ్ల కోసం ఎన్నికయ్యే నాయకులకు ఈ దేశమంతా మా సొత్తేనని, మేం చెప్పిందే వేదమనే మూర్ఖపు ఆలోచనలు పనికిరావు.
ఈ దేశం నేటి చిన్నారులది, యువతది. నేటి నాయకులు వారి సొత్తుకు పూచీకత్తులే, కానీ సొంతదారులు కాదు. ఇష్టం వచ్చినట్టు ప్రజల సొత్తును దుబారా చేయ వద్దు. అట్లా చేస్తే వారు మన రాజ్యాంగానికి ద్రోహం చేసినట్లే. వాగ్దానాలను నిలబెట్టుకోలేని మోదీ ప్రభుత్వం మొదటినుంచి తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా, పార్లమెంట్ సాక్షిగా రావలసిన, ఇవ్వవల్సిన అనేక అంశాలను పట్టించుకోకుండా వివక్ష చూపుతున్నది. తెలంగాణలో బీజేపీ ఎంత తొండాట ఆడినా 2023 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమనేది కల్ల.
బీజేపీ రాజ్యాంగబద్ధ పాలనకు కట్టుబడాలి. రాష్ట్రం ఏదైనా, అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏ పార్టీదైనా ఆ రాష్ట్ర ప్రజలందరూ భారతీయులే అన్న స్పృహతో పాలన కొనసాగిస్తేనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ, అన్ని రాష్ర్టాల్లో మా పార్టీయే పరిపాలన చేయాలనే అహంకార నియంతృత్వ పోకడలతో ఆలోచిస్తే ఇది ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగించలేదు. చాలా విషయాల్లో అతితక్కువ సమయంలోనే బీజేపీ కూడా వందేండ్ల కాంగ్రెస్ లాగ మారడం నేటి చారిత్రక సందర్భం.
(వ్యాసకర్త: విశ్రాంత ఆచార్యులు, పూర్వ రిజిస్ట్రార్, కేయూ)
–డా॥యస్.జగన్నాథస్వామి
98492 72970