ఎదలో దాగిన దిగులుతో
ఏరువాక సాగడానికి
వాన చినుకు రాక కోసం
ఆకాశంలో చూపులతో!
మిణుకు మిణుకు ఆశలతో
కండ్లల్లో మెరిసే మెరుపు కోసం
మట్టిని గట్టిగా నమ్ముకున్న
మెత్తటి మనసున్న మట్టిలోని మాణిక్యం!
ఆశ చిగురించి ఆకాశం కరుణించి
కురిసిన వర్షం హర్షంలా
తడిసి ముద్దయిన నేల
తలంటు పోసుకున్న ముగ్ధలా!
ఆనందంతో రైతన్న అడుగులు
పదనిసలు పాదముద్రలుగా
తడిసిన మట్టి, కాళ్లను ముద్దాడి
పాదానికి రక్షణగా పాదరక్షలుగా!
సంగీత హోరులా నీటి జోరు
రైతు ఆనంద బాష్పాలు
రంగులు పులుముకొని
ఆకాశాన ఇంద్రధనుస్సులా!
మాగిన మట్టి కమ్మని వాసన
ప్రకృతిలోని అమ్మతనాన్ని
తట్టి లేపిన వైనం
పరవశించిన నేల ప్రసూతితో!
పొత్తిళ్ళలోని విత్తనం మొక్కయి
మొక్కిన మొక్కు తీరితే
కల్లాలలో పంటల కుప్పలు
కండ్లల్లో కలల పంటలు!