కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో జరుగనున్న ఉప ఎన్నికలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పోటీ చేయాలని ఆ పార్టీ రెబల్ చీఫ్, ప్రతిపక్ష నేత రిటాబ్రత సూచించారు. ఆమె పోటీ చేస్తే తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంటామని ఆయన తెలిపారు. (Mamata Banerjee) మమతా బెనర్జీ తిరిగి అసెంబ్లీకి రావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. టీఎంసీలో తిరుగుబాటు చేసి రెబల్ వర్గానికి నేతృత్వం వహిస్తున్న రిటాబ్రత మీడియాతో మాట్లాడారు. నందిగ్రామ్ ఉప ఎన్నిక కోసం తమ అభ్యర్థిని ఖరారు చేసినట్లు చెప్పారు. ‘మమతా బెనర్జీ అసెంబ్లీకి రావాలని మేం కోరుకుంటున్నాం. ఆమె నందిగ్రామ్ నుంచి ఎన్నికై వస్తే ఇంకా బాగుంటుంది’ అని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేసినా సరే ఎన్నికల బరిలోకి తమ అభ్యర్థిని నిలుపబోమని ఆయన తెలిపారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి గెలవడానికి బదులుగా, బెంగాల్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి ఉప ఎన్నికలపైనే మమతా బెనర్జీ ఎక్కువగా ఆధారపడతారని రిటాబ్రత విమర్శించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తన నియోజకవర్గం, వార్డు, సొంత పోలింగ్ బూత్‌లో కూడా గెలువలేకపోయారని ఎద్దేవా చేశారు. అందుకే ఈసారి ఆమె నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి గెలవాలని తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు.
మరోవైపు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన సీఎం సువేందు అధికారి, భవానీపూర్ ఎమ్మెల్యే స్థానాన్ని నిలుపుకుని నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. బెంగాల్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న బైపోల్స్ జరుగనున్నాయి. అక్టోబర్ 9న ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఎంసీలోని రెండు వర్గాల వాదనలను ఎన్నికల సంఘం (ఈసీ) పరిశీలిస్తున్నది.