“కేసీయారే మంచి‘గుండె’.. ఆయనున్నప్పుడు శేతిల పైసలాడుతుండె. గీ కాంగ్రె‘సొచ్చినంక’ పైసుంటలేదు. అప్పు జేద్దామంటె అదాత్కు ఎవ్వడిత్తలేడు. అప్పిచ్చేటోడైనా ఏం జూసిత్తడు? మనమెట్లగడ్తమనే అనుమానం ఆనికుండదా? ఎండకాలం పంట ఏద్దామంటే నీళ్లిచ్చేది, ఇయ్యంది నమ్మిక లేదాయె? ఇగ రైతుబంధు బందైపాయె, పింఛన్లు జాడ, పత్తా లెవ్వాయె, ఇగ పైసల్.. శేతులెట్లుంటయి?, కేసీయారున్నప్పుడే మంచి‘గుండె’. పదో, పరకో శేతిల పైసలాడినయి, పక్కపొంటోని మొహం సూడకుంట బతికినం…” ఈ మాట ఎవరిదో తెలుసా? పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పోచంపల్లి గ్రామానికి చెందిన కె.లచ్చన్నది.
గ్రామం, మండలం ఓడేడు ముత్తారం, జిల్లా పెద్దపల్లి. రాజయ్య నాకు పిల్లనిచ్చిన మామ పెద్ద సడ్డకుడు. తొంభై ఏండ్ల దాన్క ఉంటడు! ఎగిలివారంగనే లేసి గూసునే పెద్దమనిషి శనారం నాడు ఇంకా లేస్తలేడని జూస్తే పెయ్యి సల్లవడి ఉన్నదట. ‘ఇంట్ల మంచంలున్నోన్ని అరుగు మీద పండవెట్టిర్ర’ని పొద్దున్నే ఫోన్ రానే అచ్చింది గనీ, మనకు తీరిక ఉండొద్దా కడసూపు నోసుకోవడానికి? మనం ఉండేదేమో పట్నంల, ముత్తారం 200 కి.మీ.పైనే ఉంటది. పొయి రావాల్నంటే పొంటె సరిపోతదా, పొద్దంతా గావాలె! అందుకే వీలు గాలె.
సావు కన్న వోలెదు, కనీసం బామ్మర్దులనన్న మందలిచ్చద్దామని బైలెల్లిన. మా పెండ్లయినంక ముత్తారం బోవుడు గిదే మొదాలు. 2025, మార్చి 2 ఐతారం పొద్దుగూకి ఐదున్నర గొడ్తున్న ది. ఓ ఇంట్లకెళ్లి మనిషి జరిగివోయిండంటె ఎంత బాధుంటదో ఎర్కే గదా? ఆ మర్పిచ్చేటందుకని ఇంత మందు వట్కపోవుడనేది తెలంగాణల అనాదిగా వస్తున్న ఆచారం. దీన్నే ఇంకో తీరుగ జెప్పాల్నంటే శేదువాపుడంటరు. అందుకే మా బామ్మార్దులకో మందుబాటిల్, ఆ ఇంటి ఆడోళ్లకో థంసప్ బాటిల్ వట్టుకొని రాజయ్యింట్ల కాలువెట్టిన. నేనచ్చిన్నని తెల్సుకున్న బామ్మర్దులు ఇంటెన్క నుంచి ఉర్కిరానే అచ్చిర్రు. వాళ్లిద్ద ర్ని అల్ముకొని ఓదార్చి, ఆవల్కి పట్కవోయిన. శేదువాపే కార్యం షురువైంది. రాజయ్య కాలంజేసిన క్రమాన్ని గురించి తెల్సుకుంట బామ్మర్దులతోని మాట్లాడుతున్న. బంజేసిన గావట్టి నేను థంసప్, బాపు వోయిన బాధల మా బామ్మర్దులు ఒక పెగ్గు, రెండు పెగ్గులు, మూడు పెగ్గులు.. పోస్తున్నకొద్దీ మందు పోతనే ఉన్నది. ‘కేసీయారున్నప్పుడే మంచిగుండె..’ అని రాజకీయాల ముచ్చట్లు దీసిండు లక్ష్మణ్ (నాకు సడ్డకుడైతడు). ‘ఈడేం జేత్తున్నడు కూలగొట్టుడు దప్ప ఏం జేత్తలేడు. అడ్లకు బోనసిస్తనన్నడు, ఏది బోనస్? ఆడోళ్లకు నెలకిరువైదు వందలిత్తనన్నడు ఎవ్వవి? సద్వుకునే ఆడివిల్లలకు బండ్లిస్తనన్నడు ఎవ్వవి?’ సందియ్యకుండా మాట్లాడుతనే ఉన్నడు. ‘ఎహ్హే, కాదన్నా.. ఈ మూడు రంగుల జెండా పార్టీ సారే మంచిగున్నడు. మస్తుద్యోగాలిచ్చె, కాళేశ్వరం నీళ్లియ్యవట్టె, కరెంటియ్యవట్టె..’ అని నేను. ‘కాదు, కాదు తమ్మీ కేసీయారే మంచిగుండె’ అని లచ్చ న్న. మందెక్కువైనా కొద్ది మా ఇద్దరి మజ్జన మాటలు పెర్గుతనే ఉన్నయి.
ముగ్గురు బామ్మర్దులు మా ఇద్దర్నే జూస్తున్నరు. ఇద్దరు బామ్మర్దులు మంచిగనే ఉన్నరు గని, శిన్న బామ్మర్ది రమేశ్‌కు మాత్రం మందెక్కువైంది. అప్పటిదాన్క గూత బైటికి తియ్యనోడు ఒక్కసారి నా షురూజేసిం డు. సీఎం సారొచ్చి రమేశ్ ముందట గూసున్నట్టే ఊహించుకుంటున్నడు. నన్నే రేవంతు సారనుకుంటున్నడు. అనుకుంటేమాయె గని గీ కథ సూడుర్రి.. ‘ఇగ్గొ ఇప్పటిదాన్క నేనేం మాట్లాడ లె. మూడు పెగ్గుల మందు వడ్డన్క గూడ నిజం మాట్లాడకుంటే నాకు నియ్యత్ లేనట్టె. ఏందేం ది? నువ్వు ముక్కమంత్రివా? అసలు నీకా కుర్సీ ల గూసునే ఐశతుందా? లేనే లేదుపో. నోట్లెకెళ్లి గూతెల్తె కేసీయార్‌ను తిడ్తున్నవ్? నీకు, కేసీయార్ కు జమీనాస్మాన్ ఫరక్ తేడున్నది. కేసీయార్ తెలంగాణను నిలవెడ్తె, నువ్వు కూలగొడ్తున్నవ్, కేసీయార్ తెలంగాణను పచ్చగజేస్తే.. నువ్వు పడావుంచుతున్నవ్? కేసీయార్ రైతును రాజు జేస్తే, నువ్వు రాచి రాంపాన వెడ్తున్నవ్? కేసీయా ర్ ముసలొల్లను దగ్గర్కి దీస్తే.. నువ్వు ఆ ముసలొల్లకు మూడు శెర్ల నీళ్లు తాగిస్తున్నవ్?, కేసీయా ర్ కల్యాణలచ్మి ఇస్తే.., నువ్వు తులం బంగార మాశ వెట్టి మోసం జేసినవ్? కేసీయారున్నప్పు డు నా అసొంటి రైతులు మందుబత్తాల కోసం శెప్పులు లైన్ల వెట్టలె, నువ్వు శెప్పులు లైన్ల వెట్టే పరిస్థితిని మళ్ల తీస్కచ్చినవ్?’ అని ఇరాం లేకుం ట తిట్టవట్టిండు. వశపడక బామ్మర్దులిద్దరు ‘వారి రమేశా.. నీ ఎదురంగున్నది మన సతీష్ బావరా, నువ్వు ఎవ్వలనుకుంటున్నవ్?’ అని లోపలికి పట్కవోయిర్రు.
‘బావ ఏమనుకోకు… రమేశ్గానికి మందెక్కువైంద’ని నన్ను సముదాయించవట్టిర్రు. ‘ఏ… గదానికేమైతది తియ్యిర్రోయి. మందన్నప్పుడు ఎక్కువైతనే ఉంటది, మనిషన్నప్పుడు తూలుతనే ఉంటడు. ఆ మందే నిజాలు మాట్లాడిపిస్తద’ని పైకి గట్టిగనే అన్న గనీ, మన్సుల మాత్రం ‘గోసకినా వారెత్తు శేదువాపడానికొస్తే చేదనుభవం ఎదురాయెనెమురా?’ అనుకుంటా పట్నం బాట వట్టిన.
2025, మార్చి 3 పొద్దుగాళ్ల 8 గంటలకు రింగయితున్న ఫోన్ దీస్కచ్చి నా శేతిల వెట్టింది మా ఇంటామె. ఎవ్వలా అన్జూస్తే రాపెల్లి రమేశ్ అని పేరు కనవడ్తున్నది. ‘బావా.. నీకు దండం బెడ్త జర తప్పు వట్టుకోకు, నాత్రంతా ఎటో జేసిన్నట.. కేసీయారున్నప్పుడే మంచి‘గుండె’ బావ, ఈ సీఎం పాడుగాను మమ్మల్ని ఇంతగనం గోసవుచ్చుకుంటున్నడు. అందుకే గంతగనం కోపమొచ్చింది. అవ్వతోడు బావ మందెక్కువైంది. ఆ నిషాల నువ్వు రేవంత్ రెడ్డివనుకొని తిట్టిన గనీ, లేకుంటే నిన్నెందుకు తిడ్త బావ’ అని బతిలాడవట్టిండు. ‘సరే తియ్యోయ్.. మందన్నప్పుడు ఎక్కుతనే ఉంటది, మాటన్నప్పుడు జారుతనే ఉంటది’ అని ఫోన్ కట్జేసిన. అని మా ఇంటామె అడుగుతే.. ‘గిట్లుంటయి మీ అన్నగాళ్ల కథలు’…