పరిస్థితులు ఒక్కోసారి అనూహ్యంగా, విచిత్రంగా ఉంటాయి. ఏదైనా విషయమై రెండు పక్షాలు వాద సంవాదాలతో పరస్పరం తలపడినప్పుడు, ఆ రెండు పక్షాలకూ తెలియకుండా మూడవది ఒకటి ముందుకువస్తుంది. ఆ మూడవ పక్షం వాదన ఆసక్తికరంగా మారుతుంది. అటువంటి ఉదంతం ఒకటి జనవరి 31న కనిపించింది. ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకు ప్రతిగా కేసీఆర్ గురించి, ఆయన పరిపాలన గురించి ఎదురు విమర్శలు చేశారు. ఇదంతా 31వ తేదీ మధ్యాహ్నం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 202 4-25వ సంవత్సరపు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టింది. ఆ సర్వే తెలంగాణ గురించి ఏమన్నది? లేదా, కేసీఆర్-రేవంత్‌రెడ్డిల సంవాదంలో, ఆ సంవాద అంశాలపై, ఒక మూడవ పక్షంగా ఏమన్నది? ఇది అందరూ తెలుసుకోదగిన ఆసక్తికరమైన విషయం. అందులోకి వెళ్లేముందు మరొక విష యం చెప్పుకోవాలి. ఈ ఇద్దరు నాయకుల సంవాదానికి ముందురోజున అనగా జనవరి 30వ తేదీన, ఆన్లైన్ ఫలితం ఒకటి వెలువడింది. అం దులోని అంశం ఎవరిపాలన బాగుందని. దానిని నిర్వహించింది స్వయంగా కాంగ్రెస్ పార్టీయే. అందులో పాల్గొన్నది సామాన్య ప్రజలు. ఆ ఫలితాలు ఏమన్నాయి? మూడింట రెండు వంతుల మంది కేసీఆర్ పాలనను, ఒక వంతు మంది రేవంత్ రెడ్డి పాలనను ప్రశంసించారు.
ఆన్లైన్ పోల్ ఫలితాలు ఇద్దరు నాయకుల ప్రసంగాలలోనూ ప్రస్తావనకు వచ్చాయి. ఆ విధంగా, ఈ సంవాదంలో ఆర్థిక సర్వే వలెనే, ఆన్లైన్ పోల్ రూపంలో సామాన్య ప్రజల అభిప్రాయం కూడా మూడవ పక్షమైంది. కాకతాళీయంగా ఆ సర్వే చెప్పింది, ప్రజలు చెప్పింది ఒక్కటే అయింది. అవి రెండూ కేసీఆర్‌తో ఏకీభవించాయి. రేవంత్‌రెడ్డి ఒంటరి అయ్యారు. ఓవరాల్ స్కోర్ 3:1 అనగా, నాలుగింట మూడు వంతులు ఒకవైపు, ఒక వంతు మరొక వైపుగా మారింది.
కేసీఆర్ ఏమన్నారు, రేవంత్‌రెడ్డి అన్నదేమిటనే వివరాలు పత్రికలలో వచ్చినవే గనుక అదంతా ఇక్కడ మళ్లీ రాయనక్కరలేదు. రెండింటి మధ్య తేడా రేవంత్‌రెడ్డి భాష. ఎవరు చేసిన అభివృద్ధి ఏమిటో, చేయనిదేమిటో ఇరుపక్షాల నుంచి వింటూనే ఉన్నాము. ఆయన భాష కూడా వింటున్నదే గనుక, అది కూడా చెప్పుకోనక్కరలేదు. భాషను అట్లుంచి, అభివృద్ధికి సంబంధించి ఉభయుల వాదనల విషయమై, ఒకవైపు ప్రజలు, మరొకవైపు ఆర్థిక సర్వేతో కూడిన మూడవ పక్షం తీర్పు ఏమిటన్నది ఇక్కడ ప్రధానం. అంతిమంగా ప్రజలకు అవసరమైంది, వారు చూసేది అదే. అట్లాగే, కేంద్ర, ఆర్థిక సర్వే వంటి నివేదికలను రూపొందించే నిపుణులు దృష్టి పెట్టేది కూడా దానిపైనే.
ఆ విధంగా కేసీఆర్-రేవంత్‌రెడ్డి సంవాదంలో ఎవరి మాటలకు గల విలువ ఎంతో ఎవరికి వారు తేల్చుకోవచ్చు. నిజానికి, ప్రస్తుత కేంద్ర ఆర్థిక సర్వే తరహా నివేదికలు గతంలోనూ అనేకం వెలువడ్డాయి. వాటిలో ఇటీవలి రిజర్వ్ బ్యాంక్ది ఒకటి. అది కూడా సంవాదంలో మూడవ పక్షం అవుతుంది. ఆర్థిక సర్వేలో, రిజర్వ్ బ్యాంక్ నివేదికలో పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిందేమిటన్న దానిపై ఏమన్నారో ఇప్పుడు స్థూలంగా చూద్దాము.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించిన ఆన్లైన్ పోల్‌లో వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని. చివరగా, ఉభయ నాయకుల సంవాదాన్ని. దీనంతటిని బట్టి ఎవరి అభిప్రాయానికి వారు రావచ్చు. ఆర్థిక సర్వే, రిజర్వ్ బ్యాంక్‌ల నివేదికల అంశాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన అభిప్రాయాలు చెప్పటం కూడా చాలా అవసరం. ఎందుకంటే, ఇంతవరకు ఈ రెండింటితో పాటు ఎంతో ముఖ్యమైన పలు నివేదికలు వెలువడినా ప్రభుత్వం మౌనం వహించింది తప్ప ఒక్కమాటైనా మాట్లాడలేదు.
ఎందుకో తెలియదు. పైగా, కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనమైందని, వందేండ్లు వెనుకకు వెళ్లిందనే మాటలనే ముఖ్యమంత్రి, అందరు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పదే పదే అం టూ వస్తున్నారు. ఇటువంటి ముఖ్యమైన నివేదికలపై నోరు విప్పనప్పుడు ప్రజలు వారి గురించి ఏమనుకోవాలి? తమ విమర్శలకు ప్రజల దృష్టి లో విశ్వసనీయత ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 31న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే అంశాలను చూద్దాము. వాటిని బట్టి, సొంత పన్ను ఆదాయ వసూళ్లలో తెలంగాణ మొత్తం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సాగు జలాల విషయంలో పంజాబ్, హర్యానా తర్వాత మూడవ స్థానానికి ఎదిగింది. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్న రాష్ర్టాలలో ఒకటిగా మారింది. రియల్ ఎస్టేట్, సేవారంగాల్లో అగ్రగామిగా నిలిచింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే వీ హబ్ మొత్తం దేశంలోనే అసమానమైనదని పేర్కొన్నది. ఏడు వారాల క్రితం డిసెంబర్లో విడుదలైన రిజర్వ్ బ్యాంక్ వారి ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024’ అయితే, కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధిపై ఇంకా అనేక గణాంకాలను పేర్కొన్నది.
వాటి ప్రకారం తలసరి ఆదాయం 2014-15లో ఉండిన రూ.1,03,889 నుంచి 2023-24 నాటికి రూ.3,56,564కు పెరిగి మొత్తం దేశంలోనే మొదటి స్థానానికి చేరింది. ఇది 243 శాతం పెరుగుదల. ఇదే కాలంలో జీఎస్డీపీ, లేదా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.4.3 లక్షల కోట్ల నుంచి రూ.15.01 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 249 శాతం పెరుగుదల. తలసరి విద్యుత్తు వినియోగం 108 శాతం పెరిగి 1,151 యూనిట్ల నుంచి 2,398 యూనిట్లకు చేరింది. సాగునీటి సదుపాయం 105 శాతం విస్తరించి 78.18 లక్షల ఎకరాలకు బదులు 160 లక్షల ఎకరాలైంది. స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 106 శాతం ధాన్యం ఉత్పత్తి 119 శాతం, వైద్యంపై ప్రభుత్వ వ్యయం 175.5 శాతం, సాగు విస్తీర్ణం 47.74 శాతం, మూలధన వ్యయం 578 శాతం, రహదారుల నిడివి 52.42 శాతం పెరిగాయి.
నిరుద్యోగం పట్టణ ప్రాంతాలలో 28.76 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 85.7 శాతం తగ్గింది. శిశు మరణాలు 66.6 శాతం తగ్గాయి. పోషకాహారానికి మాంసాహారం ఒక సూచిక అనుకుంటే, ఆ ఉత్పత్తి వంద శాతం పెరిగి, తెలంగాణ మొత్తం దేశంలోనే ప్రథమ స్థానానికి చేరింది. తెలంగాణ అప్పులు రూ.7 లక్షల కోట్లకు పైగానన్నది ప్రచారం కాగా, అది ఎంతమాత్రం నిజం కాదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేస్తూ, ఆ మొత్తం రూ.3 లక్షల కోట్ల 89 వేలు మాత్రమేనన్నది. ఈ లెక్కలన్నీ ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ పెద్దలు, వారి ప్రియమిత్రులైన మేధావి గణాలు చూసి ఉంటారా? లేక దివాంధులుగా మారి ఉంటారా? వీరెవ్వరి నుంచి చడీచప్పుడు మాత్రం వినరాలేదు.
వినరాకపోగా, అవే ప్రచారాలు, సవాళ్లు, ఈ కాంగ్రెస్ ఆన్లైన్ పోల్ సందర్భంగా జనవరి 31వ తేదీన సైతం సాగించారు. అడాల్ఫ్ హిట్లర్, ఆయన ప్రచారమంత్రి జోసెఫ్ గోబెల్స్ జీవించి లేరు గాని, ఉండి ఉంటే ఈ మంత్రులు, నాయకులు, మేధావులను తమ సలహా మండలిగా నియమించుకునేవారు. అసత్య ప్రచార విద్యలో నిష్ణాతులైన ఆ ఇద్దరు జర్మన్ నేతలకు వీరు అనేక మెళకువలు నేర్పగలిగేవారు.
ఇంతకూ జనవరి చివరి రోజుల నాటి సర్వే అధికార పక్షం స్వయంగా నిర్వహించుకున్నదే. రాష్ర్టాన్ని తాము అభివృద్ధి రీత్యా, సంక్షేమం రీత్యా అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, ఎన్నికల సమయంలో బాండ్ పేపర్లపై ఇంటింటికీ తిరిగి పంచిన గ్యారెంటీ హామీలు అన్నింటికి అన్నింటినీ అమలుచేసి వేశామని చెప్పుకొంటూ, పంచాయతీ ఎన్నికలపై గురిపెట్టి జరుపుకొన్న సర్వే అది. దానిలో వచ్చిన ఫలితమేమిటో పైన చూశాం. కేసీఆర్, రేవంత్ సంవాద పరంపరలు ఉండగా, ఇప్పుడు సామాన్య ప్రజలు అనే మరొక మూడవ పక్షపు తీర్పు ఈ తీరుగా ఉన్నది. వీటిపై ఇద్దరు నాయకుల సంవాదాన్ని జనవరి 31వ తేదీన చూశాము కానీ, అది గమనించి మూడవ పక్షంలో ఎవరూ కొత్తగా ఆశ్చర్యపోయి ఉండరు. ఇద్దరూ ఎవరి స్వభావానికి తగినట్లు వారు మాట్లాడారు గనుక.
కేసీఆర్, రేవంత్ సంవాద పరంపరలు ఉండగా, ఇప్పుడు సామాన్య ప్రజలు అనే మరొక మూడవ పక్షపు తీర్పు ఈ తీరుగా ఉన్నది. వీటిపై ఇద్దరు నాయకుల సంవాదాన్ని జనవరి 31వ తేదీన చూశాము కానీ, అది గమనించి మూడవ పక్షంలో ఎవరూ కొత్తగా ఆశ్చర్యపోయి ఉండరు. ఇద్దరూ ఎవరి స్వభావానికి తగినట్లు వారు మాట్లాడారు గనుక.