అక్షరాల్లో ఎక్కడైనా
ఆవేశం కట్టలు తెంచుకున్నప్పుడు..
చూసి అనుభూతించడమే!
నిజంగానే ఎక్కడైనా
కనులు రక్తాశ్రువులను స్రవిస్తాయా?
***
నిశ్చల.. నిర్మల.. నిమేషాలయిన
నీ నయనాల కొలుకుల నుంచి
వీనుల వేపుగా సాగి ఆగింది…
ఆ రక్తాశ్రువు!
నీ వదనం కదలకుండా
చుబుకం పట్టుకుని..
చూపుడువేలితో తుడిచేశాను..
గులాబీ మేనితలం మీద ఎర్రటి మరకని!
దహించిన దుఃఖాల్ని
వెచ్చగా స్రవించడం..
ఎరిగిన కనులు కదా అవి!
పొంగిన ఆనందాల్ని
దాచుకోక వర్షించడం..
అలవాటైన కనులే కదా!
ఇపుడీ రక్తాశ్రువు.. ఏ సందేశాన్ని
సంకేతంగా ఇవ్వబోతున్నదో కదా?
దుఃఖానందాలను అనుభూతించని
పారమార్థిక స్థితికి చేరావు నువ్వు!
నీ కార్నియాలను కత్తిరించారు..
చల్లటి రక్తధారలు స్రవించగా..!
ఈ నిశీధి జగతిలో..
ఏవో రెండు చీకటి గుయ్యారాల్లో
చిరు దీపాలుగా మారి వెలుగుతాయి అవి!
నీ కంటి ధార అది..
నువు చూపే దారి అది..
మరక తుడిచినా మాయని ముద్ర అది!
ఆలోచన లేని లోచనాలకు..
రెక్కమాను మీద వెలిగే..
ఎర్రటి దిశా నిర్దేశం!
ఆ రక్తాశ్రువు!!