దవ దవ చలి వెంటాడుతంది
ఇగం ఎక్కిన దేహమంతా విల విల
జమిలిగా రగ్గులు కప్పుకున్నా గజ గజ
మెలకువలోనే, అయినా లెవ్వాలనిపించదు
లోలోపల వణుకు ప్రకంపనలు
ఏదీ తెల్లారిందా! వెలుతురు చూద్దామని
కిటికీ తెర జర పక్కకు జరిపితే
అద్దమంతా మంచు పరచుకొన్న పదన
అవతలి వైపంతా మసక మసక కాంతి
కరెంటు పోలు పక్కన కుక్క నక్కింది
డాబా మెట్ల మీద పిల్లి కూన ముడుచుకుంది
గోడ మీద తోక తెగిన బల్లి తిరుగుతుంది
చల్ల గాలికి ఆ చూపులన్నీ బెదురు బెదురు
బయట అంతా కరకర ఈదర గాలి
చేసుకుంటేనే చెయ్యి నోట్లోకి వచ్చే స్థితిగతులు
ఎవరి దినచర్యల్లో వారు సంలీనం
ఇండ్లల్ల పనులు చేసే అతివలు
తలమాలలు కట్టి సర్రన ఉరుకుతనే ఉన్నరు
పాల పాకెట్లాయన నెత్తికి రుమాలు సుట్టుకొని
సైకిల్ మీద ఇల్లిల్లూ తిరుగుతనే ఉన్నడు
పేపరు పిల్లగాడు వణుక్కుంట వణుక్కుంట
ఇంటింటికీ వార్తలు ఇసిరికొడుతండు
పుర సేవికలకైతే చలీ వానా లేనే లేదు
పట్టణ పరిశుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్లు
గడియారం ముల్లుకు కట్టుకున్న జీవితాలు
గడియ రికాం కావాలన్నా దొరకని సమయం
ఎండా వానా చలి ఏ విపత్తు అయినా ఒక్కతీరే
పొద్దు పొడిచి బారెడు ఎక్కిన శక తగిలింది
చలి పులి మెల్లమెల్లగా తోక ముడుస్తుంది.
అన్నవరం
దేవేందర్
94407 63479