భారత ప్రజలు రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తారు. పార్లమెంటును ప్రజా సమస్యలు పరిష్కరించే గొప్ప దేవాలయంగా గౌరవిస్తారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చోటులేని విధంగా వ్యవహరిస్తున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంటులో రాజ్యాంగ ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. ప్రజాభిప్రాయాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాకంటక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుంటున్నది. పెద్ద నోట్ల రద్దు మొదలు జీఎస్టీ, వ్యవసాయ, విద్యుత్ సవరణ, పౌరసత్వ సవరణ, ప్రాజెక్టు సంరక్షణ సవరణ చట్టాల వంటి అనేక నియంతృత్వ నిర్ణయాలకు మోదీ నాయకత్వంలోని బీజే పీ పాలన కారణమవుతున్నది.
పార్లమెంటు సమావేశాల నిర్వహణ, బిల్లులు ప్రవేశపెట్టే తీరు, పార్టీల ఆమోదం, బిల్లులపై చర్చలో ప్రతిపక్షాల భాగస్వామ్యం లేకుండానే ఇష్టానుసారంగా మోదీ చేసుకుపోతున్నారు. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై చర్యలు తీసుకోవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. పార్లమెంటులో బలమున్నదనే అహంతో చీకటి చట్టాలు చేస్తున్నది.
పెద్దనోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటివి దేశంలో అనేక ఆందోళనలకు కారణమయ్యాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు ఈ బిల్లులను తీసుకువచ్చిన బీజేపీ, వాటి ద్వారా ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందింది. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన కమలంపార్టీ పాలనలో కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నది.
ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలు వికృత రూపం దాల్చాయి. ఏ సభ్యుడైనా సభాహక్కులను ఉల్లంఘిస్తే, నియమ నిబంధనలను పాటించకుంటే చర్యలు తీసుకోవడం ఆనవాయితీ. వ్యవసాయ చట్టాలపై చర్చ జరగాలన్నందుకు 12 మంది విపక్ష సభ్యులను సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేయటం హక్కులకు తిలోదకాలివ్వటమే. ఎందుకు తమపై సస్పెండ్ వేటు పడిందో కూడా ఆయా ఎంపీలు తెలుసుకోలేపోయారు! ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పార్లమెంటులో కూడా రాజకీయాలు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది.
అలాగే రాష్ర్టాల పరిధిలో ఉన్న జల వనరులు, ప్రాజెక్టులపై గుత్తాధిపత్యం చెలాయించేందుకు ప్రాజెక్టుల సంరక్షణ బిల్లును తీసుకొచ్చింది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే.. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నది. నడిచే కాళ్లలో కట్టె పెట్టే ప్రయత్నం చేస్తున్నది. ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే అయినా అబద్ధాలు చెప్తూ రాజకీయాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వపు కుత్సిత బుద్ధి రాష్ట్ర రైతాంగానికి తెలుసు. సమాఖ్యస్ఫూర్తికి విఘాతం కలిగేలా కేంద్రం ఇలాగే చర్యలు కొనసాగిస్తే.. రాష్ర్టాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతాయని కేంద్రంలోని పాలకులు గ్రహించాలి.
–బండారి జితేందర్,
93935 41667