
తమ్మీ తయారైనవా?, అవ్ అన్నా. మనోళ్లు సుత రెడీగున్నరు. పదీ పదకొండుకల్లా చేరుకుంటం. ఆగాగు, జెర్రాపు. బండ్లె పిట్రోల్ సాల్తదో, సాలదో, నడిమిట్ల ఆగిపోతే పరేషాన్. యాల్లకు అందాలె కదా?.. ఆ ఇగ పోనీ. పిట్రోల్ పిరమైన సంది బండే తీస్తలేను. గింతగానమా పెంచుడు. పోగాలం గాకపోతే ఏందిది?.
కలిగినోళ్ల సంగతి ఎట్లనన్న ఉండనీ. మనసోంటోళ్ల గతేం గావాలె. గవ్విటి రేట్లకు పగ్గాలే లేకుంట జేసుడుతోని అరొక్కటి పిరమాయే. బతుకులను ఆగం జేయవట్టె. ఓర్నీ అన్నింటినీ పెంచుకుంట పోతున్నరు. మరి మన వడ్ల ధరలు దేవుడెరుగు, తమాం కొనుమంటే కొనరట. ఇదెక్కడి రీతి. గందుకే అన్నా.. మన కేసీఆర్ సార్ మోదీ సర్కార్ మీదికి కోపానికొచ్చిన్రు. రాష్ట్రంల ఉన్న బీజేపీ లీడర్లకు తొడపాశం పెట్టిన్రు. వరుసగ రెండొద్దులు వాళ్ల శాతగానితనాన్ని పూసగుచ్చినట్టు తెలిపిన్రు. మోడీ సర్కార్ వల్ల రైతులైన మనమెట్ల మోసపోతున్నమో కండ్లకు కట్టిన్రు. తెలంగాణ కేసీఆర్ సార్ ఏడేండ్ల సంది ఒక్కొక్కటి సగపెట్టుకుంట అస్తున్నరు. రైతులకే సూడరాదు ఎన్నిస్తున్నరో..? యాడికాడ నీళ్ల సౌలత్ అంగాం జేశిన్రు. కరువును పత్తా లేకుంట సాగదోలిన్రు. కరెంటు లోటు లేకుంట జేశిన్రు. ఇత్తనాలు అందనేవట్టె. రైతుబంధు ఇస్తనే ఉండె. నశీబ్ బాగలేక ఎవలన్న జీవిడిస్తే.. ఇంటోళ్లకు రైతు బీమా ఇప్పిస్తున్నరు. మనమంత గలిశి యవుసంల మంచిచెడులు మాట్లాడుకునేతందుకు రైతు వేదికలు కట్టిచ్చిన్రు. గిట్ల శెప్పుకుంటవోతే శాంతాడంతయితది. మన రైతులకు ఆవగింజంత నష్టం కలిగినా కేసీఆర్ సారు సహించరు. మనం మంచిగుండాలె, మన తెలంగాణ సుఖంగ బతుకాలె అని తండ్లాడుతరు.
ఇన్నొద్దులు పువ్వు పార్టీ లోకల్ లీడర్లు అచ్చివి, పిచ్చివి ఏం ఒర్లినా, ఎంత నరికినా మన కేసీఆర్ సారు పెద్ద మనసు జేసుకొని ఓపిక పట్టిన్రు. కానీ మనల్ని మోసం జేయబోతే ఊకుంటరా? అందుకే మోదీ సర్కారును, ఆ పార్టీ లోకల్ లీడర్ల భరతం పడుతున్నరు. నా రైతులు, నా ప్రజల కోసం బొచ్చెడు సహకారం ఇస్తే, వడ్లు కొనకుండ గిదేం పద్ధతి? అని ఢిల్లీ సర్కారును నిలవెట్టిన్రు. యాల్లకు వడ్ల విషయంల గోసవెట్టుడు జూసి కన్నెర్ర చేసిన్రు. మన సారు పిలుపు ఇస్తే రాష్ట్రం మొత్తం ల ఉన్న మన రైతాంగం ధర్నాలకు కదిలింది. గిక్కడితోనైనా కేంద్రం కండ్లు తెరువాలె. లేకుంటే, గీడికే అయిపోతదా ఏంది?. ఢిల్లీ నడిమిట్ల కూసుండుడు, మోదీ సర్కారును తొవ్వకు దెచ్చుడు మన సీఎం కేసీఆర్ సారుకు ఎంతసేపు. పంజాబోళ్లు తీపి ఎట్ల అయిండ్రు. మనం శేదు ఎట్లయినం. వాళ్లయి కొంటరెట్ల?, మనై కొనరెట్ల?. దేశాన్ని సాదుతున్నదాంట్ల మనమే ముంగట ఉన్నం. గసొంటిది గిట్ల తడిబట్టతోని రైతుల బొండిగకు ఉరి వెడుతమంటే ఈడ ఉన్నది కేసీఆర్ సర్కార్. గవ్వేం నడువై. ముందు ముందు ఏదన్న జెప్పి, గిట్ల జేసుకుం దాం, గీ గీ పంటలు ఎయ్యుండ్రి అని చెప్పాలె గనీ, గిట్ల అస్సలు టైంకు కొనేదే లేదంటే వాజీవేనా..? వడ్లు కొంటమని ఒక్క మాట రాతపూర్వకంగా తెలిపితే సాలని మన సీఎం సార్ సూటిగ కోరిన్రు. ఇంకా తటపటాయించుడు, మొండికేసుడు మోదీ సర్కారుకు మంచిది కాదు.
అగో తమ్మీ ధర్న కాడికి రానే వస్తిమి. అవ్ అన్నా. సూస్తున్నంత సేపట్ల శేరినం. మరి ఏమనుకున్నవ్. ఇది మన కేసీఆర్ సర్కార్ ఏపించిన సడక్ మహిమ. ఇగో నియ్యత్ ఎంతనో బర్కత్ అంత. తిన్న రేవును తలువా లె. నువద్దె జెప్పినవ్ అన్నా. మస్తుమంది జమైండ్రు. మన రామన్న సుత వచ్చిన్రు. దెబ్బకు మోదీ సర్కార్ దిగివచ్చెటట్టు జోరుగ బొబ్బ పెడుదాం. కేంద్రం వడ్లు కొనాలె. వివక్ష వీడాలె.
(వ్యాసకర్త: దుర్గాప్రసాద్ ఇల్లెందుల, ఫ్రీలాన్స్ జర్నలిస్టు)