అమరావతి : ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ఆరోపించారు. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు ఇప్పటికి రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెంచినా కూడా దీనిపై స్పందించలేదని విమర్శించారు.
రాయలసీమ లిఫ్టును ఆపేసి రాయలసీమకు, ఆల్మట్టి ఎత్తుపై పోరాడకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడని మండిపడ్డారు. పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. శ్రీశైలానికి వరద తగ్గడం, ఎగువన ప్రాజెక్టుల వల్ల రాయలసీమ, నెల్లూరులకు నీటి సంక్షోభం ఏర్పడుతోందని పేర్కొన్నారు. సమస్యను అధిగమించాలంటే గత ప్రభుత్వంలో రూ. 900 కోట్లతో పంపింగ్ మినహా సివిల్ పనులు దాదాపు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ ను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోసమే ఈ పనులను నిలిపివేసి రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ అన్యాయంపై అసెంబ్లీ స్థాయి కమిటీలతో పౌర సమాజాన్ని కలుపుకుని పోరాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని తెలిపారు. కేంద్రంలో భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రానికి అవసరమైన వాటిపై కనీసం ప్రశ్నించడం లేదని విమర్శించారు.