– చుంచుపల్లి తాసీల్దార్ నాగరాజు
చుంచుపల్లి, జూలై 13 : వలస గ్రామాల ప్రజలు, ముఖ్యంగా కొత్తగూడెం ఏరియా జీకే ఓసి విస్తరణలో భాగంగా నైన్ ఇంక్లైన్ కాలనీ వాసులను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఎస్ ఐ ఆర్ లో భాగంగా సింగరేణి 9వ ఇంక్లైన్ పరిధి నుండి గతంలో పునరావాసం పొందిన ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చుంచుపల్లి తాసీల్దార్ నాగరాజు స్పష్టం చేశారు. సోమవారం రుద్రంపూర్ పంచాయతీలో బీఎల్ఓల పనితీరును పరిశీలించారు ఎస్ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా గతంలో 9వ ఇంక్లైన్ నివసించి వలస వెళ్లిన కొంతమంది ఓటర్ల పేర్లు పాత జాబితాల్లో కనిపించకపోవడంతో నెలకొన్న సందిగ్ధతపై సోమవారం రుద్రంపూర్ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి, బీఎల్వోల సమక్షంలో తాసీల్దార్ నాగరాజు ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు.
సింగరేణి జీకే ఓసీపీ విస్తరణలో భాగంగా 2002కు ముందే 9వ ఇంక్లైన్ ప్రాంతంలోని గ్రామ ప్రజలను ఇతర ప్రాంతాలకు పునరావాసం కల్పించారు. అనంతరం వారు కొత్త ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదై 2026 ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పాత పోలింగ్ కేంద్రాల జాబితాల్లో వారి పేర్లు లేకపోవడంతో కొందరు ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా తాసీల్దార్ మాట్లాడుతూ.. పాత ఓటరు జాబితాలో పేరు కనిపించని వారు తమ తల్లిదండ్రులు లేదా బంధువుల ఓటరు వివరాలు అందుబాటులో ఉంటే ఎన్యూమరేషన్ ఫారంలోని రెండో కాలమ్లో ఆ వివరాలు నమోదు చేసి, కింది కాలమ్లో ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతంలోని ఓటరు వివరాలను నమోదు చేసి సమర్పించాలని సూచించారు.
ఒకవేళ తల్లిదండ్రులు మరణించి ఉండి, వారి ఓటరు వివరాలు అందుబాటులో లేకపోతే, ప్రస్తుతం ఉన్న ఓటరు వివరాలను మూడో కాలమ్లో నమోదు చేసి ఫారాన్ని సమర్పిస్తే పరిశీలించి అవసరమైన నోటీసులు జారీ చేసి అర్హులైన వారికి తిరిగి ఓటు హక్కు కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీఎల్ఓలు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా పూర్తి చేసి తిరిగి ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం అవసరమైన ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులైన వారి ఓటు నమోదు ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు. వలస గ్రామాల ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా, నిర్ణీత గడువులోపు ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించి ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ నరేందర్ సర్పంచ్ కేస్లీ, ఉప సర్పంచ్ తోటరాజు పాల్గొన్నారు.