హనుమకొండ చౌరస్తా : మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న, అమరులైన, జైళ్లకు వెళ్లిన వక్తులను ( Telangana Activists ) శాస్త్రీయంగా గుర్తించి వారి కుటుంబాలను ఆరు నెలల్లో ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్( Ravi Kumar ) తెలిపారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు.
ఆదివారం హనుమకొండ కాకతీయకాలనీ లోని ఉద్యమకారుల ఐక్య వేదిక కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా పాలకూర్తి మండల కేంద్రానికి చెందిన 1969 తెలంగాణ ఉద్యమకారుడు రాపాక కొండయ్య అకాల మృతి పట్ల అతని ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వ్యక్తుల జాబితాను పారదర్శకంగా చేపట్టడంతో పాటు వారి కుటుంబాల స్థితిగతులను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుందని వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాల సంక్షేమం కోసం రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యకారులు ఐక్య వేదిక ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తీసువస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 17న వరంగల్ వేదికగా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమకారుల ఓదార్పుయాత్రలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని బ్రహ్మరథం పడుతున్నారన్నారు.
రాష్ట్ర సంక్షేమం కోసం కేటాయించే నిధుల్లో స్వరాష్ట్రం సాధన కోసం అసువులు బాసిన కుటుంబాలకు ఒకశాతం నిధులు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తొలి దశ ఉద్యమకారుల కన్వీనర్ టీఎన్. స్వామి, ఓదార్పుయాత్ర రాష్ట్ర ఇన్చార్జి వొడపెల్లి శ్యాం కృష్ణ. కొండేటి నారాయణరెడ్డి, ఏ. తిరుపతిరెడ్డి, తౌటం సమ్మయ్య, వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర ప్రచార కమిటీ సభ్యులు చాంద్ పాషా , చెన్నూరి నటరాజ్, ఇమ్మడిశెట్టి రాజు, మేకల కృష్ణ, మాధవిలత, మీడియా ఇన్చార్జి రాంపెల్లి శ్రీనివాసచారి, రాంకుమార్, రాజు, రవీందర్, కృష్ణమూర్తి, సూరి, సాగర్, దేవేందర్‌రెడ్డి, స్వర్ణలత, పద్మ, అంజాద్, కిరణ్, చుంచు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.