‘నన్నే అమ్ముడుపోయావ్ అంటావా’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారనేది బీజేపీ నేతలకు జుట్టు పీక్కున్నా అర్థం కాలేదు. ‘కనీసం రేవంత్‌రెడ్డి పేరైనా ఎత్తలేదు….మరి ఆయన కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థం కావడం లేద’ంటూ ఈటల రాజేందర్ సైతం వాపోయారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే…భుజాలు తడుముకున్నట్టుంది ఆయన వైఖరని బండి సంజయ్, డీకే అరుణ కూడా విమర్శించారు. అయితే లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా, రేవంత్ భాగ్యలక్ష్మి ఎపిసోడ్‌ను కాంగ్రెస్ నాయకులు మాత్రం చాలా లైట్ తీసుకున్నారు. ‘కన్నీళ్లు ఎవరికీ ఊరికేరావు’ అంటూ గాంధీభవన్ వర్గాలు అసలు సంగతి ఇదంటూ బయటపెట్టారు. రేవంత్‌రెడ్డికి పోటీగా భట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. అది మంచిర్యాల చేరుకున్న సందర్భంగా తాము అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని, దానికి భట్టి విక్రమార్క తగిన అర్హుడని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త నినాదం తెరపైకి తెచ్చారు. ఇది రేవంత్‌రెడ్డికి, ఆయన వర్గానికి మింగుడుపడని అంశం. దీన్ని మీడియా పెద్దగా హైలెట్ చేయకుండా డైవర్ట్ చేసేందుకే తనకు సంబంధం లేకపోయినా సుమోటోగా ‘రేవంత్ కంట కన్నీరు’ ఎపిసోడ్‌ను రక్తి కట్టించడం వెనుకున్న లోగుట్టని గాంధీభవన్ వర్గాలు రట్టు చేశాయి.
ప్రధాని మోదీ వందే భారత్ రైళ్లకే కాదు…ఇటీవల ‘వందే మకాన్’ కు కూడా శ్రీకారం చుట్టారు. ఏంటీ ప్రధాన మంత్రి గృహ ప్రవేశాలకు కూడా రిబ్బన్ కట్ చేస్తున్నారా? అని ఆశ్చర్యపోతున్నారా?. అవును నిజమే. ఆయన దేన్ని వదలిపెట్టడం లేదు. చివరకు బీజేపీ అభ్యర్థి గృహ ప్రవేశ కార్యక్రమాన్ని కూడా ప్రధాని మోదీ వర్చువల్‌గా తిలకించి శుభాకాంక్షలు తెలిపిన ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకున్నది. తెలంగాణకు సరిహద్దు రాయిచూర్ జిల్లా మాన్వి నియోజకవర్గ అభ్యర్థిగా బీవీ నాయక్‌ను బీజేపీ బరిలోకి దింపింది. అయితే స్థానికేతరుడని నాయక్ అభ్యర్థిత్వాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆయన అప్పటికప్పుడు మాన్విలో ఓ ఇల్లు కొనుగోలు చేసి గురువారం గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా భారీ స్క్రీన్ ఏర్పాటు చేయగా ప్రధాని మోదీ వర్చువల్‌గా లైన్లోకి వచ్చి బీవీ నాయక్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. కొసమెరుపు ఏమిటంటే, బీవీ నాయక్‌ను ఎంపీగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఆయన తండ్రిని నాలుగుసార్లు ఎంపీ, ఎమ్మెల్యేను చేసిన కాంగ్రెస్‌కు ద్రోహం చేసి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారని మాజీ సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా మండిపడ్డారు.
వైఎస్ఆర్టీపీ మహా సంబురంగా ఉన్నది. అది తమ పార్టీ అధినేత్రి షర్మిల జైలు నుంచి బయటకు వచ్చినందుకు కాదు. ఇంతకాలానికి షర్మిలకు తెలంగాణ బిడ్డ అని సర్టిఫికెట్ లభించినందుకంట. ఇందిరాపార్క్ వద్ద షర్మిల నిరసన దీక్షకు గద్దర్ హాజరై, తెలుగుతల్లి, తెలంగాణ బిడ్డని సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ వెళ్లడానికి వీసా కావాలా? అని ఒకప్పుడు ప్రశ్నించిన షర్మిలకు, గద్దర్ ఇచ్చిన సర్టిఫికెట్తో వీసా వచ్చినట్టే అన్నది వారి సంబురానికి కారణమంట. ఇందులో ఇంకో డబుల్ ధమాకా కూడా ఉందని వారంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరుఫున పోటీకి సిద్ధపడి విరమించుకున్న గద్దర్, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు. హమ్మయ్య ఇంతకాలానికి వైఎస్ఆర్టీపీకి ఒక అభ్యర్థి దొరికాడన్న మాట.
– వెల్జాల