మన దేశంలో తయారైన సరుకులు అమెరికాకు ఎగుమతి చేయాలంటే 25 శాతం సుంకం కట్టక తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫర్మానా జారీచేశారు. ఓ వైపు వాణిజ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ ఇలా పాతిక శాతం టారిఫ్ ప్రకటించడం, దీనికి అదనంగా జరిమానా విధిస్తామని చెప్పడం భారత్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. రష్యా తో సన్నిహిత సంబంధాలు, రక్షణ, ఇంధన లావాదేవీలు కొనసాగిస్తున్నందుకు భారత్‌కు ట్రంప్ వేసిన శిక్ష ఇది. నిజానికి ట్రంప్ భారత్‌పై విరుచుకుపడటం ఇదే మొదటిసారి కాదు.
తొలి విడత పదవీకాలంలోనే ఆయన కరోనా సమయంలో మందుల సరఫరా విషయమై భారత్ మెడలు వంచేందుకు ప్రయత్నించారు. ఇక రెండో విడత పదవి చేపట్టిన తర్వాత వీసాలు, ఉద్యోగాల విషయంలో భారత్‌పై కత్తులు నూరుతూనే ఉన్నారు. మొన్నటికి మొన్న బ్రిక్స్‌లో డాలర్‌కు ప్రత్యామ్నాయం గురించిన ప్రస్తావన రాగానే భారత్ సహా కూటమిలోని దేశాలన్నిటిపై వంద శాతం టారిఫ్ వేస్తానని బెదిరించారు. ట్రంప్ ముందుగా చెప్పినట్టుగానే ఇప్పుడు టారిఫ్ వేశారు.
‘అబ్ కీ బార్ ట్రంప్‌కి సర్కార్’ అని గతంలో ప్రచారం చేసిన మోదీ.. ట్రంప్‌కు కళ్లెం వేయడంలో విఫలమవుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి పర్యవసానంగా పాక్‌పై భారత్ జరిపిన సైనికదాడిని ‘నేనే ఆపించాను’ అని ట్రంప్ పదే పదే చెప్పుకొన్నారు. దీంతో విధానపరంగా మోదీ ప్రభుత్వం ఆత్మసమర్థనలో పడింది. పాక్‌తో తృతీయపక్షం మధ్యవర్తిత్వం అంగీకరించరాదన్నది భారత్ సుస్థిర విధానం. ఇప్పుడు అదికాస్తా నీరుగారిపోయింది. ఇప్పుడు టారిఫ్ యుద్ధం ప్రకటించినా భారత ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నది తప్ప, దీటైన జవాబివ్వడం లేదు. కనీసం బ్రెజిల్ ప్రభుత్వం అమెరికాను ఎదిరిస్తు న్న స్థాయిలో కూడా మోదీ సర్కారు వ్యతిరేకించకపోవడం ప్రధాని అశక్తతను బయటపెడుతున్నది.
ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త సుంకాలకు సంబంధించి రం గాలవారీగా రేట్ల గురించిన సవివర సమాచారం ఇంకా అందుబాటు లో రానప్పటికీ, మన దేశంలోని వస్త్ర, ఔషధ, ఆభరణాలు, ఆటోమోబైల్ విడిభాగాలు, ఫార్మా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయని అం చనా వేస్తున్నారు. వీటి మీద ఆధారపడిన కోట్ల మంది ఉద్యోగుల కుటుంబాలూ ప్రభావితమవుతాయని చెప్పవచ్చు. ఈ దెబ్బతో దక్షిణాసియా దేశాల్లో భారత్‌కు అమెరికా ప్రాధాన్య హోదా కల్పిస్తుందన్న ఆశలూ ఇగిరిపోయాయి.
మరోవైపు ఈ ప్రకటనను వెన్నంటే పాకిస్థాన్‌తో చమురు క్షేత్రాల అభివృద్ధిపై ఒప్పందానికి వచ్చినట్టు అమెరికా అధ్యక్షుడు వెల్లడించడం గమనార్హం. ఏకైక అగ్రరాజ్యానికి ఎవరు ‘అత్యంత’ సన్నిహితులో దీనితో తేలిపోయింది. మోదీ సర్కారు భారత విదేశాంగ విధానం దారుణ వైఫల్యాన్ని ఇది ఎత్తిచూపుతున్నది. భారత్ ఇప్పటికిప్పుడు అలీనోద్యమ కాలం నాటి స్వతంత్ర ప్రతిపత్తికి మళ్లడం సాధ్యపడకపోవచ్చు. కానీ, కనీసం బ్రెజిల్ తరహాలో అమెరికాకు దీటైన జవాబు ఇవ్వవచ్చు. అందుకు ఇతర దేశాలను కూడగట్టవచ్చు. ట్రంప్ నిరంకుశ ధోరణిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ నిలువరించలేం. ట్రంప్‌కు అమెరికా ప్రయోజనాలు ముఖ్యమైనప్పుడు మన కేంద్ర సర్కారుకు భారత ప్రయోజనాలే పరమావధి కావాలి కదా!.