దేశవ్యాప్తంగా బీజేపే, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉన్నది. గత రెండున్నరేండ్లుగా వరుస రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం, న్యాయమైన వాటా కోసం ఏనాడూ ప్రధాని నరేంద్రమోదీని నిలదీసి ఉద్యమించలేదు.. అదే దారిలో తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వం కాంగ్రెస్ వాగ్దానాల వైఫల్యాలపై చెప్పుకోదగ్గ కార్యక్రమం ఒక్కటీ చేపట్టలేదు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన మోదీ ఒక అధికారిక సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కలిసి నడుద్దాం రా! అని ఆహ్వానించడం దేశవ్యాప్త సంచలనానికి కారణమైంది.
బీజేపీ, కాంగ్రెస్‌లోని రేవంత్ వర్గం ఒక్కటై పోతారన్న చర్చలు, ఊహగానాలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ ఎంతోకాలంగా ఆరోపిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధం బండి భగీరథ్ ఉదంతంలో మరింత గట్టి పడిందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాహుల్ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది.
ఒకప్పుడు బీజేపీలో నాయకత్వ స్థాయికి ఎదగాలన్నా, ఒక పదవి పొందాలన్నా ప్రవేశ ద్వారం ఒక్కటే, అది ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ నేపథ్యం. శ్యామప్రసాద్ ముఖర్జీ నుంచి వాజపేయి, అద్వానీ తరం వరకు ఆరు దశాబ్దాలుగా అదే పద్ధతి కొనసాగింది. 1990లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు వరుసగా సుందర్‌లాల్ పట్వా, బైరాన్ సింగ్ షెకావత్, శాంతకుమార్ కరడుగట్టిన సంఘ్ పరివార్ నేతలు. కానీ 2014లో బీజేపీలో మోదీ, షా శకం ఆరంభమయ్యాక ఆ పార్టీ తీరు మారిపోయింది. సిద్ధాంతం కంటే అధికారమే పరమావధిగా వికృత రూపం దాల్చింది. ఇతర పార్టీల నుంచి వచ్చిచేరిన వారు అనతి కాలంలోనే కేంద్ర మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పదవులందుకునే వైకుంఠపాళీ నిచ్చెనలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హిమంతబిశ్వశర్మ (అసోం), సువేందు అధికారి (బెంగాల్), సామ్రాట్ చౌదరి (బిహార్), పెమాఖండు (అరుణాచల్‌ప్రదేశ్), బీరేన్‌సింగ్ (మణిపూర్), మాణిక్ షా (త్రిపుర) ఇతర పార్టీల నుంచి ఇలా వచ్చి అలా అందలమెక్కిన వారే. ఇక 12 ఏండ్లుగా మోదీ క్యాబినెట్లో కొలువు తీరిన వారి సంఖ్య ఇంకా పెద్దది. ఎంపీలు, ఎమ్మెల్యేలకైతే లెక్కే లేదు. దశాబ్దాలుగా బీజేపీతో కలిసి నడిచిన నేతలెందరో తెరమరుగయ్యారు. సుదీర్ఘకాలం మిత్రపక్షాలుగా ఉన్న అకాలీదళ్, శివసేన వంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి దూరమయ్యాయి. మౌలికంగా సిద్ధాంతపరంగా భావ సారూప్యం లేని పార్టీలు, గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలు దగ్గరైపోయాయి. ఇప్పుడు బీజేపీ కాషాయం, కాంగ్రెస్ వెర్షన్‌గా మారిపోయింది. అందుకనే రేవంత్‌ను మోదీ సాదరంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి మొదటినుంచి సందేహాస్పదంగానే ఉన్నది. ఆయన కట్టర్ తెలంగాణ ఉద్యమకారుడు కాదు, కట్టర్ కాంగ్రెస్ వాదీ కాదు. రాజకీయ సిద్ధాంతాల పట్ల ఒక సుదీర్ఘనిబద్ధత లేదు. కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పూర్వాశ్రమ సహవాస ప్రభావాలు తొలగిపోలేదు. ఆయన మాటల్లో చేతల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీల పట్ల అపారమైన ప్రేమాభిమానాలు తరచుగా వ్యక్తమవుతూ ఉంటాయి. రేవంత్‌రెడ్డి మరో హిమంతబిశ్వశర్మ, సువేందు అధికారి కావొచ్చని అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్ సున్నితంగా విమర్శించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఒక సందర్భంలో తెర వెనుక కుట్రలు జరుగుతున్నాయని, తోటి మంత్రులతో జాగ్రత్త సుమా అని రేవంత్‌ను మిత్ర సమ్మితంగా హెచ్చరించారు. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలకు తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఆందోళన ఎందుకో అర్థం కాదు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ రాజీనామా చేయాలంటూ సమాజం అంటుంటే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యతిరేకించడం వింతగా ఉన్నది. ఆ మధ్య మోదీతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్నప్పుడు తన పాఠశాల బీజేపీ, కళాశాల టీడీపీ, ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద అని రేవంత్‌రెడ్డి చెప్పుకొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఏర్పాటైన ఒక సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కేసీఆర్ దెబ్బతీశారని ఆక్రోశించారు. అందుకే ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు బద్ధశత్రువులైన పార్టీల పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రదర్శిస్తున్న సానుకూల వైఖరి కట్టర్ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడంలేదు. అలాగని అడుగు ముందుకు వేయలేని నిస్సహాయ స్థితి. కాంగ్రెస్ పార్టీ నడవడానికి భారీ స్థాయిలో ఇంధనాన్ని సమకూరుస్తున్న రేవంత్‌రెడ్డిని రాహుల్ మాత్రం కట్టడి చేయగలరా? లేకపోతే చరిత్రలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా వచ్చే ఐదేండ్లు, పదేండ్లు తమపార్టీ ప్రభుత్వమే వస్తుంది అని అన్నారే తప్ప, తానే ముఖ్యమంత్రిని అని చెప్పుకోలేదు. రేవంత్‌రెడ్డి మాత్రం పార్టీ పేరు ప్రస్తావించకుండా 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పుకొన్నారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమన్న మాట ఆయన నోట నుంచి రాలేదు. ఆ మాటల వెనక దాగి ఉన్న గూఢార్థం బోధపడక కాంగ్రెస్ అధిష్ఠానం కలవర పడుతున్నది. రేవంత్‌రెడ్డిని స్వాగతించిన మోదీ వెనువెంటనే చంద్రబాబుతో ఏకాంతంగా గంటసేపు చర్చించడం, పవన్‌కల్యాణ్‌ను పరామర్శించడం, బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను పక్కన పెట్టి, పొదుపు హితోపదేశాలు చేయడం, పోలీసులు తొలుత బండి భగీరథ్‌పై పోక్సో చట్టంలోని సాధారణ సెక్షన్లను నమోదు చేయటం వంటి వరుస ఘటనలు తెర వెనుక ఏదో రాజకీయం జరుగుతున్నదన్న అనుమానాలకు ఆస్కారం కలిగించాయి. తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం కాకుండా ప్రోటోకాల్ పక్కనపెట్టి అంత సమయం ఇచ్చి చంద్రబాబుతో, పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా హైదరాబాదులోనే ప్రధాని ఎందుకు కలిసినట్టు? మిత్రపక్షాలుగా వారు తరచుగా కలుస్తూనే ఉన్నారు కదా. చంద్రబాబు ఇంట్లో ప్రత్యేకమైన సందర్భం ఏమైనా ఉన్నదా అంటే అదీ లేదు. పవన్ కల్యాణ్ చేయించుకున్న ఆపరేషన్ చాలా చిన్నదని డాక్టర్లే అంటున్నారు. అయినా వారిద్దరి కార్యస్థానం ఆంధ్రప్రదేశ్ కదా, అమరావతి కదా. ఇక్కడే ఎందుకు?
బీజేపీ, టీడీపీ వైపు మోహరించిన మీడియా, సోషల్ మీడియా తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో కూడా రేవంత్‌రెడ్డిపై ఈగ వాలనీయడం లేదు. ఇటు రేవంత్‌రెడ్డి కూడా బీజేపీ, టీడీపీకి సహకరిస్తున్నారు. బండి భగీరథ ఉదంతమే ఒక తార్కాణం. బీఆర్ఎస్ మీద బురద చల్లడానికి తాటికాయంత అక్షరాలతో వార్తలు రాసే పత్రికలు, బ్రేకింగ్ వార్తలు, చర్చలు అంటూ నానా యాగీ చేసే ప్రసార మాధ్యమాలు, నాలుగు రోజులపాటు చూసీ చూడనట్టు వ్యవహరించాయి. మరోవైపు తెలంగాణ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు అందాక గంటలకొద్దీ కాలయాపన చేసి, పోక్సో చట్టంలోని సాధారణ సెక్షన్లను నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. మరో వైపు కరీంనగర్లో భగీరథ్ హనీట్రాప్ ఫిర్యాదు ఆగమేఘాల మీద తీసుకోవడం విశేషం. దీన్నిబట్టి తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మైత్రీ బంధం ఎంత పటిష్టంగా ఉన్నదో ప్రపంచానికి అవగతమైంది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, విభజన హామీలు, నీటి వాటాలు, రాష్ర్టానికి అదనంగా రావాల్సిన ప్రోత్సాహకాల గురించి కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అధికారంలో లేని బీఆర్ఎస్ను టార్గెట్‌గా చేసుకొని అదే పనిగా మాట్లాడడం వెనుక సొంత ఎజెండా దాగి ఉన్నదేమో! గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల వైఫల్యాలు, ప్రజల సమస్యలపై పోరాడవలసిన బీజేపీ కూడా కేంద్రం పెద్దల జోక్యంతో దిశ మార్చుకొని బీఆర్ఎస్ను ప్రధాన శత్రువుగా పరిగణిస్తున్నది.
బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ అంతర్గతంగా ఒక్కటై తలపడుతున్నాయి. అందుకే మోదీ ఆఫర్‌ను రేవంత్ తిరస్కరించలేదు సరి కదా, అది తన గొప్పగా చెప్పుకున్నారు. మోదీ తొలిసారి ప్రధాని అయ్యాక రెండేండ్లకే 60 మంది శాసనసభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి పెమాఖండు, 32 మంది శాసనసభ్యులతో ఫిరాయించి కాషాయం కండువా కప్పుకొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ చేదు అనుభవాన్ని రాహుల్ మరచిపోయుంటారా?
– డాక్టర్ అయాచితం శ్రీధర్
98498 93238