తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అన్న విషయం చాలామందికి తెలియదని ఇటీవలి ఉదంతాలు చెప్తున్నాయి. స్వతహాగానే ఇది రేవంత్‌రెడ్డికి కోపం తెప్పించింది. అదే సమయంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఏడాది దాటినా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రతిక్షణం కేసీఆర్, కేటీఆర్‌ను గుర్తుచేస్తున్నాయి. కేరళలో గత నవంబర్‌లో జరిగిన ‘టీఐఈ కేరళ 2024’కు హాజరైన కేటీఆర్‌ను మంత్రిగా పేర్కొంటూ వేదికపై ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తానిప్పుడు మంత్రిని కాదని కేటీఆర్ చెప్పినా.. తమకు అలాగే గుర్తున్నారని వారు చెప్పడం గమనార్హం. ఈ రెండు ఘటనలను బట్టి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్నది నిపుణుల మాట.
‘స్టిల్ వియ్ బిలీవ్ ఇన్ యూ సర్’.. ఈ మాట నేను అంటున్నది కాదు. ఇటీవల కేరళ లోని కొచ్చిలో టీఐఈ (ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్) అనే అంతర్జాతీయస్థాయి సంస్థ ఏర్పాటుచేసిన ప్రముఖుల సమావేశంలో వ్యాఖ్యాత కేటీఆర్‌ను వేదిక పైకి ఆహ్వానిస్తూ తెలంగాణ ఐటీ పరిశ్రమలశాఖ మంత్రిగా సంబోధించారు. ‘ఇప్పుడు కాదు’ అని కేటీఆర్ సవరించిన సందర్భంలో వ్యాఖ్యాత మరో మాట అన్నారు. ‘ఇంకా మేము మిమ్మల్ని మంత్రి గానే భావిస్తున్నాం. విశ్వసిస్తున్నాం’ అని ఆ మాటలకు అర్థం. పారిశ్రామిక ఐటీ రంగ నిపుణులపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కేటీఆర్ ప్రభావం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఆ వ్యాఖ్యాత మాటలే తార్కాణం.
స్వరాష్టంలో కేసీఆర్ సారథ్యంలో ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ సాధించిన అభివృద్ధిని చూసిన వారు ఎవరైనా నిజాయతీగా ఆ మాట అని తీరాల్సిందే. కేటీఆర్ మంత్రి పదవి పోయి, కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఇంకా కేటీఆర్‌ను మంత్రిగా సంబోధించడం, ముఖ్యమంత్రి పేరును మర్చిపోవడం వంటి సంఘటనలు కాకతాళీయమే అయినప్పటికీ ప్రజలపై వారి ముద్ర ఏ స్థాయిలో ఉందన్నది మాత్రం వెల్లడవుతున్నది.
హైదరాబాద్ పేరు ప్రతిష్ఠలు ప్రపంచం నలుదిశలా వ్యాపించేలా కేటీఆర్ చేపట్టిన కార్యక్రమమే ‘ఫార్ములా ఈ’ రేస్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహానగరాలు పోటీ పడినప్పటికీ ఈ రేసును హైదరాబాద్‌కు రప్పించడంలో కేటీఆర్ వ్యవహార దక్షత ప్రదర్శించి విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం ‘ఫార్ములా ఈ’ రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ఠ పెరిగిందని పేర్కొనడం గమనార్హం. ‘ఫార్ములా ఈ’ రేస్ వివాదం ముదిరి పాకానపడటం రాష్ట్ర భవిష్యత్తుకు క్షేమకరం కాదని మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ‘ఫార్ములా ఈ’ రేస్ పరమార్థం గ్రహించి రేవంత్ ప్రభుత్వం దానిని కొనసాగిస్తే బాగుండేది. పైగా సాధించి తెచ్చిన కేటీఆర్ మీద అభియోగాలు మోపింది. అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నది. కేసీఆర్ మీద కోపం ఉంటే ఎన్నికల్లో, రాజకీయాల్లో తేల్చుకోవాలి. కానీ, ప్రజలకు, ప్రాంతానికి మేలు చేసే పథకాలను, కార్యక్రమాలను, ప్రాజెక్టులను ఏ ప్రభుత్వానివైనా కొనసాగించాలి తప్ప నీరు కార్చడం న్యాయం కాదంటున్న ప్రజల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతున్నది.
వివాదాలు, భయాలు సృష్టిస్తే పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయి అసలుకే మోసం వస్తుందన్న నిపుణుల హితవచనాలు ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదు. ఉద్యమ సమయంలో నాటి సమైక్యవాది లగడపాటి రాజగోపాల్ ఓ సందర్భంలో కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమకారులు సైతం కన్నీరు పెట్టుకునే రోజు వస్తుందని శాపనార్థాలు పెట్టారు. రెండు జర్మన్ దేశాలు కలిసినట్టుగా విడిపోయిన తెలుగు రాష్ర్టాలు తిరిగి కలిసే అవకాశం ఉందని కొందరు అంచనాలు వేశారు. కర్నూలుకు చెందిన అప్పటి ఎంపీ హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ లేదని, తుపాకులు ఇవ్వాలని అడిగాడు. కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. మొత్తంగా తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా, వికల రాష్ట్రంగా చూపించడానికి, హైదరాబాద్‌ను తెలంగాణకు కాకుండా చేయడానికి స్వరాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో వ్యతిరేక శక్తులు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఓటుకు నోటు ఆ కుతంత్రాల్లో భాగమే. ఇప్పుడు ఆ కుట్రలు వివిధ రూపాల్లో మళ్లీ మొలకెత్తుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. కేసీఆర్ పరిపాలన దక్షత, కేటీఆర్ కార్యశీలత వల్ల హైదరాబాదులో స్థిరపడ్డ ఇతర రాష్ర్టాల ప్రజలు, స్థానికులు కేసీఆర్ వైపు వచ్చి చేరారు.
పిల్లకోడిని గద్దలు తన్నుకుపోకుండా తల్లికోడి కాపాడుకున్నట్టు ప్రత్యర్థుల కుట్రలను ఎక్కడికక్కడ తిప్పికొడుతూ కేసీఆర్ హైదరాబాద్‌ను కాపాడుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 సీట్లలో సాధించినవి కేవలం 3 కాగా, 2015 గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా 150 సీట్లకు గాను 99 సాధించింది. హైదరాబాద్ ప్రజలలో వచ్చిన మార్పుకు అది తొలి సంకేతం. గ్రేటర్ చరిత్రలో ఏ పార్టీ ఈ స్థాయిలో ఏకపక్ష విజయం సాధించలేదు. ప్రజలు అందించిన స్ఫూర్తి, సహకారంతో హైదరాబాద్ అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో కేటీఆర్ వందకు వంద మార్కులు కొట్టేశారు.
2009లో తొలిసారిగా అసెంబ్లీ బరిలో దిగినప్పుడు కేటీఆర్ ఉద్యమకారుడే కానీ రాజకీయాలకు కొత్త. పైగా ఆ ఎన్నికల నాటికి సిరిసిల్ల నియోజకవర్గం టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు వడ్డించిన విస్తరి కాదు. అంతకుముందు అక్కడ గెలిచిన చరిత్రా లేదు. అయినా సిరిసిల్ల బరిలో దిగి నాటి నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ సొంత నియోజకవర్గానికి ఒకటికి రెండుసార్లు వెళ్లినా సిరిసిల్ల ప్రజలు అర్థం చేసుకొని అక్కున చేర్చుకొని ఆదరించారు. తెలంగాణ ఉద్యమంలో అందరితోపాటు కేటీఆర్ కేసులు ఎదుర్కొన్నారు.
కేటీఆర్‌కు ఉద్యమ నేపథ్యం ఉంది. ఉన్నత చదువుల జ్ఞానం ఉంది. మంత్రిగా ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఐటీ పారిశ్రామిక రంగాల్లో కేటీఆర్ సాధించిన విజయాలతో ప్రస్తుత ప్రభుత్వ పనితీరును, వైఫల్యాలను పోల్చి చూసుకుంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇక ఆయా రంగాల్లో కేటీఆర్ ప్రసంగాలను ప్రస్తుత ప్రభుత్వ అధినేతల ప్రసంగాలను పక్కపక్కనే ఉంచి సోషల్ మీడియా ఓ ఆటాడుకుంటున్నది. కేటీఆర్ ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి నిలదీసి ప్రశ్నిస్తున్నందుకు సహించలేక ఎటూ పాలు పోక మాంత్రికుల వేషాలు, మాయోపాయాలు, ఆంక్షలు, అభియోగాలకు తెగిస్తున్నారు.
మొన్న ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చిన కేటీఆర్ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిందని మరో కొత్త కేసు పెట్టారు. ఇక ఫార్ములా కేసు వ్యవహారం న్యాయస్థానం దాకా వెళ్లింది. ఏం జరుగుతుందో కాలం నిర్ణయిస్తుంది. కాగా, కేటీఆర్‌ను ఉద్దేశించి ఆ కేరళలో అన్న మాటలు తెలంగాణలో పదేపదే ప్రతిధ్వనిస్తున్నాయి. ‘స్టిల్ వియ్ బిలీవ్ ఇన్ యూ సర్’.
కేటీఆర్‌కు ఉద్యమ నేపథ్యం ఉంది. ఉన్నత చదువుల జ్ఞానం ఉంది. మంత్రిగా ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఐటీ పారిశ్రామిక రంగాల్లో కేటీఆర్ సాధించిన విజయాలతో ప్రస్తుత ప్రభుత్వ పనితీరును, వైఫల్యాలను పోల్చి చూసుకుంటూ ప్రజలు పెదవి విరుస్తున్నారు.