Dengue Fever | వర్షాకాలంలో పారిశుద్ధ్య సమస్య, దోమల బెడద అనేవి ఏటా వేధిస్తూనే ఉంటాయి. ఇవి అంతిమంగా సీజనల్ వ్యాధుల వ్యాప్తికి దారితీస్తాయి. సకాలంలో ప్రభుత్వం నివారణ చర్యలు చేపడితే వీటిని అదుపులో ఉంచవచ్చు. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతల్లో అలాంటివేమీ ఉన్నట్టు కనిపించడం లేదు. రాష్ట్రంలో విజృంభిస్తున్న డెంగీ జ్వరాలే ఇందుకు నిదర్శనం. డెంగీ వ్యాప్తిపై విడుదలైన తాజా గణాంకాలు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. జూలై 1 నుంచి ఆగస్టు 18 మధ్యకాలంలో రాష్ట్రంలో మూడువేలకు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో దేశంలో 32 వేల కేసులు నమోదయ్యాయి. అంటే జాతీయ స్థాయితో పోలిస్తే రాష్ట్రంలో కేసులు పదిశాతం మేర ఉంటాయన్న మాట. అందులో అత్యధిక కేసులు గ్రేటర్ హైదరాబాద్లో నమోదైనవే. డెంగీతో పాటు ఇతర సీజనల్ వ్యాధులూ వ్యాపిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కనీసం ఇంటికొకరు ఈ రోగాల బారిన పడుతున్నారు. ఫలితంగా సర్కారు దవాఖానలు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యపరీక్షల కిట్ల కొరత కారణంగా బాధితులను ప్రైవేటు కేంద్రాలకు పంపిస్తున్నారు.
భారత్లో డెంగీ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనడం గమనార్హం. ముందస్తు హెచ్చరికల జారీ, దోమల నివారణకు చర్యలు చేపట్టడంలో వైఫల్యమే దీనికి కారణమని తెలిపింది. రెండు మాసాల క్రితం సగటు కేసులు తగ్గినట్టు కనిపించినప్పటికీ గత ఐదారు వారాల్లో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. ఇది ప్రభుత్వ నిర్వహణ లోపాలవైపు వేలెత్తి చూపిస్తున్నది. సాధారణంగా వర్షాకాలానికి ముందే ప్రభుత్వం సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడంపై దృష్టిపెట్టాలి. సంబంధిత మంత్రి ఉన్నతాధికారులతో సమీక్షలు జరపాలి. వైద్యాధికారులను అప్రమత్తం చేయాలి. దోమల నివారణకు చేపట్టిన చర్యలపై దృష్టిసారించాలి. మందులను సిద్ధం చేయాలి. కానీ, ప్రభుత్వం చురుగ్గా స్పందించిన దాఖలాలేవీ కనిపించడం లేదు. కేవలం తూతూమంత్రం సమావేశాలతో, మొక్కుబడి చర్యలతో సరిపెట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి.
స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నిరంగాలతో పాటు ప్రజారోగ్య రంగాన్ని పటిష్ఠం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణకు ట్రాక్టర్లను సమకూర్చారు. గ్రామ పంచాయతీలకు, పురపాలికలకూ నెలనెలా క్రమం తప్పకుండా నిధులు అందజేశారు. అన్నిస్థాయుల్లో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు. గ్రామీణ వైద్య వ్యవస్థను మెరుగుపర్చి ప్రజలకు భరోసా కల్పించారు. హైదరాబాద్లో బస్తీ దవాఖానలు నెలకొల్పారు. ఎక్కడికక్కడ వైద్యపరీక్ష సౌకర్యాలూ ఏర్పాటు చేశారు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి అందించిన ఉత్తమస్థాయి వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్ సర్కారు దారుణంగా విఫలమైంది. రాష్ర్టాన్ని ప్రజారోగ్య సంక్షోభంలోకి నెట్టివేసింది. ప్రస్తుత పరిస్థితికి పారిశుద్ధ్య నిర్వహణాలోపం, ప్రజారోగ్య విభాగం సన్నద్ధతాలోపం.. రెండూ కారణమేనని చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పారిశుద్ధ్యం మెరుగుపర్చడం, దోమల నివారణ, దవాఖానల బలోపేతానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా దోమలవ్యాప్తిని అరికట్టడంలో తమవంతు తోడ్పాటు అందించడమూ ముఖ్యమే.