మనుషుల రక్తం రుచిమరిగిన పులి ఎంతకైనా తెగిస్తుంది. మనిషి ప్రాణాలు తీసి రక్తం తాగేందుకు కూడా వెనుకాడదు. ఇప్పుడు తెలంగాణలో నల్లమల్ల పులి కూడా అదే చేస్తున్నది. కమీషన్ల రుచి మరిగి, కాసులకు కక్కుర్తిపడుతున్న నల్లమల్ల పులి తనను ఎన్నుకున్న ప్రజల ప్రాణాలు తీసేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. ప్రజలను మూసీ వరదలో ముంచి, బురదలో కాసులు వెతుక్కుంటున్నది. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఉసురుతీస్తున్నది. సరిగ్గా 117 ఏండ్ల క్రితం, అంటే 1908 సెప్టెంబర్ 27న మూసీ నది ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. వేలాది మంది చనిపోయారు. దీంతో ఈ ఉపద్రవం మళ్లీ రాకుండా అడ్డుకట్ట వేయాలని నాటి హైదరాబాద్ పాలకుడు మహబూబ్ అలీ ఖాన్ భావించి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారు. నాడు వరదలను మళ్లించేందుకు నిర్మించిన ప్రాజెక్టులను నేడు సమర్థంగా వాడుకొని హైదరాబాద్‌ను వరదలో ముంచేయడం రేవంత్‌రెడ్డి పాలనాతీరుకు అద్దం పడుతున్నది.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో జంట జలాశయాలు ఎప్పుడో నిండుకుండలా మారాయి. సాధారణంగా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండకముందే ఇన్‌ఫ్లోకు తగ్గట్టుగా నీళ్లను కిందికి వదులుతారు. కానీ, మూసీ వెంట ఉన్న మందిని వరదలో ముంచి తాను కాసుల్లో మునిగితేలాలన్నది రేవంత్‌రెడ్డి కుటిల పన్నాగం. అందుకే జలాశయాలు నిండినా, ఎగువ నుంచి వరద వస్తున్నా, నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా ఒక్క నీటిబొట్టును కిందికి విడిచిపెట్టలేదు. అదును కోసం వేచిచూసి ఒక్కసారిగా జనంపైకి జలప్రళయాన్ని వదిలారు. ఒక్కసారిగా మీదపడ్డ వరదను చూసి భయకంపితులైన జనం ఎటూపోవాల్నో తెలియక తల్లడిల్లారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరుగులు తీశారు.
రేవంత్ సర్కారుకు జంట జలాశయాల ఇన్‌ఫ్లోపై అవగాహన లేదు. ఇన్‌ఫ్లోకు తగ్గట్టుగా అవుట్‌ఫ్లో ఉండాలన్న సోయి లేదు. కనీసం ముందస్తు హెచ్చరికలు లేకుండా ఒక్కసారిగా జంట జలాశయాల గేట్లన్నీ తెరిచేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర కాక మరేమిటి? వరద ముంచెత్తిన రోజు నగరంలో చినుకు కూడా పడలేదు. అయినా ఇంత వరద ఎక్కడినుంచి వచ్చింది? ఇది మానవ ప్రేరేపిత విపత్తు కాదా? మొన్నటివరకు హైడ్రాను చూపించి భయపెట్టిన రేవంత్ సర్కారు ఇప్పుడు వరదను చూపించి భయపెడుతున్నది.
నాగార్జునసాగర్, శ్రీశైలం లాంటి జలాశయాల్లోకి వచ్చే భారీ వరదకే ఒక లెక్కాపత్రం ఉంటుంది. అలాంటిది చిన్న జలాశయాల విషయంలో రేవంత్ సర్కారు ఎందుకు లెక్క తప్పింది. ఒక్కసారిగా వరద వచ్చిందని అధికారులు చెప్పడం నమ్మశక్యంగా లేదు. సాధారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద, కిందికి వదిలే వరద గురించి లెక్కలు ఉంటాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నప్పుడు వరద వస్తుందని తెలియదా? ఇన్‌ఫ్లోకు తగ్గట్టుగా అవుట్‌ఫ్లోను విడుదల చేయాలని తెలియదా? అయినా వర్షాలు తగ్గాక ఒక్కసారిగా అన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఇది రేవంత్ సర్కారు కుట్ర కాదా? మూసీలో పేదలను ముంచి, వాళ్ల ఆస్తులను అప్పనంగా కొల్లగొట్టి, వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టి కాసులు దండుకోవాలనే కుతంత్రం కాదా? నగరంలో గతంలో ఎన్నోసార్లు భారీ వర్షాలు కురిశాయి. కానీ, ఎన్నడూ ఎంజీబీఎస్‌ను వరద ముంచెత్తలేదు. మరోవైపు అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరుపైనా అనుమానాలు కలుగుతున్నాయి. గేట్లు ఎత్తేముందు కనీస సమాచారం లేదు, హెచ్చరికలు లేవు. వరద ముంచెత్తుతున్నా ప్రజలను ముందుగా ఖాళీ చేయించలేదు. సాయం చేయాల్సిన అధికార యంత్రాంగం జాడలేదు. విపత్తు నిర్వహణ కోసం పుట్టిన హైడ్రా ఫొటోలు, వీడియోలు తీసే పనిలో బిజీ అయిపోయింది. ఈ వీడియోలను వైరల్ చేసి పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలన్నదే రేవంత్ సర్కారు కుట్ర కావచ్చు. ఇదంతా చూస్తుంటే ఒక ప్రణాళిక ప్రకారం, పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను వరద ముంచెత్తినట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి. కళ్లకు కనిపించినదంతా నాదే అన్నట్టు, వరద ముంచెత్తిన ప్రాంతాలన్నీ మూసీనే అని రేవంత్ సర్కారు చెప్తున్నది కాసుల వేట కోసమేనన్నది జగమెరిగిన సత్యం.