హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్‌పై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు సోమవారం హైకోర్టులో వాదించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో స్పీకర్ నిర్ణయాధికారానికి రాజ్యాంగపరమైన, న్యాయపరమైన పరిమితులు ఉన్నాయని స్పష్టం చేశారు. పదో షెడ్యూల్లోని 2(1)(ఏ) ప్రకారం చట్టసభలోని ఏ సభ్యుడైనా తాను ఎన్నికైన రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నాడా? లేదా? అన్న అంశాన్నే ప్రధానంగా పరిశీలించాలని, ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరో పార్టీతో రాజకీయ అనుబంధం ఏర్పరచుకోవడం, ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేయడం, ప్రచారం చేయడం లాంటి చర్యలను కూడా ఇదే కోణంలో పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు. అలా కాకుండా ప్రభుత్వం స్థిరంగా ఉన్నదా?
అసెంబ్లీలో అధికార పార్టీ బలం తగ్గిందా? ప్రభుత్వ మనుగడకు ముప్పు ఏర్పడిందా? అన్నవి అనర్హత వేటుకు ప్రమాణికం కావని పేర్కొన్నారు. ఇదే షెడ్యూల్లోని 2(1)(బీ) సభలో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు గైర్హాజరు కావడం లాంటి చర్యలకు సంబంధించినదని వివరించారు. సభలో జరిగిన చర్యలకే 2(1)(ఏ)ను పరిమితం చేయకూడదని, ఎమ్మెల్యేలు అసెంబ్లీ వెలుపల నిర్వహించిన రాజకీయ కార్యకలాపాల ఆధారంగా వారు ఫిరాయింపులకు పాల్పడ్డారో లేదో స్పీకర్ తేల్చాలని స్పష్టం చేశారు. అలా చేయకుండా అసెంబ్లీలోని అంశాలకే స్పీకర్ పరిమితమై వెలువరించిన తీర్పును చట్టవిరుద్ధమైనదిగా, రాజ్యాంగ విరుద్ధమైనదిగా తీర్పు చెప్పాలని హైకోర్టును కోరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, టీ ప్రకాశ్‌గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఫిరాయించినట్టు కండ్ల ముందే కనపడుతున్నప్పటికీ అవి అసెంబ్లీలో జరిగినవి కావని, వాటికి ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించబోదని స్పీకర్ తీర్పు చెప్పడం దారుణమని పేర్కొన్నారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశం కేవలం ప్రభుత్వాన్ని కాపాడటమే కాదని, ఓ పార్టీ తరఫున ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు మరో పార్టీకి అనుకూలంగా మారే పరిస్థితులను నిరోధించడమే ఈ చట్టం అసలు ఉద్దేశమని వివరించారు. పదో షెడ్యూల్ కింద ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ కేసు విచారణ జరిపి తీర్పు చెప్తారని, స్పీకర్‌కు ఉండే అపరిమిత స్వేచ్ఛాధికారం ట్రిబ్యునల్ చైర్మన్‌కు ఉండదని స్పష్టం చేశారు. ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేయడం, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రచారం చేయడం లాంటి చర్యలను ఫిరాయింపులకు ఆధారాలుగా స్పీకర్ పరిగణించకపోవడం, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడం చెల్లదని తెలిపారు. అనర్హత పిటిషన్లపై విచారణలో సహజ న్యాయసూత్రాలను పాటించకుండా స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాక ఆ పదవిలో కొనసాగుతూనే మరో పార్టీ నుంచి బీ-ఫారం తీసుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం నిస్సందేహంగా పార్టీ ఫిరాయింపేనని, ఇందుకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు మరో రకమైన ఆధారాలను పరిశీలించాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని నిర్ధారించేందుకు ఈ ఆధారాలు సరిపోతాయని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను మం గళవారానికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ప్రకటించింది.