దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 78 ఏండ్లు పూర్తవుతున్నా.. సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి అనే మూడు ముఖ్యమైన విలువలు వాస్తవ జీవితంలో ఎంతవరకు అమలయ్యాయనే ప్రశ్న ఉదయిస్తున్నది. శతాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన దళిత వర్గాల అభివృద్ధి విషయంలో దేశ రాజకీయాలు ఎలాంటి పాత్ర పోషించాయనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ప్రధాన రాజకీయ శక్తులుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్.. దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. వాస్తవంగా వారి పాలనలో దళితుల జీవితాల్లో ఎంతమేరకు మార్పు వచ్చిందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు.
కేంద్రంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, రాష్ర్టాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా ఉన్నా దళిత కుటుంబాల ను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నేరుగా లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హ యాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ఈ దిశగా ఒక ప్రత్యేకమైన ప్రయోగంగా నిలిచింది. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వడం ద్వారా వారిని స్వయం ఉపాధి దిశగా నడిపించాలనేది ఆ పథకం ఉద్దేశం. దేశ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో నేరుగా ఒక కుటుంబానికి ఆర్థిక సహాయం ఇచ్చే కార్యక్రమం అమలు చేయడం అరుదైన విషయమని, గొప్పదైన పథకం ప్రవేశపెట్టారని సామాజికవేత్తలు కొనియాడారు.
కేసీఆర్ హయాంలో అమలు చేసిన దళిత బంధు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు వ్యాపారాలు ప్రారంభించి, తమ జీవితాలను మార్చుకునే అవకాశాన్ని పొందాయి. ఈ కార్యక్రమం అమలు విధానం, దాని ప్రభావం గురించి విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, దళితులకు నేరుగా ఆర్థిక స్వయం సాధన కోసం ఇంత పెద్ద సహాయం అందించడం రాజకీయ చరిత్రలో అరుదైన విజయంగా చెప్పవచ్చు. దీనితో పాటు విద్యారంగంలో కూడా తెలంగాణలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దళిత, ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఇచ్చిన ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ఎంతోమంది జీవితాలను మార్చింది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాల్లో చదువుకునే అవకాశం సాధారణ కుటుంబాలకు సాధ్యం కాని విషయం. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ప్రపంచ స్థాయి విద్యను నేర్చుకునే అవకాశాన్ని యువతకు కల్పించింది కేసీఆర్ సర్కార్. ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది మళ్లీ మన దేశానికి వచ్చి వివిధ రంగాల్లో సేవలందిస్తున్నారు. అందుకే కేసీఆర్ను పలువురు సాహు మహారాజ్తో పోల్చారు.
ఇలాంటి కార్యక్రమాలు అమలైనప్పుడు ఒక సహజమైన ప్రశ్న ముందుకు వస్తుంది. దేశంలో ఇంతకాలం అధికారంలో ఉన్న ఇతర పార్టీల ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు ఎందుకు చేపట్టలేకపోయాయి? కాంగ్రెస్ దాదాపు 60 ఏండ్ల పాటు దేశాన్ని పాలించింది. ఆ కాలంలో దళిత వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం ఇలాంటి ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాలు ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్న చాలామంది నుంచి వ్యక్తమవుతున్నది.
ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ కూడా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. ఈ నినాదం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అభివృద్ధి అందిస్తామని చెప్పుకొంటున్నది. దళిత వర్గాల అభివృద్ధి విషయంలో ఆ నినాదం ఎంతవరకు వాస్తవంగా మారిందనే ప్రశ్నను కూడా సమా జం అడుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇదే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దళిత సంక్షేమంపై తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా గతంలో అమలైన దళిత బంధు పథకం ప్రస్తుతం ఎందుకు కొనసాగడం లేదని చాలామంది దళిత సంఘాల ప్రతినిధులు నిలదీస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, పథకాల లక్ష్యాలు మారకూడదని కోరుకుంటారు. ఒకసారి ప్రారంభమైన సంక్షే మ పథకం ప్రజలకు ప్రయోజనం కలిగిస్తే దానిని కొనసాగించడం ప్రభుత్వ బాధ్యత.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పాత్ర కూడా చర్చకు వస్తున్నది. దళిత సమాజానికి చెందిన నాయకుడిగా ఆయనపై ఆ సమాజం కొన్ని ఆశలు పెట్టుకున్నది. ముఖ్యంగా దళిత సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో ఆయన బలంగా మాట్లాడి ప్రభుత్వాన్ని చర్యలు తీసుకునేలా చేయాలని సామాజికవేత్తలు కోరుకొంటున్నారు. కానీ దళితబంధు వంటి కార్యక్రమాల విషయంలో భట్టి నుంచి బలమైన స్పందన కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సమాజానికి చెందిన నాయకుడు ఆ సమాజ సమస్యలను ముందుకు తెచ్చే బాధ్యత కూడా తీసుకోవాలని ప్రజలు భావిస్తారు.
ఇండస్ట్రీ పాలసీ విషయంలో కూడా దళితులకు ప్రత్యేక అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం. పరిశ్రమలు స్థాపించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం ఉంటుంది. సాధారణంగా వెనుకబడిన వర్గాలకు వివిధ వనరులు అందుబాటులో ఉండవు. అందువల్ల ప్రభుత్వాలు ప్రత్యేకంగా దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధానాలు తీసుకరావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత పారిశ్రామికవేత్తలకు ఎంతమందికి అవకాశాలు కల్పించిందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది.
రాజకీయాల్లో, పరిపాలనలో చాలా ముఖ్యమైన అంశం పారదర్శకత. ప్రభుత్వాలు చేసిన పనులను ప్రజల ముందుపెట్టే ధైర్యం ఉండాలి.
అందుకే చాలా సందర్భాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలు కోరుకుంటారు. ప్రభుత్వం నిజంగా దళిత సంక్షేమం కోసం పనిచేసిందని భావిస్తే, దానికి సంబంధించిన గణాంకాలు, వివరాలు ప్రజలకు తెలియజేయడం ద్వారా విశ్వాసాన్ని పెంచుకోవచ్చు. విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో కూడా వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా అనుమానాలను తొలగించవచ్చు. కానీ కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి పారదర్శక ప్రకటన లేదు. ఇది దేనికి నిదర్శనం? దళిత సంక్షేమం కేవలం రాజకీయ నినాదాలకు మాత్రమే పరిమితం కాకూడదు. అది ఒక సామాజిక బాధ్యతగా భావించాలి. సమాజంలో సమానత్వం సాధించాలంటే విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాల్లో దళిత వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది.
దేశ చరిత్రను పరిశీలిస్తే.. దళితుల అభివృద్ధి దీర్ఘకాలిక ప్రక్రియ అని అర్థమవుతున్నది. కేవలం ఒకే పథకం లేదా ఒకే ప్రభుత్వం ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం కావు. కానీ కొన్ని కార్యక్రమాలు కొత్త మార్గాలను చూపిస్తాయి. ఆ కొత్త మార్గం చూపే కోవకు చెందినదే దళిత బంధు పథకం. ఆ పథకం దళితుల ఆర్థిక స్వావలంబన దిశగా ఒక ప్రయోగంగా నిలిచింది. అలాంటి ప్రయోగాలను మరింత మెరుగుపరచి, పారదర్శకంగా అమలు చేసి సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి.
అంతిమంగా చూస్తే దళిత సంక్షేమం అనే అంశం రాజకీయ లాభనష్టాలకు పరిమితం కాకూడదు. అది భారత రాజ్యాంగం ప్రకటించిన సమానత్వ సూత్రానికి సంబంధించిన విషయం. దళితుల అభివృద్ధి అంటే కేవలం ఒక వర్గం అభివృద్ధి మాత్రమే కాదు, అది దేశ సమగ్ర అభివృద్ధిలో అంతర్భాగం. అందుకే ఈ అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు నిజాయితీగా, బాధ్యతగా తీసుకోవాలి. దేశంలో, రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలపై పారదర్శకంగా చర్చ జరగాలి. అప్పుడే దళిత సంక్షేమం అనే విషయం రాజకీయ ప్రచారానికి కాకుండా సామాజిక న్యాయం సాధించే మార్గంగా మారుతుంది.
రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశం పారదర్శకత. ప్రభుత్వాలు చేసిన పనులను ప్రజల ముందుంచే ధైర్యం ఉండాలి. అందుకే చాలా సందర్భాల్లో వైట్ పేపర్ లేదా శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రజలు కోరుకుంటారు. ఒక ప్రభుత్వం నిజంగా దళిత సంక్షేమం కోసం పనిచేసిందని భావిస్తే, దానికి సంబంధించిన గణాంకాలు, వివరాలు ప్రజలకు తెలియజేయడం ద్వారా విశ్వాసాన్ని పెంచుకోవచ్చు.
(వ్యాసకర్త: సామాజిక రాజకీయ విశ్లేషకుడు)
-మన్నారం నాగరాజు,95508 44433