ప్రస్తుతం మేధావుల తరగతి అంటున్నది ఒకప్పటి రుషులు, గురువుల తరగతి వంటిది. అప్పుడు వారి నుంచి సమాజం, పాలకులు కూడా ఆశించింది తాము సమాజాన్ని అధ్యయనం చేసి, ఆలోచించి, సమాజానికీ, పాలకులకూ మార్గదర్శనం చేయాలని. ఈ కాలంలో పాలకులు ఏమి కోరుకుంటున్నారో తెలియదు గాని, సమాజం మాత్రం అదే ఆశిస్తున్నది. ఆ ప్రకారంగా చేయటమే మేధావితనానికి, వారి ఉనికికి అర్థమవుతుంది. కానీ, అట్లా జరుగుతున్నదా? తెలంగాణలో మేధావులు అనేవారిని గమనిస్తే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం తమ పాత్రను ప్రశంసనీయంగా పోషించారు. అందుకు సమాజం సంతోషించింది. కాంగ్రెస్ అధికారానికి వచ్చిన ఏడాది తర్వాత కనిపిస్తున్నదేమిటి? ప్రభుత్వం ఎంత అప్రతిష్ట పాలైందో వీరు కూడా అంత అప్రతిష్టకు గురవుతున్నారు.
అందుకు కారణం ఏమిటి? ఇది ఒక విధంగా అర్థం కాని స్థితి. ప్రభుత్వమూ, తాము కూడా అప్రతిష్టను తెచ్చుకుంటున్నట్టు ఈ మేధావి తరగతి గ్రహించటం లేదనలేం. అందుకు కారణాలు వారికి తెలియదని కూడా అనుకోలేం. అటువంటప్పుడు ఆస్థితి నుంచి బయటకు రావాలని వారు అనుకుంటున్నారా లేదా అన్నది ప్రధానమైన ప్రశ్న. అందుకు సమాధానం తామే చెప్పగలరు తప్ప మనం కాదు. సమాజానికి కావలసింది ఆ ప్రశ్నకు జవాబు కన్నా ముఖ్యంగా వారు తమ మేధావి పాత్రను గతంలో వలెనే నిజాయితీగా నిర్వర్తించటం.
ఎందువల్లనైతేనేమి వారా పని చేయటం లేదనేందుకు మనకు అనేకం కనిపిస్తున్నాయి. వాటిని గమనించినప్పుడు, వారు ఈ 13 మాసాల కాలంలో తాము చేయవలసిన పని, చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటైనా కనిపించటం లేదు. అందుకు కొన్ని నిర్దిష్టమైన ఉదాహరణలను మాత్రం చూద్దాం. అన్నింటి గురించి చెప్పుకునేందుకు స్థలాభావం వల్ల వీలు కాదు గనుక. ఆ విధంగా మొదట ప్రస్తావిస్తున్నది మహిళలకు ఉచిత బస్సు పథకం.
ఎందుకంటే, 6 గ్యారెంటీలలోని 13 అంశాలలో అన్నింటికన్న ముందు ఇది అమలుకు వచ్చి ఇప్పటికి ప్రభుత్వ పాలనాకాలంతో పాటుగా 13 నెలలైంది. కనుక దీని అమలుతీరు ఏమిటన్నది ఒక విషయం. రెండవది, ఉచిత బస్సు వల్ల మహిళా లోకానికి గృహ బంధనాల నుంచి విముక్తి లభించగలదన్న స్థాయిలో మేధావి ప్రముఖుడొకరు మాట్లాడారు. అంతవరకు బాగానే ఉన్నది. అయితే, తర్వాత కాలంలో స్వయంగా మహిళల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ ప్రముఖుడు గాని, వారి తోటి మేధావులు గాని తెలుసుకునే ప్రయత్నం చేశారా?
అందరి దృష్టికి వస్తున్న దానిని బట్టి కొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. విముక్తి మాటేమో గాని వారిలో అత్యధికులు ఆ పథకం పట్లనే అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మహాలక్ష్మి అనే గ్యారెంటీలో గల మూడు అంశాలలో బస్సు హామీ అమలైనా, రోజువారీ పని పాటలు చేసుకునే తమకు దానితో ఉపయోగం లేదన్నది ఒక విమర్శ. బస్సులు తగ్గించటం, అవి కిక్కిరిసిపోయి ఎక్కలేకపోవటం, ఎక్కినవారి మధ్య పోట్లాటలన్నది రెండవ విమర్శ. బడి పిల్లలు, వృద్ధులు, రోగులకు కాకుండా తగిన వేతనాలు సంపాదిస్తున్న వారికి ఎందుకనేది మూడవ విమర్శ.
వీటన్నిటికి మించి, అదే మహాలక్ష్మిలో భాగమైన ‘మహిళలకు ప్రతీ నెల రూ.2,500’ అన్నది అమలైతే అందరికీ ఉపయోగమని, ఆ పని ఎందుకు చేయటం లేదన్నది ప్రతి ఒక్కరి ప్రశ్న. గత ప్రభుత్వంపై ఆర్థికపరమైన, అప్పుల సంబంధమైన ఆరోపణలు ఎన్నికల ప్రచార సమయంలో స్వయంగా చేసినప్పుడు, ఇటువంటి మహాలక్ష్మి గ్యారెంటీనివ్వటం తమను ఓట్ల కోసం మోసగించటం కాదా అన్నది మౌలికమైన ప్రశ్న.
దీనితో పాటు మహిళలు అదే మహాలక్ష్మిలోని మరొక అంశం, రూ.500కు గ్యాస్ సిలిండర్ గురించి అడుగుతున్నారు.
ఇది అమలవుతున్నది కొద్దిమందికేనని చెప్తున్నారు. అందరికీ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం కూడా అనకపోవటం గమనించదగినది. ఇళ్ల పథకం, వివిధ రైతు హామీల అమలు వైఫల్యాలు, అమలుకాని కల్యాణలక్ష్మి, షాదీముబారక్, నిలిచిపోయిన కేసీఆర్ కిట్, బడి పిల్లలకు పౌష్ఠికాహార పథకం, హాస్టల్ పిల్లలు వరుసగా విషాహారం బారినపడుతుండటం వంటివన్నీ కూడా తల్లులుగా, రైతు కుటుంబాలవారిగా, ఇతర పనులు చేసుకునేవారిగా ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలలో, పట్టణాలలో మహిళలకు
తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి.
వీటన్నింటి ముందు ఉచిత బస్సు అన్నది, అది కూడా పైన పేర్కొన్న లోపాలతో కూడుకొని, వెలవెలబోతున్నది. ఈసడింపులకు గురవుతున్నది. మరి వీటన్నింటి మధ్య, తాము మొదట్లోనే ఎంతో ఘనంగా, అభినవ చలం వలె, సిద్ధాంతీకరించిన ‘మహిళా విముక్తి’ ఏ విధంగా సిద్ధిస్తున్నదో ఈ మేధావి బృందం సమీక్షలు ఏవైనా చేసుకున్నదా? మొదట అంచనాలు వేయటంలో ఆక్షేపించవలసిందేమీ లేదు. కానీ, అంచనాలకు ఆచరణ అనుభవాలు గీటురాళ్లు కావాలి గదా? ఒకప్పుడు మహర్షులు, గురువులకు అటువంటి గీటురాళ్లు ఉండేవంటారు. కనుకనే వారు చెప్పినదానికి విలువ, జనామోదం, చివరికి రాజామోదం కూడా లభించేదంటారు. అటువంటి స్థితిలో, మన ప్రస్తుత తెలంగాణ మేధావులు అటువంటి గీటురాళ్లు ఏవైనా పెట్టుకున్నారా? లేనట్టయితే ఇప్పటికైనా ఆ పని చేస్తారా?
అట్లా చేయదలచుకుంటే మాత్రం తమ ప్రస్తుత గజదంత గోపుర నివాస స్థితి నుంచి తమకు తాము సాహసంతో విముక్తి కల్పించుకొని, గ్రామాలకూ, పట్టణ ప్రాంతాల్లోనే తమ చుట్టూ గల సామాన్యుల మధ్యకూ తరలివెళ్లవలసి ఉంటుంది. అక్కడ తమ మేధావితనాలను, పాక్షికతలను ప్రదర్శించి తాము కోరుకునేవి ప్రజల నోటి నుంచి రాబట్ట చూడటం గాక, వారు చెప్పేవి ఓపెన్ మైండ్‌తో వినవలసి ఉంటుంది. ఇక్కడ పట్టణ ప్రాంతాల సామాన్య ప్రజలు అనే ప్రస్తావన కూడా వచ్చింది.
వారి నుంచి కూడా ఆరు గ్యారెంటీల అమలుపై అనేక ఫిర్యాదులుండగా, ఇటీవల వారి నివాసాలపై హైడ్రా దాడి ఒక పెద్ద బెడదగా మారింది. ఆ దాడి వల్ల ఏమేమి జరిగిందో రాష్ట్ర ప్రజలంతా చూసి కదిలిపోయారు. ఏ కదలికా లేనిది ప్రభుత్వ పెద్దలలో, ఈ మేధావి బృందంలోనే. యథాతథంగానే ఆ చర్యలు అమానవీయమైనవి, అప్రజాస్వామికమైనవి, కోర్టుల నుంచి విమర్శలను ఎదుర్కొన్నవి కాగా, మానవ హక్కుల గురించి ఎడతెగని ప్రసంగాలు చేసే ఈ మేధావులకు మాత్రం అందులో ఎటువంటి మానవ హక్కుల ఉల్లంఘన కనిపించలేదు.
అందుకు కారణం వారు భద్రలోక్ జనం కావడం కావచ్చు. తాము సుఖంగా బతికిన, బతుకుతున్న వారు. అందువల్ల వారికి ఇందిరా పార్కు వద్ద ధర్నా అవకాశం అన్నదొక్కటే మానవ హక్కుల విషయం అవుతుంది. మహిళలకు ఉచిత బస్సు వల్ల, ఆటోవారికి రూ.12,000 సహాయపు హామీ అమలుకాకపోవటం వల్ల ఆటో కార్మికులకు చెందిన లక్షలాది కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాల పట్ల స్వయంగా ఆ మహిళలు సానుభూతి చూపుతున్నారు గాని, అందులో మేధావులకు ఏ హక్కులు గాని, సామాన్యుల మనోవేదనలు గాని దృష్టికి రావటం లేదు.
తామూ తమ తరగతి వారూ, తమ సమస్యల కోసం ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేయగల అవకాశం ఉంటే చాలు ఇవన్నీ దిగదుడుపు అయిపోతాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి పౌరహక్కుల సంస్థలకు, ఉద్యమాలకు, వాటి రాజీలేని కార్యకలాపాలకు దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ప్రస్తుత మేధావి బృందం దానినంతా ఒక్క ఏడాదిలో తుడిచిపెట్టింది. వారు తమ వెనుకటి ప్రతిష్టను పునరుద్ధరించుకోవటమైనా చేయాలి, లేదా రాహుల్ గాంధీ షేక్హ్యాండ్లు, లంచ్‌లతో, బీఆర్ఎస్ పట్ల ద్వేషంతో మైమరిచిపోయినట్టు నిజాయితీగా ప్రకటించి రంగం నుంచి నిష్క్రమించాలి.
చెప్పుకొనేందుకు ఇంకా అనేకం ఉన్నాయి. ఒక విధంగా పై ఉదాహరణలు చాలు వీరి తీరుతెన్నులను అర్థం చేసుకునేందుకు. అవసరమైతే తక్కినవి మరొకసారి చర్చించవచ్చు. అయినా, మొత్తం గ్యారెంటీలు,
రైతాంగ సమస్యలు, వారికిచ్చిన గ్యారెంటీ లు, భూ సేకరణలలో దౌర్జన్యాలు, శాంతిభద్రతలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వగైరా విషయాలలో జరుగుతున్నదేమిటో ప్రజలకూ, వీరికీ అనునిత్యం కనిపిస్తున్నదే.
కనిపించినా సరిగా అర్థం కానట్టయితే, పైన అన్నట్టు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని సామాన్యుల మధ్యకు మన మేధావి మహాశయులు తరలివెళ్లటం మంచిది. అటువంటి క్షేత్ర పరిశీలనలకు వారు పలు సంస్థల నుంచి ఫండింగ్ తెచ్చుకోగల సమర్థులు. కాకున్నా వారికి స్వయంగా నిధుల కొరత ఉందనుకోలేము.
-టంకశాల అశోక్