‘మాది ఫ్యూడల్ కుటుంబం. మా పూర్వీకుల కాలంలో మా ముందు నుండి ఎవ్వరూ చెప్పులు వేసుకొని నడిచేవారు కాదు’ ఇవి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొన్న మాటలు. ఇంకా తన కుటుంబ నేపథ్యం, తదితర వివరాలు పంచుకొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది. ఎవరైనా పుట్టి పెరిగిన వాతావరణం పెరిగి పెద్దయిన తర్వాత ప్రతి చర్యలోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. గడిచిన మూడేండ్లుగా రేవంత్రెడ్డి పాలనా తీరుతెన్నుల్లో ఫ్యూడల్ భావజాలం చాలా స్ఫష్టంగా కన్పిస్తూ ఉన్నది. ఫ్యూడలిజంతో పెనవేసుకున్న ఫ్యాక్షన్ సినిమాను మించిన విధంగా తన నేపథ్యం ఉన్నదని ఆయనే చెప్పుకొన్న వీడియో తన స్వభావం ఎట్లాంటిదో తనకు తానే ఇచ్చుకున్న సాక్ష్యం కూడా.
తెలుగు చలనచిత్ర రంగంలో ఈ మధ్య ఫ్యాక్షన్ సినిమాలు రావడం లేదు. ఒకప్పుడు సినిమా టాకీసుల వద్ద హీరో పోస్టర్లకు మూగజీవాలను బలిచ్చే వారు. రక్తపుటేరులు పారిస్తూ తమ అభిమానాన్ని చాటుకొనే వారు. ఇప్పుడు ఆ ఫ్యాక్షన్ సంస్కృతిని కాంగ్రెస్ నాయకులు నిజ జీవితంలో చూపిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. ఇది విమర్శ కాదు. వారి మాటలు, చర్యల ద్వారా వాళ్లే చెప్పుకొంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును కోరడం కాంగ్రెస్ వాళ్ల అవాంఛనీయ ఆలోచనా ధోరణికి పరాకష్ట. ఎవరెన్ని చెప్పినా, ఎన్ని విధాలుగా మాట్లాడినా తమ ధోరణి మారదని పదే పదే రుజువు చేసుంటున్నారు. చర్చ జరగాల్సింది అసెంబ్లీలో, లేదంటే చట్టసభల బయట ఏదైనా వేదిక మీద. అంతేకానీ విపక్ష నాయకుడి ఇంటి వద్ద కాదు కదా. మాజీ ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి తీవ్ర భయాందోళనలు సృష్టించాలని కాంగ్రెస్ నాయకులకు ఎవరు చెప్పారు.? ఏ ప్రజాస్వామ్య నైతిక సూత్రాల ఆధారంగా ఆ విధమైన నిరసన తెలుపాలని అనుకొన్నారు? వాస్తవానికి అది నిరసన కాదు. దాడికి వెళ్లడం వంటిదే. ఇంకా చెప్పాలంటే దండయాత్ర చేయడం అనొచ్చు. మరింత నిర్ధిష్టంగా చెప్పాలంటే మాజీ సీఎం ప్రాణాలకు ముప్పు తెచ్చే కుట్రపూరిత ఆలోచనా అంతర్గతంగా ఉన్నదని చెప్పొచ్చు.
గడిచిన మూడేండ్లుగా తెలంగాణ ప్రజలు కొన్ని విషయాలను గమనిస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రగతి భవన్ రక్షణ కంచెను తొలగించారు. దాన్ని తన విజయంగా చెప్పుకొన్నారు. ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత హైడ్రా పేరుతో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపాడు. వెలుగుమట్లలో పేద ఊరినే నేలమట్టం చేశారు. అక్కడ ప్రజాధనంతో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని బొంకారు. పేదల ఇండ్లు కూల్చే మనస్తత్వాన్ని ఏమని నిర్వచించాలి? ఆలాంటి ఆలోచన కలిగిన వారి గురించి ఏమని చెప్పాలి? ఎట్లా చెప్పాలి? ఇలాంటి విషయాల గురించి ప్రశ్నిస్తే వారిపై కక్షపూరిత చర్యలకు పూనుకొంటున్నారు.
వెయ్యి రోజుల పాలనలో ఏం సాధించారని ప్రధాన విపక్షం ప్రశ్నిస్తున్నది. చట్టసభ కేంద్రంగా తమ నిరసన వ్యక్తం చేయాలని అనుకొన్నది. అంతకు తగిన విధంగా ప్రజాస్వామ్యస్పూర్తితో నిరసన తెలిపింది. దీనికి ప్రతి ప్రభుత్వమూ తమనే ప్రశ్నిస్తారా అనే ధోరణిని ప్రదర్శించింది. బీఆర్ఎస్ నాయకులపై దాడికి పూనుకొన్నది. మహిళా ప్రతినిధులకు చట్ట సభ సాక్షిగా ఘోరఅవమానం జరిగింది. ప్రజాస్వామ్యానికి నిలువెత్తుప్రతీక అయిన అసెంబ్లీ వద్ద జరిగిన ఆ ఘటన సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఆ తరహా చర్య పాలకుల ఆలోచనల కు ప్రతీకగా నిలిచింది.
మూడేండ్లుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వినియోగిస్తున్న భాష విషయంలో కూడా తీవ్ర అభ్యంతరాలొస్తున్నాయి. తన మాటల ద్వారా తన స్వభావం ఏమిటో చెప్పుకొంటున్నారు. ‘కనుగుడ్లు పీకేస్తా…. కడుపులో పేగులు తీసి మెడలో వేసుకుంటా.. బీఆర్ఎస్ నాయకులను బొంద పెడ్తా..’ అనే మాటలను ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇట్లా చాలా చాలా మాటలు ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి దుర్భాషా ప్రావీణ్యాన్ని తట్టుకోలేక సొంత పార్టీ వాళ్లే చెవులు, కండ్లు మూసుకొన్నారు. ఆయన ఫ్యూడలిజపు ఆలోచన, ఆచరణ ప్రతి సందర్భంలోనూ ప్రదర్శితం అవుతూనే ఉన్నది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఏం మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా ‘డోంట్ కేర్, బారాకూన్ మాఫ్’ అన్నట్టు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. కానీ బీసీ నాయకురాలు కొండా సురేఖ విషయంలో ఆయన పార్టీ నియమావళి గుర్తుకొచ్చింది. నైతిక సూత్రాలు వల్లె వేశారు. క్రమణ శిక్షణ పేరుతో బీసీ మహిళను మంత్రి వర్గం నుంచి తప్పించారు. ఈ చర్య ముమ్మాటికీ ఫ్యూడలిజానికి ప్రతీక కాక మరేంది? ఇది ముమ్మాటికీ ఫ్యాక్షనిస్ట్ మార్క్ కాక మరేమిటి? కొండా సురేఖ కుమార్తె ఏదో మాటలు అన్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు ఆయనకు అమృతప్రాయంగా తోచాయి. ఎందుకంటే తమ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు ఏమి మాట్లాడినా చెల్లుతుందనే విషయాన్ని ప్రజలకు మరోమారు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మూడేండ్లుగా తాము చేసిన, చేస్తున్న పనుల గురించి చెప్పుకొనేందుకు సిద్ధం అని చెప్పుకొచ్చారు. వెయ్యిరోజుల ప్రజా పాలన అంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలతో ప్రచారం చేసుకుంటున్నారు. వెయ్యి రోజుల్లో ఏం సాధించారని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం దారుణ చర్యలకు పాల్పడుతున్నారు. తమది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకొంటారు. కానీ హిట్లర్ బూట్లల్లో కాళ్లు పెట్టామని తమ చర్యల ద్వారా చాటుకొంటున్నారు. మరోవైపు ఎల్ నినో కరువు పరిస్థితుల్లో నీళ్లు, కరెంటు ఇవ్వలేక పోతున్నారు. తమ చేతగానితనం బయట పడుతుందనే అక్కసుతో ఫ్యూడలిస్టిక్ ఆలోచనకు మరింత పదును పెట్టారు. చట్ట సభ సభ్యులను ఘోరంగా అవమానించారు. ప్రజాస్వామ్యానికి తలవంపులు తెచ్చారు. “ నీతిమంతుడు గోడ పెడితే కుక్కతోక తగిలి కూలిపోయిందట” అట్లాగే ఉన్నది రేవంత్ రాజకీయ నీతి, నైతిక, ప్రజాస్వామిక సూత్రాల వల్లెవేత. ఇది ప్రజాస్వామ్యం దేశం. ఫ్యాక్షనిస్ట్ట్, ఫ్యూడలిస్ట్ ఆలోచనా సాఫ్ట్ వేర్ పనికి రాదు. ఈ తరహా చర్యలను ప్రజలు అస్సలు అంగీకరించరు.
(వ్యాసకర్త: న్యాయవాది)
-వొద్యారపు రవికుమార్