మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 11: శ్రీశైలంలో 125 టీఎంసీలకు పైగా నీళ్లున్నా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటర్లను నడుపకుండా రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అల్టిమేట్ జారీ చేయడంతో ఎట్టకేలకు హడావిడిగా శుక్రవారం తెల్లవారుజామున గుడిపల్లి రిజర్వాయర్ వద్ద రెం డు మోటర్లను సర్కార్ ప్రారంభించింది. గత కొన్ని రోజుల నుంచి కృష్ణానది జలాలను ఏపీ నిరంతరాయంగా దోపిడీ చేస్తున్నా రాష్ట్ర ప్రభు త్వం ఉన్న ఏకైక కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీళ్లు ఇవ్వకుండా లిఫ్టులు పనిచేయకుండా ముందస్తుగా విద్యుత్తు సరఫరాను నిలిపి వే సిందని బీఆర్ఎస్ నేతల పరిశీలనలో తేలింది. ఇటీవలే కల్వకుర్తి స్టేజి వన్‌లోని నార్లాపూర్ పంప్ హౌస్‌లో ఒక పంపు కాలిపోయిందని ప్రస్తుతం రెండు పంపులు మాత్రమే నడుస్తున్నాయని కనీసం వాటి రిపేర్‌కు ప్రభుత్వం ఇంతవరకు పూనుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLIS) స్టేజ్-3 పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు మా జీ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. దీంతో రేవంత్ సర్కార్ హడావిడిగా రెండు పంపులను వాళ్లు వచ్చే కొన్ని గంటల ముందే ప్రారంభించింది. అనంతరం గుడిపల్లి రిజర్వాయర్, పంప్ హౌస్‌ను పరిశీలించిన మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సీ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేఎల్ఐ పంప్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లను నిరంతరంగా నడుపకపోతే లిఫ్ట్‌ల వద్ద టెంట్లు వేసి రైతులతో కలిసి వంటావార్పు చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి లేపేందుకే ఈ పర్యటన చేపట్టాం. పాలమూరు ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. మరో 10 శాతం పనులు పూర్తి చేస్తే రైతుల పొలాల్లోకి నీరు వెళ్లే అవకాశం ఉన్నది. శ్రీశైలం నుంచి 37 టీఎంసీల నీటిని ఏపీ తీసుకెళ్లినట్టు అధికారికంగా చెబుతున్నారు. వాస్తవంగా వెళ్లింది 70 టీఎంసీలపైనే. తెలంగాణకు మాత్రం 7 టీఎంసీల లోపే నీరు వచ్చింది. జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కరెంటు లేదనే కారణంతో మోటార్లు నడపడం లేదు. కృష్ణా బేసిన్లో ఉన్న వారికి నీరు లేదు. కానీ ఏపీలోని పెన్నా బేసిన్లో ఉన్న పొలాలకు కృష్ణా నీటిని తీసుకెళ్తున్నారు. ముచ్చిమర్రి, పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు రావాల్సిన 50 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా 8 వేల క్యూసెక్కుల నికర జలాలు పోతున్నా యి. మేము గుడిపల్లి వద్దకు వస్తుండటంతో రెండో మోటర్‌ను ఆన్ చేశారు.
శ్రీశైలంలో నీరున్నా అందించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. సీఎం రేవంత్‌రెడ్డికి ఫ్యూచర్ సిటీపై ఉన్న ధ్యాస రైతులపై లేదు. కేఎల్ఐ పంపులు 24 గంటలు నడుపాల్సిందే. ఏపీ నీళ్లు దోచుకుపోతుంటే మన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వానకాలం మొదలయ్యినప్పటి నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. ప్రభుత్వమే నీళ్లు లేవని చెప్తున్నది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీళ్లెత్తుకుపోతున్నది. రోజుకు పది నుండి పన్నెండు టీఎంసీల నీటిని తరలిస్తున్నది. ఉన్న నీటిని వాడుకోవడానికి రేవంత్ సర్కార్‌కు చేతగావడం లేదు. 854 అడుగుల ఎత్తు వరకు పోతిరెడ్డిపాడు, 840 వరకు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ డ్రా చేస్తున్నదని, రేవంత్ సర్కార్ ఎందుకు చేయలేకపోతున్నదో చెప్పాలి. ఈ రోజుకూ 124 టీఎంసీల నీరుంది. శ్రీశైలంలో ఉన్న నీటిని యాసంగి పంటకు కూడా ఇవ్వొచ్చు.
రైతులకు నీరిచ్చే సోయి ఈ ప్రభుత్వానికి లేదు. బీఆర్ఎస్ ఆందోళనకు దిగుతామంటే నీళ్లిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పాదయాత్ర చేస్తామంటే సీఎం రెండు రోజులు పర్యటించారు. మేము వస్తే మోటర్లు ఆన్ చేశారని రైతులు చెప్తున్నారు. పంటలు కాపాడాలనే సోయి ప్రభుత్వానికి లేదు. వానకాలం సాగుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక ఇవ్వలేదు.
కల్వకుర్తి మోటర్లు ఆపితే రైతులతో కలిసి లిఫ్ట్‌ల వద్ద వంటావార్పు చేపడుతాం. కల్వకుర్తి ఎత్తిపోతల మోటర్లు ఉదయం నడిపి రా త్రి బంద్ చేయడం ప్రభుత్వ చేతకానితనం. ఇక ప్రతి పంపింగ్ స్టేషన్ వద్ద టెంట్లు వేసి నిఘా పెడుతాం. మోటర్లు ఆపితే ఊరుకోం.
సీఎం రేవంత్ పాలమూరు రైతుల గొంతు కోస్తున్నారు. రేవంత్‌కు ఈ ప్రాంత రైతుల మీద ప్రేముంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయాలి.