వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ఏదో మూలన హత్యలు, మూక దాడులు, దొంగతనాలు, దోపిడిలు జరుగుతుండటం నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయమై ప్రత్యేక దృష్టిసారించి నేరాలను అదుపులో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో గత ఆరేడు నెలలుగా వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇదిలా ఉంటే మద్యం ఆదాయంపై దృష్టిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖకు మంత్రిని నియమించింది కానీ, ప్రభుత్వంలో కీలకమైన, ప్రజలకు రక్షణ కల్పించే హోంశాఖా మంత్రిని నియమించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే హోంమంత్రిని నియమించాలి. అప్పుడే నేరాలకు, హత్యలకు అడ్డుకట్ట పడుతుంది.
– మ్యాన శ్రీనివాస్, భగత్‌నగర్, కరీంనగర్