తెలంగాణ ప్రతీసారి తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉన్నది. ఆంధ్రా వలస పాలకుల కాలంలో అదే పోరాటం. రాష్ట్ర అవతరణ జరిగిన తర్వాత కూడా అదే పోరాటం. తెలంగాణ నిరంతరం తన ఉనికిని, గుర్తింపునీ చాటుకోవాల్సి రావడం విషాదం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా అధికారిక చిహ్నం, రాష్ట్ర గీతం విషయాల్లో జరుగుతున్న చర్చ ఇందుకు తార్కాణం.
తెలంగాణ రాష్ర్టానికి ఒక అధికారిక గీతం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ పాటకు ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి చేత స్వరకల్పన, సంగీత రచన చేయించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను అందెశ్రీ అభీష్టానికి వదిలేసినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అభ్యంతరాలు తెలంగాణ పౌర సమాజం నుంచి వ్యక్తమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రా సంగీత దర్శకుడు అవసరమా అన్న ప్రశ్నకు అందెశ్రీ చాలా అభ్యంతరకరమైన సమాధానం చెప్పారు. కీరవాణిని తలదన్నే సంగీత దర్శకుడు తెలంగాణలో ఎవరున్నారో తీసుకురండి అని అందెశ్రీ సవాలు విసిరారు. తెలంగాణలో సంగీత దర్శకులు లేరని అందెశ్రీ నిశ్చిత అభిప్రాయం. కీరవాణి సంగీత ప్రతిభ అందరూ ప్రశంసించిందే. ఆయన గొప్పతనం ఆస్కార్ దాకా చేరిన సంగతి జగద్విదితం. అంతటి గొప్ప సంగీత దర్శకుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ కావాలని పాడే ఒక్క పాటకూ సంగీతం ఎందుకు సమకూర్చలేదు? ఆ కాలంలో అందెశ్రీ కీరవాణితో ఎందుకు తన పాటలకు సంగీత రచన చేయించుకోలేదు? స్వరాష్ట్ర ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు అందెశ్రీ పాటలన్నింటికీ సంగీతం సమకూర్చింది తెలంగాణ వాళ్లే. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసి ఉర్రూతలూగించిన అనేక పాటలకు అద్భుతమైన సంగీతం అందించిన వాళ్లంతా తెలంగాణవాళ్లే అన్నది నిజం. కానీ, తెలంగాణలోని సంగీత దర్శకులు కీరవాణి కన్నా తక్కువ స్థాయివాళ్లు అని అందెశ్రీ అభిప్రాయం. సరిగ్గా ఇలాంటి అభిప్రాయాలనే నిజాం కాలంలో ఆంధ్రా కవులు ప్రకటించారు.
తెలంగాణలో కవుల్లేరని ఒక మహానుభావుడు అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలకు సమాధానంగానే గోలకొండ కవుల సంచిక వచ్చింది. అస్తిత్వ పరిరక్షణ, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసమే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఆత్మగౌరవం కోసమే తెలంగాణ యువకులు వందలాది మంది ప్రాణాలను బలిదానం చేశారు. ఆ పోరాటంలో పాల్గొని వేదికల మీద పాటలు పాడిన అందెశ్రీ తెలంగాణలో మేటి సంగీత దర్శకులు లేరని అంటున్నారు. తెలంగాణ ప్రజలను ఆంధ్రవాళ్లలాగే అవమానిస్తున్నారు.
గత పాలకులు రాష్ట్ర గీతాన్ని పెట్టలేదని, జయ జయహే తెలంగాణ పాటను పక్కనపెట్టారని, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన పాటను ప్రకటించి సముచిత గౌరవాన్ని చాటిచెప్పిందని పాలక పార్టీ మద్దతుదారులు అంటున్నారు. గత పాలకులకు అందెశ్రీకి మధ్య ఏం జరిగిందో తెలియదు గాని ఇప్పటి పాలకులు మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందించాలి. అయితే, ఇప్పుడు లేవనెత్తిన ప్రశ్నలకు ఆ వాదనకు పొంతన లేదు. ఆ పాట స్వరకల్పనకు తెలంగాణ సంగీత దర్శకులు అనర్హులా? తెలంగాణ సంగీత దర్శకులు ఇంతమంది ఉండగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన కీరవాణినే ఎందుకు ఎంచుకోవాలి? తెలంగాణ ఉద్యమానికి కీరవాణి కాంట్రిబ్యూషన్ ఏమిటి? అది ఉద్యమ సందర్భంలో పుట్టిన పాట కాబట్టి మేము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలంగాణ కవులు, కళాకారులు, ఉద్యమకారులు అంటున్నారు. గత పాలకులు బతుకమ్మ పాటను ఏఆర్ రెహమాన్‌తో చేయిస్తే, ఎవరూ అభ్యంతరం చెప్పలేదని మరొక వాదనను ముందుపెడుతున్నారు. బతుకమ్మ తెలంగాణ ప్రజల పండుగ. ఏడాదికి ఒకసారి మాత్రమే ఆ పండుగ వస్తుంది. కానీ, రాష్ట్ర గీతాన్ని ప్రతీ రోజు పాడాలి. ప్రతీ సందర్భంలో దాన్ని ఆలపించాలి. అది అధికారిక గీతం. రెండింటి సందర్భం వేరు. రెండింటి ప్రాధాన్యాలు వేరు. ఏఆర్ రెహమాన్‌కు తెలంగాణ కల్చరల్ లైఫ్ తెలియకపోవడం వల్లనే ఆ పాటకు మంచి స్వర, సంగీత రచన చేయలేకపోయాడన్నది నిర్వివాదాంశం. అదేవిధంగా కీరవాణికి కూడా తెలంగాణ జీవనం తెలియదు. హైదరాబాద్‌లో నివసించినంత మాత్రాన ఒకరికి తెలంగాణ అస్తిత్వ, తెలంగాణ భావోద్వేగాలు అర్థమవుతాయని అనుకోలేం.
అలాగే మరో వాదనేమంటే, గతంలోనే జయజయహే తెలంగాణ పాటను ఒక ఆంధ్రా గాయకుడు రామకృష్ణ పాడాడు కదా? ఇప్పుడు కీరవాణి సంగీతం చేస్తే అభ్యంతరమెందుకు అన్నది ఆ వాదన. ఆ పాటను పాడమని దివంగత బాలసుబ్రహ్మణ్యంను అడిగితే ఆయన నిరాకరించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆ పాటను రామకృష్ణ పాడారు. అప్పుడది రాష్ట్రగీతం కాదు. ఇప్పుడున్న సందర్భం వేరు. ఒకసారి రాష్ట్ర గీతంగా ప్రకటించగానే అది ప్రభుత్వానికి, ప్రజలకు సంబంధించిన గీతం అవుతుంది. దాని మీద ప్రభుత్వానికి హక్కులుంటాయి. రాసిన కవికి ప్రతీకాత్మక సంబంధమే ఉంటుంది. కానీ, దానికి విరుద్ధంగా, ఎవరు సంగీత దర్శకుడు ఎవరుండాలన్నది కవి ఇష్టానికి వదిలేయడం సరైంది కాదు. ఇంతమంది ఈ విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం అప్రజాస్వామికం.
అధికారిక చిహ్నంలో రాచరిక చిహ్నాలు ఉండరాదని రేవంత్ రెడ్డి అంటున్నారు. చార్మినార్, కాకతీయుల కళాతోరణం తెలంగాణ వారసత్వ సంపద. అవి తెలంగాణ అస్తిత్వాన్ని, గౌరవాన్ని చాటిచెప్పే నిర్మాణాలు. వాటిని నిర్మించినవాళ్లు రాజులే కావొచ్చు. కానీ, వాటికి రాళ్లు ఎత్తింది, నిర్మించిందీ తెలంగాణ వాళ్లు. అందుకే, అవి తెలంగాణ ప్రజా జీవితంలో విడదీయలేని గుర్తులయ్యాయి. ఇప్పటికే ఆర్కియాలజీ డిపార్టుమెంటు కాకతీయుల కోటను పునరుద్ధరించడానికి బదులు శిథిలావస్థకు చేర్చింది. ఆర్కియాలజీ నిబంధనలకు విరుద్ధంగా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం అంతా దురాక్రమణలకు గురైంది. ఇక అధికారిక చిహ్నం నుంచి వాటిని తొలగిస్తే, వాటి భౌతిక నిర్మాణాల రక్షణకు దిక్కు ఉండదు.
అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. నా మాటే శాసనం అనడమే రాచరికం. రేవంత్‌రెడ్డి నిరంకుశంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం రాచరికం కాదా? రాచరికం అనేది ఫ్యూడల్ లక్షణం. రాష్ట్ర అవతరణ దినోత్సవ సమయంలో ప్రజాభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే, అది రాచరికానికి ప్రతీక అవుతుందనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: రచయిత, దర్శకుడు తెలంగాణ సినిమా కార్మిక సంఘాల సమాఖ్య అధ్యక్షుడు)
– ప్రేమ్‌రాజ్