ఎన్నికలు వచ్చేశాయి. ఒక్క నెల తర్వాత కాంగ్రెస్, బీజేపీ నేతలు కనిపించరు. బీఆర్ఎస్ తను చెప్పిన పథకాలు ఏ ఆటంకాలు లేకుండా ప్రజలకు అందింవచ్చు. అయినా కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికల్లో ఏ పథకాలు ఇస్తామంటున్నారో, అవి ఎంతవరకు సాధ్యమో చూద్దాం!
కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు అమలుచేయటానికి సుమారుగా 8 నుంచి 10 లక్షల కోట్లు అవసరమవుతాయి. మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామన్నారు. సుమారు 2 కోట్ల మందికి ఇవ్వాలి. గ్యాస్ సిలిండర్ రూ.500లకు, ఉచిత బస్ ప్రయాణం మహిళలకు, రైతు భరోసా రూ.15,000 ఎకరానికి, రూ.12000 వ్యవసాయ కూలీలకు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్ళు అందరి బీదవాళ్లకు, 250 గజాల భూమి ఉద్యమకారులకు రూ.5 లక్షలు ఇళ్లు కట్టుకోవడానికి, రూ.5 లక్షలు యువత చదువుకు, ఇంకా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్, వృద్ధులకు, బీడీ కార్మికులకు, బీదవారందరికీ 4,000 భరోసా, 10 లక్షల ఆరోగ్యం బీమా అందరికి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని లెక్కలు వేస్తే మన ఆదాయం కాక ఇంకా మూడు, నాలుగు రాష్ర్టాల ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఈ పథకాలన్నీ అమలుచేయటానికి వీలవుతుంది. సరే, వాళ్ల మాటలు నమ్మాలంటే కాంగ్రెస్ ఈ రాష్ర్టాన్ని పాలించినప్పుడు ఈ వర్గాలన్నింటినీ ఆదుకుందా జ్ఞాపకం చేసుకోవాలి. మహిళలకు, రైతులకు, యువతకు 50 ఏండ్లలో ఏం చేసింది?
ఆ అర్ధ శతాబ్దంలో కాంగ్రెస్ నాయకులు కోటీశ్వరులయ్యారు. ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. యువతకు ఆ విషయాలు తెలియకపోతే మీ తల్లిదండ్రులను అడగండి. ఉమ్మడి రాష్ట్రమా కాదా అన్నది ప్రశ్న కాదు. అప్పుడు ఈ రాష్ర్టానికి చెందవలసిన నిధుల కోసం ఈ కాంగ్రెస్ నాయకులు కృషిచేశారా అన్నది చూడాలి. ఆ 58 ఏండ్లలో హైదరాబాద్ ఆదాయం 66 శాతం తెలంగాణ జిల్లాల ఆదాయం 10 శాతం కలిపి 76 శాతం తెలంగాణ ఆదాయం ఇక ఆంధ్రా ఆదాయం 17 శాతం, రాయలసీమ ఆదాయం 7 శాతం. మరి ఆ ఆదాయంతో తెలంగాణ ప్రాంతం లో అభివృద్ధి జరిగిందా? ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే చూడండి తెలుస్తుంది. పోనీ జరిగిందేదో జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఏం జరుగుతుందో చూద్దాం!
నిన్న, మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారి 5 గ్యారెంటీలను అమలుచేయగలిగిందా? పొలాలు ఎండి రైతులు రోడ్డున పడ్డారు. ఉచిత బస్ ప్రయాణంతో నెలరోజులు కాకుండా వారి రోడ్డు రవాణా సంస్థ దివాళా తీసింది. ఆ పథకం మూలపడింది. మహిళా పింఛన్, ఉచిత కరెంటు నిలిపేశారు. ఇక మిగతా పథకాలు, యువనిధి డబ్బులు లేక మొదలుపెట్టనే లేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల ప్రగల్భాల ఫలితం! మరి కర్ణాటకలో బీజేపీ మీద నిర్వేదంతో కాంగ్రెస్‌ను గెలిపించిన ఓటర్లు పశ్చాత్తాపపడుతున్నారు. ఇక ఈ పథకాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మాటలెలా ఉన్నాయి? రైతుబంధు ఒద్దంటాడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అది వ్యర్థమైన పథకమంట. ఆయన గాలి తిని బతుకుతాడేమో మరి! 3 ఎకరాలకు 3 గంటల కరెంటు చాలంటాడు అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి! ఈయన ఏం తింటాడో తెలియదు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతానంటాడు భట్టి! ఈ మాటలు వింటూ, అర్థం చేసుకుంటే వాళ్ల రహస్య పథకాలు అర్థమవుతాయి. తెలంగాణలో అధికారంలోకి రావటం కాదు, 10 సీట్ల కంటే ఎక్కువ వచ్చినా ఈ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పథకాలు తీసెయ్యమని శాసనసభలో గందరగోళం సృష్టించటం ఖాయం. ప్రజలు ఈ విషయం, అర్థం చేసుకొని, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో వారి వైఫల్యాలు, అవినీతి పాలన, అర్థం చేసుకొని అప్రమత్తం కావాలి. జాగ్రత్తగా ఆలోచించి, తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ అభివృద్ధిని గమనించి ఓటేయాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే కర్ణాటక ప్రజల కష్టాలు ఇక్కడ కూడా వస్తాయని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రహస్య అజెండా నాయకుల అభివృద్ధే కానీ, ప్రజల కోసం పాలన కాదని గ్రహించాలి.
ఇక రెండో పార్టీ బీజేపీ మాటలు, చేతలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2014 నుంచి మోదీ చెప్పిన మాటల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయి? ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ కాస్తా, ‘సాబ్ కా సాథ్, సాబ్ కా వికాస్’ అయిపోయి 140 కోట్ల మంది ఇక్కట్లు మొదలయ్యాయి. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు హాంఫట్! ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అన్న పార్టీ 40 లక్షల మరుగుదొడ్లు కట్టామని గొప్పగా చెప్పుకొన్నారు కానీ, ప్రతి రాష్ర్టానికి 10 బాలికల పాఠశాలలు ఇవ్వలేదు. ఆ మాటలు మాయమవ్వటమే కాకుండా బాలికలను, స్త్రీలను అవమానించిన, మానభంగాలు చేసిన బీజేపీ నేతలు మోరలెత్తుకొని సమాజంలో సన్మానాలు అందుకుంటున్నారు.
మణిపూర్ మహిళలైనా, అంతర్జాతీయ బహుమతులు అందుకున్న వీర వనితలైనా, గుజరాత్, ఇతర ప్రాంతాలలోని ముస్లిం మహిళలైనా ఏమీ తేడాలేదు. మానభంగం చేసి ఆ బాలికనో, యువతినో సజీవదహనం చేసినా శిక్ష లేదు. ఇక రైతుల ఆవేదన సరే సరి!
భారతీయ జనతా పార్టీ రహస్య ఎజెండా కాంగ్రెస్ వారి కంటే చాలా చిన్నది. పార్టీ నాయకులందరూ అవినీతి సొమ్ము పంచుకోవటం కాంగ్రెస్ రీతి అయితే, చాలా కొద్దిమందికి దేశ సంపద కట్టబెట్టాలన్నది మోదీ ఆశయం. ఇది మనం కండ్లారా చూస్తున్నాం. శ్రీకృష్ణ తులాభారం లాగ ఒకవైపు అదానీ, అంబానీ ఉంటే త్రాసుకు రెండోవైపు భారతీయులంతా ఉన్నా అది తేలిపోతూనే ఉంది. ఈ విషయం తెలంగాణ ప్రజలే కాదు, ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా గమనించాలి. మోదీ చెప్పిన మాటలు, ఎలక్షన్ ప్రసంగాలు ఎన్ని అబద్ధాలతో కూడుకొని ఉన్నాయో, ఆ మాటలకు, గెలిచిన తర్వాత ఆయన చేతలకు ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోవాలి. వారు చేసిన పనులతో వారి రహస్య ఎజెండా అర్థం చేసుకోవాలి. కేంద్రం గతంలో మిలిటరీ పాలన, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకుల నిర్వీర్యత ఈ రాష్ర్టానికి, ప్రజలకు ఎంత నష్టం, కష్టం కలిగించాయో గుర్తుచేసుకోవాలి. ఈ రెండు స్వార్థ రాజకీయపార్టీల రహస్య ఎజెండాలు అర్థం చేసుకోవాలి. వారిని తరిమి తరిమికొట్టాలి.
మనం కర్ణాటక, ఇంకా కొన్ని రాష్ర్టాల లాగ దిక్కు లేకుండా లేం. మనకు ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించిన మేధావి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి కండ్లముందు ఉంది. కేసీఆర్ ప్రతి ప్రసంగంలో చెప్పినట్టు ఈ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయో ప్రజలు చర్చించుకోవాలి. మాటలు చెప్పి చేతలు వేరుగా చేసే ప్రభుత్వాల గురించి కూడా చర్చించుకొని మన ప్రభుత్వంతో పోల్చిచూసుకోవాలి. ఏది మనం నమ్మవచ్చు? ఎవరు చెప్పిన మాటలు, ప్రకటించిన పథకాలు అమలుచేస్తున్నారో కూలంకషంగా పరిశీలించాలి. జాగ్రత్తగా ఓటు వేయాలి.
మన అదృష్టం మనం తీసుకునే నిర్ణయాల మీద, చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. తెలివి తక్కువగా కేవలం ఈ నాయకుల ఇచ్చకాల మాటలు నమ్మి కాంగ్రెస్‌కో, బీజేపీకో ఓటు వేస్తే, తెలివిగా మనని మోసం జేసే నాయకులు అధికారంలోకి వస్తారు. మనం తెలివిగా ఆలోచించి మనకు మంచి చేసిన, చేస్తున్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మనది, మన తరువాతి తరాల వారిది కూడా భవిష్యత్తు బాగుంటుంది. ఎన్నో కష్టాలు అనుభవించి పద్నాలుగేండ్ల ఉద్యమం ద్వారా సాధించిన రాష్ర్టాన్ని కాపాడుకునే చైతన్యం, తెలివి తెలంగాణ ప్రజలకు ఉందనుకుంటాను.
-కనకదుర్గ దంటు
89772 43484