తెలంగాణ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన విషయమై కాంగ్రెస్ వైఖరిని గమనించినప్పుడు అనేక విషయాలు మనసుకు వస్తాయి. ఇటీవలి పరిణామాల నుంచి ఒక ఉదంతాన్ని చెప్పుకొని, ఇతర అంశాల చర్చలోకి తర్వాత వెళదాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 2014లో ఓడి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 600 అడుగుల సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018లో గుజరాత్లో ప్రతిష్ఠించారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరిట నర్మదా నదీ తీరాన గల ఆ విగ్రహం మొత్తం ప్రపంచంలోనే అన్ని విగ్రహాల కన్నా ఎత్తయినది.
అందుకు ఖర్చు రూ.2989 కోట్లు. పటేల్‌కు ఉక్కు మనిషి అని, వలస పాలన తర్వాత దేశంలోని సంస్థానాలన్నింటినీ విలీనం చేయడంతో పాటు మొత్తం దేశం కోసం ఒక పాలనాయంత్రాంగాన్ని నెలకొల్పినవాడనే ప్రతిష్ఠ ఉంది. ఆ విధంగా తన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అయింది. కాంగ్రెస్ వారికి ఇదంతా తెలుసు. అయినప్పటికీ ఆయన విగ్రహం ఏర్పాటును అప్పుడు రకరకాల పేర్లతో నానాయాగీ చేశారు. దానితో దేశప్రజల దృష్టిలో ప్రతిష్ట కాస్తా బీజేపీకి లభించగా, కాంగ్రెస్ అప్రతిష్టపాలైంది.
Congress | ఇప్పుడు మరొకటి చెప్పుకుందాం. సర్దార్ పటేల్ జీవిత చరిత్రను సాధికారికంగా రచించిన చరిత్రకారుడు రాజ్‌మోహన్‌గాంధీ. ఆ గ్రంథం ఉపోద్ఘాతంలో ఈ విధంగా ఉంది. ‘స్వతంత్ర భారతదేశ వ్యవస్థ ఒక చట్టబద్ధతను, శక్తి సంపన్నతను సమకూర్చుకోవటానికి ప్రధానంగా ముగ్గురు వ్యక్తులు చేసిన కృషి కారణమనాలి. వారు గాంధీ, నెహ్రూ, పటేల్. కానీ, ఆ గుర్తింపు నెహ్రూకు పూర్తిగా లభించి, గాంధీ విషయంలో భక్తిశ్రద్ధలతో జరగగా, పటేల్‌ను ఎవరూ ఎక్కువగా పట్టించుకోలేదు. 1989లో నెహ్రూ జన్మదిన శత వార్షికోత్సవాల సందర్భంగా వెయ్యి బిల్‌బోర్డులు వెలిశాయి. ఆయనకు స్మారకంగా టెలివిజన్ సీరియళ్లు ప్రసారమయ్యాయి. అనేకానేక ఇతర ఉత్సవాలు, కార్యక్రమాలు జరిగాయి. 1975 అక్టోబర్ 31న పటేల్ శత వార్షికోత్సవ సమయంలో, ఇందుకు పూర్తి భిన్నంగా, మనకేమీ కనిపించలేదు. ఆ తర్వాత కూడా, ఆధునిక భారతపు అద్భుత సుపుత్రులలో ఒకరి జీవితంపై కప్పిన తెరలను అప్పుడప్పుడు, పాక్షికంగా మాత్రమే తొలగదీశారు’.
పటేల్ విగ్రహ ఉదంతానికి, తెలంగాణ తల్లి విగ్రహ విషయానికి సంబంధం ఏమిటని అనిపించవచ్చు. ఆ సంబంధం ఏమిటో చూద్దాం. కొద్ది మాటల్లో చెప్పాలంటే, స్వాతంత్య్రోద్యమ ఖ్యాతి యావత్తూ గాంధీతో పాటు నెహ్రూకు మాత్రమే లభించాలని, దానిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వాధిపత్యానికి నెహ్రూను (ఆ తర్వాత ఆయన వారసులను మాత్రమే) అర్హులను చేయాలన్న ఆలోచనలో ఇందుకు మూలాలున్నాయి. దేశమంతటికీ నేటికీ ఆరాధనీయునిగా మారిన సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్రం వచ్చే సమయానికి జీవించిలేరు గాని, కనీసం తనకు లభించవలసిన ఖ్యాతి విషయంలోనూ వీలైనన్ని ఆటంకాలు సృష్టిస్తూ పోయారు. అదంతా కూడా నెహ్రూ, ఆయన వంశీకుల కోసం. అందుకే బోస్ అస్థికలశం దేశానికి స్వాతంత్య్రం లభించిన 77 ఏండ్ల తర్వాత కూడా ఒక పరాయి దేశమైన జపాన్ రాజధాని టోక్యో సమీపాన రెంకోజీ ఆలయంలోనే ఉండిపోయింది. దానిని భారత ప్రభుత్వం కోరిన వెంటనే అప్పగించగలమని ఆలయ ప్రధాన పూజారి చాలాకాలం క్రితమే ప్రకటించినా కదలిక లేదు. తన మరణానికి సంబంధించిన రహస్య పత్రాలు భారత ప్రభుత్వం వద్ద ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి.
పటేల్ విషయంలో గాని, నేతాజీ విషయంలో గాని ఇవన్నీ ఎవరి కోసం జరిగాయన్నది ప్రశ్న. దేశం కోసమా? లేక నెహ్రూ, ఆయన వారసుల కోసమా? ఇదంతా చేయడంలో ఎవరి భాగస్వామ్యం ఉందన్నది మరొక ప్రశ్న. నిర్మొహమాటంగా చెప్పుకోవాలంటే, స్వాతంత్య్రోద్యమ ప్రతిష్టపై, అది తెచ్చిపెట్టిన అధికారంపై ఏకచ్ఛత్రాధిపత్యం ఆ వంశపు కోరిక కాగా, ఆ వంశాన్ని ఆశ్రయించి, పొగుడుతూ, ఎప్పటికప్పుడు లాభపడుతూ, ఆ వంశానికి ఇంటాబయటా ఎదురులేకుండా చూడాలన్నది కాంగ్రెస్‌లోని ఆశ్రిత గణాల నిరంతర ప్రయత్నం. ఆ క్రమంలో వారు చేసిన అనేక అకృత్యాల జాబితా అంతా ఇక్కడ రాయలేం గాని, ఆ వంశపు అధికారానికి, స్వయంగా తమ అధికారానికి ఆటంకం కాగలవనుకునే ప్రాంతీయ భావనలను, ప్రాంతీయ శక్తులను, ప్రాంతీయ సంస్కృతులను, ప్రజల మనోభిప్రాయాలను నిర్లక్ష్యం చేయడం, అవమానించడం, తొక్కివేయడం ఒక తప్పనిసరి అవసరమని ఆ పార్టీ లేదా ఆ వంశపు అధినాయకులు, వారి ప్రాంతీయ తాబేదార్లు తలపోశారు. ఆ ప్రకారమే ఇన్ని దశాబ్దాలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
సర్దార్ పటేల్‌ను, నేతాజీ బోస్‌ను చీకటి గదులలోకి తోసివేయజూడటం నుంచి మొదలుకొని, ఇప్పుడు తెలంగాణ తల్లి అనే ప్రజల ఆరాధ్య దేవత విగ్రహాన్ని సచివాలయం ఎదుట నుంచి గాయబ్ చేసి, తమ అధికార ప్రదాతల వంశస్తుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించజూడటం వరకు అన్నీ కూడా ఒకే మూలం నుంచి పుట్టుకొచ్చిన అధికార తాబేదారీ చర్యలే. కానీ, ఆ మాట బయటకు ఒప్పుకోవడం కాస్త ఇబ్బంది అవుతుంది గనుక, అందుకు ‘త్యాగాలు’ అనే ముసుగు తొడిగి, ప్రచారాలు చేసి, ప్రజలను నమ్మించజూస్తారు. ప్రజలట్లా నమ్మితేనే తమ అధికార జూదం విజయవంతంగా సాగుతుంది గనుక. ఇందులో నెహ్రూకు సంబంధించినంతవరకు త్యాగాలు, అర్హతలు, సమర్థతలు, దార్శనికత విషయంలో ఎటువంటి సందేహాలు లేవు. కుమార్తె ఇందిరను ప్రమోట్ చేసిన బంధుప్రీతి వరకు, అట్లాగే పటేల్, బోస్‌ల స్మృతిని అంతగా బయటకు రానివ్వకపోవటం వరకు నిజమే. వ్యక్తిగత అర్హతల విషయంలో మాత్రం సందేహాలు లేవు. తన వల్ల పార్టీ బతికింది తప్ప, తన మనుగడ కోసం పార్టీని ఉపయోగించుకోవలసిన అగత్యం ఆయనకు ఏర్పడలేదు. అట్లాగే ఆయన ఫెడరల్ నీతికి కట్టుబడి ప్రాంతీయ భావనలను గౌరవించారు తప్ప వాటిని తొక్కివేయజూడలేదు. నెహ్రూ తర్వాత ఈ కోణాల నుంచి అన్నీ మారసాగాయి. ఇందిర, రాజీవ్‌ల హత్యలు తీవ్రంగా ఖండించవలసినవే గాని, పంజాబ్ రాజకీయాలు, స్వర్ణమందిరంపై దాడి, సిక్కుల మనోభావాల విషయంలో ఇందిర గాని, శ్రీలంక వ్యవహారంలో రాజీవ్ గాని మితిమీరిన జోక్యం చేసుకోని పక్షంలో ఆ దురంతాలు సంభవించేవి కావు. కచ్చితంగా చెప్పాలంటే వారిద్దరిది అటువంటి దురంతాలకు బలి కావడం తప్ప, దేశం కోసం త్యాగం కాదు.
దేశం కోసం స్వాతంత్య్రోద్యమ కాలంలో, ఆ తర్వాతా సర్దార్ పటేల్ ఘనమైన కార్యాలు అనేకం చేసినా, ఆయన కన్నా నెహ్రూయే ప్రధానమంత్రి పదవికి తగిన నాయకుడని స్వయంగా గాంధీజీ నిర్ణయించడంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అవి సరైనవే కూడా. ఆ వివరాలు ఇక్కడ అసందర్భం గాని, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ నెహ్రూ మహా నాయకుడు. అయినప్పటికీ 1952 నాటి మొదటి ఎన్నిక గడిచి 1957లో రెండో ఎన్నికలు వచ్చేసరికే ఆయన పార్టీ పలు రాష్ర్టాల్లో పరాజయాలు ఎదుర్కోవడం మొదలైంది. అందులోనే, వైఫల్యాలను నిజాయితీగా అంగీకరిస్తూ.. ప్రజాభిప్రాయాలను గౌరవించి అందుకు తగినట్లు వ్యవహరించక తప్పదని ప్రకటించడంలో ఆయన ప్రజాస్వామికత, గొప్పదనం ఉన్నాయి. కానీ, తన వారసులకు ఇవేమీ లేకపోయాయి. వారు, వారి అనుచరులు తమ నాయకుల కోసం, వారి అధికారం కోసం, అట్లాగే వారిని ఆశ్రయించి తాము కూడా అధికారం సంపాదించుకునేందుకు అన్నింటినీ తొక్కివేయడం సాగించారు. పటేల్, సుభాష్ చంద్రబోస్‌ల స్మృతులను తొక్కివేయటం, ప్రజాస్వామ్యాన్ని తొక్కివేయడం, ఫెడరలిజాన్ని తొక్కివేయడం, ప్రాంతీయ ప్రజాభిప్రాయాలను, సంస్కృతులను తొక్కివేయడం వంటివన్నీ అందులో ఉన్నాయి. ప్రాంతీయ భావనలు, పార్టీలు వరుసగా పుట్టుకువచ్చి కాంగ్రెస్ పుట్టి ముంచింది అందువల్లనే. కనుకనే వారు ప్రతీసారి ఆ పార్టీల వద్ద దేబిరించవలసిన పరిస్థితులు క్రమంగా ఏర్పడ్డాయి. ఇటీవలి 2024 ఎన్నికలతో సహా.
సమస్య ఎక్కడున్నది? ఫ్రాన్స్‌లో బోర్బన్ రాజవంశం ఒకటుండేది. వారి వందల ఏండ్ల చరిత్రలోకి ఇక్కడ పోలేం గానీ, వారికి సంబంధించిన ఒక సామెత ఉంది. వారు తమ చరిత్రకు సంబంధించి ఏదీ మరిచిపోరు, ఏదీ నేర్చుకోరు (ఫర్గెట్ నథింగ్, లెర్న్ నథింగ్) అని. కాంగ్రెస్ విషయమై, అంతకన్నా ముఖ్యంగా నెహ్రూ-గాంధీ కుటుంబ విషయమై ఈ సామెత బాగా సరిపోతుంది. వారికి చరిత్ర పాఠాలు నేర్చుకునే లక్షణమే ఉంటే.. పటేల్, సుభాష్ చంద్రబోస్‌ల స్మృతులను తొక్కివేసి, ఇంకా తొక్కివేస్తూనే ఉండేవారు కాదు.
పటేల్ విగ్రహ ప్రతిష్ఠాపనను బీజేపీకి, ప్రధాని మోదీకి వదలడం గాక తామే ఆ పని చేసేవారు. నేతాజీ చితాభస్మ కలశాన్ని ఎన్నడో జపాన్ నుంచి తెప్పించేవారు. కానీ, ఆ పనులు చేయనిది ఎందుకు? వారికి అధికార లాలస తప్ప ప్రజాభిప్రాయాలను, సంస్కృతిని గౌరవించే సంస్కారం లేదు. ఇంత చేసినా చివరకు అధికారం చేజిక్కించుకోగలమనే భ్రమలు, దురహంకారం కూడా చాలా ఉన్నాయి. రాజీవ్‌గాంధీ పేరిట హైదరాబాద్‌లో, తెలంగాణలో ఇప్పటికే తగినన్ని ఉన్నాయి. అయినా మరొక విగ్రహం కావాలంటే, ఒకటి కాకపోతే పది పెట్టుకోవచ్చు. కానీ, తెలంగాణ తల్లి విగ్రహం కోసమని కొంతకాలం కిందటే నిర్దిష్టంగా గుర్తించిన స్థలంలోనే ఆమెను తోసిరాజని మరీ ఆయన విగ్రహం నెలకొల్పడం అంత తప్పనిసరి అవసరమా? అధికార తాబేదారీకి ఒక పరిమితి అక్కరలేదా? పాఠాలు నేర్చుకుంటే వారే బాగుపడతారు. కాస్త ప్రశాంతంగా ఆలోచించే విజ్ఞులెవరూ వారిలో లేరా? పటేల్ విగ్రహ ప్రతిష్ఠాపన ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోరా?
– టంకశాల అశోక్