‘ఏ దొడ్లో కడితే ఏంది, మా దొడ్లో ఈనితే చాలు’ అనే సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ఎందుకంటే.. ఈ ఏడాది రాష్ట్రంలో 170 లక్షల టన్నుల ధాన్యం పండిందని రేవంత్ సర్కార్ జబ్బలు చరుచుకుంటున్నది. ఈ అద్భుతం తమ వల్లే సాధ్యమైందని ప్రచారం చేసుకుంటున్నది కాబట్టి. ఇంతగనం గొప్పలకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్నేండ్లయ్యింది? రెండేండ్లు కూడా సరిగా నిండలేదు. ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులెన్ని? కొత్తగా నీళ్లు పారించిన ఎకరాలెన్ని? ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా అవలోకనం చేసుకోవాలి.
బీఆర్ఎస్ పార్టీపై, మా అధినేత కేసీఆర్ కుటిల పన్నాగం పన్నుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాడా? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోయి ఉంటే రాష్ట్రంలోని చెరువులన్నీ ఎండకాలం కూడా నిండుకుండల్లా ఉండేవేనా? బీడు భూముల్లోనూ రైతులు రెండు పంటలు తీసేవారా? పదేండ్ల కిందట ఎడారిలా ఉన్న భూములన్నీ వరి పంటతో పచ్చగా కళకళలాడేవేనా? మరెందుకు కాళేశ్వరంపై ఇన్ని కుట్రలు?
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని తెలంగాణ ధాన్యసిరిని తన ఖాతాలో వేసుకుంటున్నది. సింహం తన చరిత్ర రాయకపోతే వేటగాడు చెప్పిందే చరిత్రవుతుందంటారు కాబట్టి, ఈ వ్యాసం రాయాల్సి వస్తున్నది. 2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఈ ప్రాంతంలో 30 లక్షల టన్నుల వరి ధాన్యం పండితే మహా గొప్ప. అలాంటిది ఇప్పుడు అంతకు 6 రెట్ల వరి ధాన్య ం రాష్ట్రంలో దిగుబడి అవుతున్నది. అబద్ధాల, అసమర్థ కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలోనే ఇది సాధ్యమైందా? అని ఏ పసిపిల్లాడినడిగినా ఠక్కున కాదని చెప్తాడు. ఈ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సాధ్యమైంది. అపరభగీరథుడైన కేసీఆర్ వల్లే సాధ్యమైంది. కాదని కండ్లున్న కాంగ్రెస్ కబో దులు అనవచ్చు. బీజేపీ వాళ్లూ అనవచ్చు. కానీ, రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికైనా వెళ్లి రైతులను అడిగితే తమ గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్‌నే చూపిస్తారు.
బీఆర్ఎస్ పార్టీపై, మా అధినేత కేసీఆర్‌పై కుటిల పన్నాగం పన్నుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తాడా? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోయి ఉంటే రాష్ట్రంలోని చెరువులన్నీ ఎండకాలం కూడా నిండుకుండల్లా ఉండేవేనా? బీడు భూముల్లోనూ రైతులు రెండు పంటలు తీసేవారా? పదేండ్ల కిందట ఎడారిలా ఉన్న భూములన్నీ వరి పంటతో పచ్చగా కళకళలాడేవేనా? మరెందుకు కాళేశ్వరంపై ఇన్ని కుట్రలు? కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టు అని కాంగ్రెస్ అంటే.. తందానా అని తలలూపుతున్న బీజేపీ సాగిస్తున్న ప్రచారం ఎందుకోసం? కేసీఆర్ ప్రతిష్ఠను దిగజార్చడం కోసమే ఈ రెండు జాతీయ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా రైతుల బతుకులతో ఆటలాడుకుంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపించడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నాయి.
2013 అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాకు కుంగిపోవడమే ఒక మిస్టరీ. నాడు ఏదో బాంబు పేలినట్లు పెద్ద శబ్దం వచ్చిందని అక్కడి స్థానికులు చెప్పారు. పలు చర్చా కార్యక్రమాల్లో ప్రముఖ విశ్లేషకులు వి.ప్రకాశ్ కూడా ఆరోపించారు. కానీ, ఆ తర్వాతనే 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కోడ్ కారణంగా ఈ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వెళ్లిపోయింది. ఊహించినట్టుగానే కాంగ్రెస్ ఈ అంశమే ప్రధానంగా ఎన్నికల ప్రచారానికెత్తుకున్నది. ఒక్క పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టే విఫలమైందని, కాళేశ్వరం కూలిపోయిందని, రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయని అబద్ధపు ప్రచారం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించింది. కాళేశ్వరం వల్ల పెరిగిన కేసీఆర్ ప్రతిష్టను గుర్తించి, ఆ ప్రాజెక్టు ఫలాలను అందించినంత కాలం ప్రజలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకుంటారని తెలిసే కాంగ్రెస్ ఈ బూటకపు ప్రచారానికి ఒడిగట్టింది. ‘పోయిన వానకాలం మేడిగడ్డలో నీరు నిల్వ లేవు. అయినా పంటలు పండాయంటే కాళేశ్వరం పాత్ర ఏమీ లేనట్టే కదా’ అని కొందరు కాంగ్రెస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన భూగర్భ జలాలపై కాస్తయినా అవగాహన ఉంటే వారు ఆ మాట మాట్లాడేవారు కాదు. కాళేశ్వరం నీళ్లతో కాలువలు పారాయి. చెరువులు నిండాయి. ఈ క్రమంలో ఆ మేర భూగర్భ జలాలూ పెరిగాయి. ఈ రోజు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని బావుల్లో నీళ్లు ఉంటున్నాయంటే, గతంలో వట్టిపోయిన బోర్లు కూడా నేడు నిరంతరంగా నడుస్తున్నాయంటే దానికి కాళేశ్వరమే కారణం.
కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజీ ఒక్కటేనా, కానే కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ మూడు పెద్ద బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 పంప్‌హౌజ్‌లు, 1,800 కిలోమీటర్ల మేర కాలువలు, పైపులైన్లు, సొరంగ మార్గాలు. 160 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం, గోదావరి నీటిని ఎదురెక్కించి, ఎత్తుగడ్డ మీద ఉన్న మెదక్‌కు సాగునీళ్లు, హైదరాబాద్‌కు తాగునీళ్లు అందించడం. ఇదీ యావత్ కాళేశ్వరం ముఖచిత్రం.
ఇంత పెద్ద ప్రాజెక్టులోని ఒక బ్యారేజీలో, ఒక పిల్లరు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందన్న దుర్మార్గపు ప్రచారంతో కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుకోవచ్చు. కానీ, ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని మాత్రం గెలుచుకోలేదు. సరే, మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ కుంగిపోవడంలో మానవ కుట్ర లేదని కాసేపు అనుకుందాం. మరి ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? సాగునీటి ప్రాజెక్టుల్లో ఇబ్బందులు రావడం కొత్తేమీ కాదు. గతంలో నాగార్జునసాగర్‌లోనూ సమస్యలు వచ్చాయి. నాటి ప్రభుత్వాలు మరమ్మతులు చేయకుండా చోద్యం చేస్తూ కూర్చున్నాయా? వెంటనే మరమ్మతులు చేశాయి. మరి మేడిగడ్డకు కాంగ్రెస్ సర్కార్ ఎందుకు మరమ్మతులు చేయడం లేదు? అంటే, ఎక్కడో, ఏదో తేడా ఉన్నట్టే కదా? రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కుమ్మక్కై తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాయి. అందుకే, మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని కాంగ్రెస్ ఇలా చెప్పిందో లేదో, కేంద్రం నుంచి హడావుడిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు పరుగెత్తుకువచ్చారు. కనీసం బ్యారేజీ నీళ్లలోకి దిగకుండానే, మట్టిని పరిశీలించకుండానే ఇంజినీరింగ్ లోపం ఉందని, ఇసుకలో కట్టారని మూడు రోజుల్లోనే తేల్చేశారు. అరే.. నిజమా అని, విచారణ పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏడాదిగా విచారణ చేస్తూనే ఉన్నది. కానీ, అసలు లోపం ఎక్కడ ఉందనేది చెప్పలేక గడువు మీద గడువు పొడిగించుకు పోతున్నది. కాంగ్రెస్ చెప్పినట్టు.. ఓ వానకాలం వచ్చి వెళ్లిపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు ఆ వరదల్లో కొట్టుకుపోలేదు. ఇంకా పటిష్ఠంగా నిలబడింది. కాంగ్రెస్ చెప్పేదంతా బూటకమని ఎలుగెత్తి చాటింది. మళ్లీ వానకాలం వస్తున్నది. మళ్లీ నిలబడుతుంది. అందులో అనుమానమే లేదు.
ఇక కేసీఆర్‌కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల విషయానికి వద్దాం. అసలు ఎందుకీ నోటీసులు? తొండలు గుడ్లు పెట్టే భూములను సస్యశ్యామలం చేసినందుకా? ఒక్క పంటకే నీళ్లు రాని భూముల్లో రెండు పంటలు పండేలా చేసినందుకా? మిషన్ కాకతీయతో చెరువులు తవ్వించి, కాళేశ్వరం నీళ్లతో వాటిని నింపినందుకా? తెలంగాణకు జలసిరి తెచ్చినందుకా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించినందుకా? ఎందుకీ నోటీసులు? కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయంటూ ఏడాది కిందట ఏర్పాటుచేసిన ఈ కమిషన్ విచారణ చేస్తూనే ఉన్నది. ఎంతో మంది ఇంజినీర్లను, అధికారులను విచారించింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా ఎవరైనా.. ఏమైనా చెప్తారేమో.. దాన్ని బట్టి విచారణకు పిలుద్దామన్నట్టు ఇన్ని రోజులు ఆతృతగా ఎదురుచూసింది. ఆఖరికి ‘మీరు చెప్పినట్టే చేశామని మీ ఇంజినీర్లు, అధికారులు అంటున్నారు. దీనిపై సమాధానం చెప్పండి’ అని ఎట్టకేలకు మొన్న కేసీఆర్‌కు నోటీసులు పంపించింది. కాళేశ్వరంలో నిజంగానే అవినీతి జరిగి ఉంటే.. ‘అవినీతి జరిగిందని అధికారులు అంగీకరించారు. సమాధానం ఇవ్వండి’ అని ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతగాకే ఆత్మస్తుతి, పరనిందపై ఆధారపడ్డారు. మాట్లాడితే కేసీఆర్‌ను విమర్శించడం, బీఆర్ఎస్ వల్లే రాష్ట్రం నాశనమైందని ఆరోపించడం తప్పితే, తాము ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. ఆ కుర్చీని కేసీఆర్ మీద కక్ష తీర్చుకునేందుకు మాత్రమే వాడుకుంటాననుకోవడం అవివేకమే అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసింది, వడ్డీలకే ఆదాయమంతా పోతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి ఓ వైపు చెప్తూనే ఏడాది కాలంలోనే రూ.లక్షన్నర కోట్ల అప్పు చేశారు. అదేంటని అడిగితే ఆ అప్పుతో వడ్డీ కడుతున్నామంటున్నారు. వడ్డీ కట్టాలంటే మళ్లీ అప్పులు చేయాలన్న ఆర్థిక సూత్రాన్ని ఏ ఆర్థికవేత్త చెప్పారో రేవంత్ రెడ్డికి మరి. సంపద సృష్టి అనే మాటే మరిచిపోయారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఊసే ఎత్తట్లేదు. ఎంతసేపూ ఖజానా ఖాళీ అయిందంటున్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా కేసీఆర్ నిలబెడితే, తెలంగాణను అప్పుల రాష్ట్రంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా దెబ్బతీస్తున్నారు.
ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే, అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ వేయకున్నా 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో పోటీ పరీక్షలు జరిగి, ఇప్పుడు నియామకపత్రాలు ఇస్తూ ఫొటోలకు పోజులిస్తున్నారు. ఎన్నికల ముందు యువతను రెచ్చగొట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పడు వారి ఆగ్రహాన్నే ఎదుర్కొంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఏదని ప్రభుత్వాన్ని నిలదీయడానికి నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. ఆరు గ్యారెంటీలు ఏవని గ్రామాల్లో ప్రజలు స్థానిక కాంగ్రెస్ నేతలను నిలదీస్తున్నారు. సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు నిరసనలు తెలుపుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వాస్తవాలను ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై నిందలు మాని పాలనపై దృష్టిపెట్టి ముందుకు వెళ్తే ప్రజలు మిగతా మూడున్నరేండ్లు భరిస్తారు. లేకపోతే మధ్యలోనే తరిమేస్తారనడంలో ఏ మాత్రం సందేహం లేదు.